ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్‌ కేసులు : ఎస్పీ

ABN , First Publish Date - 2022-09-14T05:15:12+05:30 IST

అనుమతులు లేకుండా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసినా, అనుమతులు ఉన్నాయని అక్రమ విక్రయాలు చేసినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ హెచ్చరించారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్‌ కేసులు : ఎస్పీ

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 13 : అనుమతులు లేకుండా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసినా, అనుమతులు ఉన్నాయని అక్రమ విక్రయాలు చేసినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ హెచ్చరించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్‌ జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ టెండర్ల ద్వారా అనుమతి పొందిందని తెలిపారు. వారు అనుమతించిన వ్యక్తులు మాత్రమే ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉందన్నారు. తాము ఇసుక సబ్‌ కాంట్రాక్టర్లమని ఇతర పేర్లతో ఇసుక లావాదేవీలు జరిపినా వారిపై చట్ట పరంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్సు మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసిందని జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు,  చెక్‌పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికడుతున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణా నిర్మూలనకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2022-09-14T05:15:12+05:30 IST