మాయిశ్చర్‌తో మాయ

ABN , First Publish Date - 2022-12-07T01:39:35+05:30 IST

మొత్తం ధాన్యం మేమే కొంటాం. ఆర్బీకేల ద్వారా రైతులకు మద్దతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోలులో ముందుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వ చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవ దూరంగా ఉన్నాయి.

 మాయిశ్చర్‌తో మాయ
మిల్లర్‌ తిప్పి పంపిన ధాన్యం లోడు

ప్రభుత్వ నిబంధనలు ఒకలా, మిల్లర్లు చెప్పేది మరోలా

నిర్ఘాంతపోతున్న రైతులు

ముసునూరు, డిసెంబరు 6: మొత్తం ధాన్యం మేమే కొంటాం. ఆర్బీకేల ద్వారా రైతులకు మద్దతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోలులో ముందుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వ చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవ దూరంగా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చెక్కపల్లి రైతులు తమ ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా విక్రయించగా ప్రభుత్వ అధికారులు పరీక్షించి నిబంధనల ప్రకారం ధాన్యం ఉందని మిల్లర్లకు పంపించారు. అయితే సదరు ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోవాల్సిన ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన మిల్లర్‌ మాత్రం ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందంటూ వాటిని తిరిగి రైతులకు తిప్పి పంపడంతో వారు నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్బీకేల్లో 5.5తో తేమ శాతం రీడింగ్‌ తీసి సోమవారం సాయంత్రం సుమారు 20 టన్నుల ధాన్యాన్ని మిల్లర్‌కు పంపారు. రైస్‌మిల్‌ నిర్వాహకులు సదరు ధాన్యాన్ని 4.5తో తేమ శాతం రీడింగ్‌ తీయడంతో 21 తేమ శాతం ఉన్నట్లుగా రావడంతో తమ ప్రమాణాలకు సదరు ధాన్యం పనికిరాదంటూ మిల్లర్‌ ధాన్యం లోడ్‌ లారీని మంగళవారం తిరిగి వెనక్కి పంపించారు. దీంతో సదరు ధాన్యాన్ని ఆర్బీకేకి పంపిన రైతులు కాటేపల్లి గంగాధరరావు, కాటేపల్లి జాస్తిలక్ష్మి, కాటేపల్లి లింగారావులు విస్తుపోయారు. ధాన్యం ఆర్బీకేలకే అమ్మాలని, నిబంధనలు పెట్టి అటు మిల్లర్లకు అమ్మనివ్వకుండా, ఇటు ఆర్బీకేలు అటు మిల్లర్లు రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారంటూ బాధిత రైతులు వాపోయారు. ధాన్యాన్ని తిప్పి పంపడంతో తమకు రవాణా ఖర్చులు, హమాలీ ఛార్జీల రూపేణా రూ.30వేల వరకు నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధాన్యాన్ని తిప్పి పంపిన విషయమై ముసునూరు తహసీల్దార్‌ దాసరి సుధకు ఫిర్యాదు చేశామని, తమ ధాన్యం నిబంధనల ప్రకారం ఉన్నాయని తహసీల్దార్‌ చెప్పారని, ధాన్యం ఎందుకు తిరిగివచ్చాయో తమకు తెలియటం లేదన్నారు.

తహసీల్దార్‌ వివరణ

దీనిపై ఆంధ్రజ్యోతి తహసీల్దార్‌ను వివరణకోరగా ఆర్బీకేల ద్వారా నిబంధనల ప్రకారమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు పంపటం జరుగుతుందని, అయితే మిల్లర్లు నిబంధనల ప్రకారం 5.5 రీడింగ్‌తో తేమ శాతాన్ని చూస్తున్నారా? లేక తక్కువ రీడింగ్‌తో తేమ శాతాన్ని పరిశీలిస్తున్నారా? అనే విషయాన్ని సమగ్రంగా విచారించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపి, సమస్యను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సుధ తెలిపారు.

Updated Date - 2022-12-07T01:40:19+05:30 IST