తేమ..తేమ ఎందుకమ్మ తేడా !

ABN , First Publish Date - 2022-12-13T00:13:03+05:30 IST

ధాన్యం సేకరణలో అనేక ని‘బంధనలు’. మరెన్నో కర్కోటక ఆంక్షలు. పైపైకి ఆర్‌బీకేలు నిక్కచ్చి అంటున్నా లోలోన లొసుగులు. తేమశాతం నిర్ధారణలో తకరారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే అన్నదాతకు అష్ట కష్టాలు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ఆంక్షల చట్రంలో నలిగి వేశారారు. తడిసిన ధాన్యం ఆరబెట్టి సేకరణ కేంద్రాలకు చేరవేయాలనుకున్న రైతులకు అనేక అగ్ని పరీక్షలు.

తేమ..తేమ ఎందుకమ్మ తేడా !
ఏలూరు కలెక్టరేట్‌ వ్ద రైతుసంఘం ఆందోళన

శాతంపై ఒక్కొచోట ఒక్కొ రకంగా నిర్ధారణ

ధాన్యం పండించిన రైతులతో చెలగాటం

తుఫాన్‌ వెలిసినా కమ్ముకున్న కష్టాలు

కల్లాల్లోనే టన్నుల కొద్దీ ధాన్యం

ఆర్‌బీకేల పాత్రపై అసంతృప్తి

పరిష్కారం చూపని అధికార యంత్రాంగం

రైతులకు ఇదేం ఖర్మ అంటున్న టీడీపీ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ధాన్యం సేకరణలో అనేక ని‘బంధనలు’. మరెన్నో కర్కోటక ఆంక్షలు. పైపైకి ఆర్‌బీకేలు నిక్కచ్చి అంటున్నా లోలోన లొసుగులు. తేమశాతం నిర్ధారణలో తకరారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే అన్నదాతకు అష్ట కష్టాలు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ఆంక్షల చట్రంలో నలిగి వేశారారు. తడిసిన ధాన్యం ఆరబెట్టి సేకరణ కేంద్రాలకు చేరవేయాలనుకున్న రైతులకు అనేక అగ్ని పరీక్షలు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రైతులు నానా అవస్థలు పడుతు న్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొంద రగా సేకరణ కేంద్రాలకు చేర్చి కాస్తంత ఊపిరి పీల్చుకుందా మనుకుంటే కొన్ని చోట్ల సంచుల కొరత, మరికొన్ని చోట్ల రవాణా వాహనాల ఇబ్బంది. ఇంకొన్ని చోట్ల ఆర్‌బికేలకు, మిల్లర్లకు మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా. కల్లాలమీద టన్నుల కొద్దీ ధాన్యం. సేకరించింది మాత్రం అంతంత మాత్రమే. రైతులు చెల్లించింది కొంచమే. రైతుపక్షాన ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి సందర్శనకు దిగుతున్నారు.

తేమశాతం తికమక

గోదావరి జిల్లాల్లో రెండు పంటలు ధాన్యమే. డెల్టాలో, మిగతా ప్రాంతా ల్లోనూ వరి పంటదే అగ్ర భాగం. గడచిన మూడున్నరేళ్లలో ప్రతీ ఏటా మాది రిగానే ధాన్యం సేకరణకు రైతులు ముందుకు వస్తున్నా జగన్‌ సర్కార్‌ అనేక ప్రయోగాలు. ఒకసారేమో మహిళా గ్రూపులకు ఇచ్చింది..ఇంకోసారేమో సొసై టీలపై భారం వేసింది..ఇప్పుడేమో అదీ ఇదీ కాదు రైతు భరోసా కేంద్రాలే అంటూ సెలవిచ్చింది. సేకరణలో కొత్త నిబంధనలు తెరముందుకు తెచ్చింది. సజావుగా సాగా ల్సిన సేకరణ కాస్తా ఇప్పుడు తికమకపడింది. ధాన్యం కల్లాల నుంచి మిల్లుకు చేరేంత వరకు ఒకటా.. రెండా సవాలక్ష కొత్త కొత్త ఆంక్షలు. దీనిలో ప్రధాన మైనది తేమ శాతం. ఆర్‌బీకేలు, ఆ తరువాత మిల్లర్లకు తేమ నిర్ధారణ అధికారం అప్పగించారు. ఇదే రైతుల పాలిట శాపంగా మారింది. సేకరించాల్సిన ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండాలి. ఆర్‌బీకేలకు వలంటీర్లు తేమ శాతం నివేదికలు ఇస్తున్నారు. తీరా మిల్లుకు వెళితే అబ్బే.. కాదు..కాదు 19–20 శాతం మధ్య ఉందం టూ వెనక్కు పంపేస్తున్నారు. వలంటీర్లే స్వయంగా కల్లాల వద్ద నిర్ధారించిన శాతానికి మించి అప్పటి కప్పుడు మిల్లర్ల దగ్గరకు చేరేసరికి ఇంత తేడా ఏమి టనేది రైతుల ప్రశ్న. కల్లాల నుంచి మిల్లర్ల వరకు ధాన్యం చేర్చాలంటే రైతులకు రక్తకన్నీరే.

ఆర్‌బీకేల పనితీరుపై అసంతృప్తి

కల్లాల నుంచి వేబ్రిడ్జికి ధాన్యం తరలించేటప్పుడు లారీకైతే 20 టన్నులకు మించి ఉండనేకూడదు. ఒకవేళ ఉంటే ససేమిరా అంటున్నారు. వేబ్రిడ్జిల వద్దే ఇలాంటి తకరారులెన్నో. అక్కడి నుంచి నిర్ధారించిన మిల్లర్ల వద్దకు చేర్చేవరకు నానా తిప్పలే. ఇంతకుముందైతే కల్లాల నుంచి ధాన్యం సేకరణ అత్యంత సులువుగానే ఉండేది. ఇప్పుడు జగన్‌ సర్కారులో ఇదొక అగ్నిపరీక్షగా తయారైంది. దళారులకు అవకాశం ఇవ్వరాదని చెప్పి ఆర్‌బీకేలను రంగంలోకి దించినా రైతు కష్టాలు తగ్గాల్సింది పోయి మరింత పెరిగాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ధాన్యం రవాణాకు రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఆర్‌బీకేలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ సంచులు, లారీల కొరతతో ఇబ్బందులపాలవుతున్నారు. ఉంగు టూరు మండలంలోనూ వరికోతలు పూర్తయినా ధాన్యం తరలింపునకు మాత్రం సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. తుఫాన్‌ కారణంగా వర్షాలు ముంచెత్తిన వేళ భీమవరం రూరల్‌ మండలంలో ధాన్యాన్ని రైతులు ఒబ్బిడి చేసుకు న్నారు. కానీ సేకరణ మాత్రం ముందుకు సాగడమే లేదు. కల్లాల్లోనే పేరుకుపోయింది. తేమశాతం నిర్ధార ణకు వచ్చేసరికి అన్ని మండలాల్లోనూ రైతులందరిదీ నరకయాతన. వలంటీర్లు నిర్ధారించిన శాతానికి, మిల్లర్ల వద్దకు చేరేనాటికి నమోదవుతున్న శాతానికి మధ్య రెండున్న శాతానికి పైబడే వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ తరహా పరిస్థితులు కైకలూరు, పాలకొల్లు, చింతలపూడి, ఆచంట వంటి ప్రాంతాల్లోనూ స్పష్టంగా ఉంది. ఆఖరుకి చింత లపూడి మండలంలో కొందరి ధాన్యం నిబంధనల అడ్డంకులను అధిగమించి మిల్లర్ల వద్దకు చేరితే శాతం గందరగోళాన్ని మిల్లర్లు కొందరు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బస్తాకు 50 రూపాయలు చొప్పున ఫోన్‌పే చేయాలని, లేకుంటే కుదరనే కుదరదని అప్పటి కప్పుడు భీష్మిస్తున్నారని, లేదంటే ఎవరి చేతికైనా నగదు ఇచ్చి పంపించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారంటూ రైతు సంఘాలు ఆరోపి స్తున్నాయి. తేమ శాతంలో వచ్చిన మార్పే దీనికి ప్రధాన కారణమంటున్నారు.

రైతులను చూసేది ఇలాగేనా

ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీది ఆరుగాలం శ్రమించి పండించే రైతులకు సులభమైన మార్గాలను అన్వేషించా ల్సింది పోయి ఏడాదికోమారు కఠిన నియమావళి. ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల టన్నులకుపైబడే లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే మూడున్నర లక్షల టన్నులకు పైబడి ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటిదాకా నాలుగోవంతు మాత్రమే లక్ష్యాన్ని అందుకోగలిగారు. ఒకవైపు తుఫాన్‌, భారీ వర్షాలను తట్టుకుని ఊపిరి సలపకుండా అత్యంత ఆందోళనలో గడిపిన రైతుకు కాస్తంత రిలీఫ్‌ ఇవ్వా ల్సింది పోయి అనేక తంటాలు. అందుకనే రైతుల్లో ఎందుకీ ఖర్మ అంటూ గగ్గోలు. కొనుగోలు విషయంలో ఇప్పటికీ జగన్‌ సర్కార్‌ రైతులకు చుక్కలు చూపిస్తుందని రైతులకు ఎందుకీ ఖర్మ అంటూ కల్లాల వద్దే రైతులను టీడీపీ నేతలు సోమవారం ఓదా ర్చారు. ఎమ్మెల్యేలు రామానాయుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారా మలక్ష్మి తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు పలురువు పరిశీలించారు.

రైతులను ఆదుకోవాలి

ఏలూరు కలెక్టరేట్‌/ భీమవరం అర్బన్‌, డిసెంబరు 12 : మాండూస్‌ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాం గాన్ని ఆదుకోవాలని ఎపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఎపీ రైతు సంఘం, సీపీఐ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు చెల్లించాలని ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంక్షలు లేకుండా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్‌, వెంకటేశ్వర రావు, కె.బేబీ, చాట్ల పుల్లారావు, శ్రీనివాసరావు, ఇందిర, లక్ష్మి, స్వాతి, పెంటయ్య, రెడ్డి శ్రీనివాసడాంగే పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు భీమవరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఽసోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతికి అందించారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం కాలయాపన కారణంగానే వర్షాలకు ధాన్యం రాశులు తడిచి రైతాంగం నష్టాలకు గురైందన్నారు. ఆక్వా సాగుదారులందరికీ విద్యుత్‌ యూనిట్‌ రూపాయిన్నరకే ఇవ్వాలన్నారు. అనంతరం పలు సమస్యమలతో కూడిన వినతీ పత్రాని కలెక్టర్‌కు అందించారు. సీపీఐ నాయకులు కలిశెట్టి వెంకట్రావు, నెక్కంటి సుబ్బారావు, ఎం సీతారాం ప్రసాదు, చెల్లబోయిన రంగారావు, అప్పలస్వామి, దుబాయ్‌ శ్రీను, తిరుమాని కామేశ్వరరావు, కిల్లారి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:13:03+05:30 IST

Read more