-
-
Home » Andhra Pradesh » West Godavari » itda meeting-NGTS-AndhraPradesh
-
సమస్యలే లేవన్నారు..!
ABN , First Publish Date - 2022-09-08T05:47:31+05:30 IST
‘కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు.

ఐటీడీఏ సమావేశంలో అధికారులపై కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఫైర్
శాఖల వారీగా సమీక్షలు.. అన్నింటా సమస్యల వెల్లువ
ఎప్పటిలోగా పరిష్కారిస్తారంటూ నిలదీత
ఆ పనులు చేస్తున్నారా ? మాకు తెలియదే
ఆశ్చర్యపోయిన ప్రజాప్రతినిధులు
సమన్వయంతో ముందుకెళ్లాలన్న కలెక్టర్
పనుల పురోగతిపై అసంతృప్తి
బుట్టాయగూడెం, సెప్టెంబరు 7 : ‘కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు. స్పందన, వారం వారం జరిగే శాఖల సమీక్షల్లో సమస్యలే లేవన్నట్లు ప్రకటించే అధికారులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. అధికారులు చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేదు. వచ్చే సమావేశానికైనా పద్ధతిలో మార్పు రావాలి. లేకుంటే చర్యలు తప్పవు’ అంటూ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ వై.ప్రసన్న వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను ఎప్పటిలో పూర్తిచేస్తారో కచ్చితమైన తేదీని ప్రతి శాఖ తెలపాలంటూ స్పష్టం చేశారు. మరో పాలకవర్గ సమావేశానికి ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఆర్డబ్ల్యూఎస్ పనితీరుపై సమీక్ష చేస్తూ ఏజెన్సీలో మంచినీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ములగలగూడెం నిర్వాసిత కాలనీలో 38 కుటుంబాలకు రెండేళ్లుగా మంచినీటి సదుపాయం కల్పించలేదు. అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ? అని ప్రశ్నించారు. 17 మండలాల్లో ఐదు లక్షల జనాభాకు సత్యసాయి మంచినీరు నిలిచిపోయిందని ఎప్పటికి పునరుద్ధ్దరిస్తారని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
చెరువులను తలపిస్తున్న రోడ్ల విషయంలో ఆర్అండ్బి శాఖ అధికారులు తీసుకున్న చర్యలపై కలెక్టర్ రివ్యూ చేశారు. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపగా నిధులు విడుదల అయ్యాయని, పనులు జరుగుచున్నట్లు అధికారులు తెలిపారు. కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం మధ్య రోడ్డు దుస్థితిపై కలెక్టర్ ప్రశ్నించగా వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బీ ఎస్ఈ తెలిపారు. హెవీ వెహికల్స్‌కు టోల్గేట్ ఏర్పాటు చేయాలని వచ్చిన డబ్బులతో రోడ్డును బాగుచేయించాలని అందుకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వాన్ని నివేదిక పంపుతానని కలెక్టర్ తెలిపారు.
ఇరిగేషన్ శాఖపై సమీక్ష చేస్తూ పోగొండ జలాశయం నుంచి ఇప్పటి వరకు సాగు నీటిని విడుదల చేయలేదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమావేశం దృష్టికి తేగా కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. పదేళ్లుగా సాగునీరు ఇవ్వని ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పీల్డ్ ఛానల్స్ పూర్తి కానందున శివారు భూములకు సాగు నీరందడం లేదన్నారు. నాలుగు వేల ఎకరాలకు సాగునీటి కోసం కట్టిన జలాశయం నుంచి 2005 ఎకరాలకు మాత్రమే నీటిని ఇస్తున్నట్లు తెలిపారు. సాగునీటి చెరువుల అభివృద్దికి రూ.65 కోట్లతో ప్రతిపాదనలు పంపామని 4 నెలల్లో పనులు పూర్తిచేసి జలాశయం నుంచి నీటిని అందిస్తామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఏపీఐడీసీ శాఖ ఏజెన్సీలో ఇన్ని పనులు చేస్తున్న విషయం తమకు తెలియదని ఎమ్మెల్యేతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. గృహ నిర్మాణం, రోడ్లు, ఇరిగేషన్ శాఖల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కలెక్టర్ పనుల్లో వేగం పెరగాలన్నారు. పలుచోట్ల సమన్వయలోపం కనిపిస్తోందన్నారు. అక్టోబరు నాటికి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ సెంటర్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
కొండరెడ్డి ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలను అక్కడే కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు.లంకపాకల పాఠశాలను కొనసాగించాలన్నారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో సోలార్ విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగు నీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
సమావేశానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీవో నాయుడిని ఆదేశించారు. ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, పీవో జి.శ్రీను కుమార్, సీఈవో కె.రవికుమార్, డీపీవో బాలాజీ, ఆర్డీవో ఎం.ఝాన్సీ రాణి, డీఎంహెచ్‌వో డా.రవి, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, వివిధ శాఖల అధికారులు,ఏజెన్సీ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.