మహా నీరాజనం

ABN , First Publish Date - 2022-09-26T05:30:00+05:30 IST

కొణికిలో సోమవారం ఉదయాన్నే ఉపాహారం పూర్తి చేసి, సూర్యరథానికి పూజలు చేసి, వేంకటేశ్వర స్వామికి హారతులు పట్టి యాత్రకు వందలాది మంది ఉపక్రమిం చారు.

మహా నీరాజనం

రైతుల మహా పాదయాత్రకు 

అడుగడుగునా అద్భుత స్వాగతం

హారతులు పట్టి.. పూలవర్షం కురిపించారు

మహిళలకు కుంకుమద్ది హారతులిచ్చారు

దారి పొడవునా వేచి వున్న మహిళలు, వృద్ధులు

ఆకు పచ్చ కండువాలతో నిండైన ఆదరణ

యాత్రికుల పట్ల గోదావరి ప్రేమానురాగాలు

కదిలివచ్చిన పితాని, నిమ్మల,రామరాజు, చింతమనేని 

పెదపాడులో ఎడ్ల బళ్లతో ర్యాలీ


రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న మహా పాదయాత్రకు ఏలూరు జిల్లావాసులు నీరాజనం పలికారు. కృష్ణా జిల్లాలో యాత్రను ముగించుకుని ఏలూరు జిల్లాకు చేరుకున్న యాత్ర 15వ రోజు కొణికి నుంచి అత్యంత ఉత్సాహంతో.. ఇనుమడించిన ధైర్యంతో ప్రారంభమైంది. తమ అత్యంత ఆప్తులు తమ ఊరికి వచ్చినట్లు ఆప్యాయతలను ప్రదర్శించారు. పూల జల్లులు కురిపించారు. హారతులు పట్టారు. దీవెనలిచ్చారు. ధైర్యం చెబుతూనే పట్టుదలతో సాధించండంటూ మరింత ఉత్సాహపరిచారు. 


ఏలూరు/పెదపాడు సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): 

కొణికిలో సోమవారం ఉదయాన్నే ఉపాహారం పూర్తి చేసి, సూర్యరథానికి పూజలు చేసి, వేంకటేశ్వర స్వామికి హారతులు పట్టి యాత్రకు వందలాది మంది ఉపక్రమిం చారు. యాత్ర ఆరంభంలో అన్ని పక్షాలు స్వాగతం పలికి మద్దతు తెలిపాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు, వివిధ పక్షాల నేతలు కొణికికి తరలి వచ్చి పాద యాత్రికులకు సంఘీభావాన్ని తెలిపారు. వీరు చేస్తున్న పాదయాత్ర ఊరకనే పోదు.. కచ్చితంగా విజయం మీదేనంటూ ధైర్యంతో కూడిన ప్రకటనలు చేస్తూనే వారి వెంట నడిచారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యేలె చింతమనేని ప్రభాకర్‌, గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నియోజకవర్గ కన్వీనర్లు బడేటి చంటి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పాలి ప్రసాద్‌ వంటి నేతలంతా అమరావతి నుంచి సుదీర్ఘ యాత్రలో పాల్గొంటున్న వారందరిని పేరు పేరునా పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీ వెంటే మీమంటూ ధైర్యం చెప్పారు. యాత్ర ఆరంభమైన గ్రామంలోనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. ఎక్కడా సడలకుండా.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదాలతో వందలాది మంది ముందుకు సాగారు. ఒక దశలో కొణికిలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగుతుందేమోనని అందరూ కాస్తంత గందరగోళపడ్డారు. పోలీసులు అప్రమత్త మయ్యారు. మార్గమంతా పోలీసులు మోహరించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ కన్పించారు. ముందు నుంచి పాదయాత్రలో క్రమశిక్షణ పాటిస్తున్న వారంతా అదేస్థాయిలో నెమ్మదిగా ముందుకు సాగారు. పాదయాత్రకు ముందు వరుసలో సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన వారంతా నడుస్తుండగా ఆ వెనుకే వస్తున్న సూర్యరథం, దాని వెనుక రెండు వరుసలలో సాగుతున్న అమరావతి రైతులు అందరిని ఆకట్టుకున్నారు. ముకుళిత హస్తాలతో అమరావతి అనుకూల నినాదాలతోనే సుదీర్ఘ యాత్రలో కొనసాగారు. 


కొణికి నుంచి కొత్తూరు వరకు..

15వ రోజు పాదయాత్ర ఆసాంతం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు మండలంలో 17 కిలోమీటర్లు సాగింది. కొణికిలో పాద యాత్రికుల పట్ల ఆదరణ ప్రదర్శించారు. దగ్గరుండి మరీ అంతా బాగుందా అంటూ ఆరా తీసి భుజం తట్టారు. మహిళలకు కొందరు పూలు, కుంకుమ అందించారు. దసరా నవరాత్రులు ఆరంభం కావడంతో సోమవారం నుంచే ఎక్కడికక్కడ దసరా ఉత్సవాలు ఆరంభం కావడంతో దీని ప్రభావం యాత్రలో కనిపించింది. కడిమికుంట వద్ద రోడ్డుకు ఇరు వైపులా నిల్చొని పాద యాత్రికులపై పూలజల్లు కురిపిం చారు. హారతులు పట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు తరలివచ్చి యాత్రను తిలకించారు. తమ ముంగిటే కదులుతున్న యాత్ర, వాహన శ్రేణులను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డారు. జై అమరావతి నినాదాలతో గొంతు కలిపారు. చిన్నారులు సైతం రోడ్లపై నృత్యాలు చేశారు. వృద్ధులు సైతం ఆకుపచ్చ కండువాలు ధరించి, చేతిలో మంచినీటి బాటిళ్లను పట్టుకుని ఎక్కడా అలసిపోకుండా నిండు ధైర్యంతో నడక సాగించారు. పలువురు గుమిగూడి కనిపించినచోట వారితో సైతం జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ స్ఫూర్తినింపారు. ఒక వైపు ఉక్కపోత, మరోవైపు ఆలసట వెన్నాడుతున్నా పాదయాత్రికులెవరూ నిమిషం సేద తీరకుండా ఉదయం తొమ్మిది గంటల నుంచి భోజన విరామం రెండు గంటల వరకు ముందుకు సాగారు.  అమరావతి జేఏసీ నేతలు ముందుకు సాగు తుండగా వారిని మార్గమధ్యలో అనేక మంది కలిసి మద్దతు ప్రకటించారు. జేఏసీ సభ్యురాలు రాయపాటి శైలజ, సునీత, గద్దె తిరుపతిరావు, నాగూర్‌మీరాలు ఎక్కడికక్కడ పర్యవేక్షించారు. సూర్యరథం చూసేందుకు దారి పొడవునా అన్ని గ్రామాల్లో ప్రజలు ఆసక్తిని కనబర్చారు. 


అంతటా చింతమనేని హల్‌చల్‌

పాదయాత్ర ఆసాంతం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ హల్‌చల్‌ కన్పించింది. యాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఆయన పాదయాత్ర చేస్తూ అందరిని మార్గమధ్యలో సమన్వయపర్చారు. దేవాలయాల్లో పూజలు చేశారు. ఎక్కడా రోడ్డుపై ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన పేరుతో ఉన్న అమరావతి జెండాలను చేత పట్టి కుర్రకారు హడావిడి చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల జిల్లా అధ్యక్షులు పాదయాత్రలో పాలు పంచుకున్నారు. టీడీపీ జిల్లా రైతు అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, సీపీఐ పక్షాన డేగా ప్రభాకర్‌, కృష్ణచైతన్య, బండి వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు మాలతీరాణి, కట్నేని కృష్ణప్రసాద్‌, జనసేన నేతలు రెడ్డి అప్పలనాయుడు, ఘంటశాల వెంకటలక్ష్మి, ఉప్పలపాటి రాంప్రసాద్‌, గుత్తా అనిల్‌, గారపాటి రామసీత, మోరు శ్రావణి, లావేటి శ్రీనివాసరావు, పొట్లూరి యుగంధర్‌, కొత్తూరు రాజు, బొప్పిడి కాశీబాబు, వేమూరి శ్రీనివాసరావు, మోరు ధశరధ్‌, కొక్కిరగడ్డ జయరాజు, బొప్పన సుధాకర్‌, నేతల రవి తదితరులు పాల్గొన్నారు. 


Read more