ఆస్తి రూ.కోటి.. రిజిస్ట్రేషన్‌ రూ.5 కోట్లు

ABN , First Publish Date - 2022-03-16T06:24:57+05:30 IST

తాడేపల్లిగూడెంలోని ఓ వ్యాపార సంస్థ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టింది.

ఆస్తి రూ.కోటి.. రిజిస్ట్రేషన్‌ రూ.5 కోట్లు

బ్యాంకులో రుణం తీసుకుని ఎగ్గొట్టిన వైనం
రంగంలోకి సీబీఐ అధికారులు
 ‘సబ్‌ రిజిస్ర్టార్‌’లో డాక్యుమెంట్ల పరిశీలన
 తాడేపల్లిగూడెంలో ఓ వ్యాపార సంస్థ నిర్వాకం


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలోని ఓ వ్యాపార సంస్థ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టింది. తక్కువ ధర ఉన్న భూమికి సదరు వ్యాపార సంస్థ రెక్కలు తొడిగింది. తమ వద్ద పనిచేసే సిబ్బంది, బంధువుల పేరుతో ఆస్తిని విభజించింది. వారంతా సంస్థ యజమాని పేరు తో ఉన్న భూమిని కొనుగోలు చేసినట్టు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ చేశారు. అక్కడే మతలబు జరిగింది. కేవలం రూ.75 లక్షలున్న ఆస్తి విలువను దాదాపు రూ.5 కోట్లుగా చూపించారు. ఆ మేరకు స్టాంప్‌ డ్యూటీ చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. సుమారు 2,000 గజాలు ఉన్న ఆస్తిని ఐదు విభాగాలుగా విభజించి రిజిస్ర్టేషన్‌ జరిగింది. అక్కడితో ఆగలేదు. కొనుగోలుదారుల పేరుతో ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి.. తమ వద్ద పనిచేసే సిబ్బంది పేరుతో రుణం తీసుకున్నారు. ఈ వ్యవహా రమంతా 2019లో జరిగింది. అప్పటి నుంచి బ్యాంకుకు రుణం చెల్లించలేదు. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. డాక్యుమెంట్లను  పరిశీలిస్తోంది. తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ను దస్తావేజులు తీసుకురావాలని సీబీఐ ఆదేశాలు జారీచేసింది. నేరుగా సీబీఐ ఎస్పీకి డాక్యుమెంట్‌లు సమర్పించారు. ప్రస్తుతం దస్తావేజులు పరిశీలనలో ఉన్నాయి. బ్యాంకు రుణాలు చెల్లించి ఉంటే ఎటువం టి ఇబ్బంది ఉండేది కాదు. అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోయేది. జిల్లాలో ఇటువంటి దందాలు అనేకం ఉంటున్నాయి. ప్రజాప్రతినిధుల సహకారంతో అధిక ధరలకు రిజిస్ర్టేషన్‌లు చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు రిజిస్ర్టేషన్‌లు చేసుకుని బ్యాం కుల్లో రుణాలు పొందుతున్నారు. తీరా రుణాలు చెల్లించకుండా చేతులెత్తేస్తున్నారు.  


సీబీఐ ఐదు కేసుల దర్యాప్తు


ఒక్క తాడేపల్లిగూడెంలోనే ఇటీవల ఐదు కేసులపై సీబీఐ దర్యాప్తు చేసింది. డాక్యుమెంట్‌లను పరిశీలించింది. రిజిస్ర్టేషన్‌ శాఖకు స్టాంప్‌ డ్యూటీ రూపంలో సొమ్ములు వస్తున్నాయన్న ఉద్దేశంతో సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు చేసేస్తున్నారు. అక్కడ కూడా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. బ్యాంకులు కూడా పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చినప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. భూమి ధరను నిర్ధారించుకోవాలి. రుణం ఇవ్వాలి. అలా కాకుండా పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా యజమానులు రుణాల ను ఎగ్గొడుతున్నారు. అంతిమంగా బ్యాంకులు నష్టపోతున్నాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఓ వ్యాపార సంస్థ నిర్వాకంపై సీబీఐ రంగంలోకి దిగడం స్థానికంగా చర్చ జరుగుతోంది.

Read more