బాహుబలి బిల్లులు

ABN , First Publish Date - 2022-09-10T06:32:06+05:30 IST

రెండు మాసాల క్రితం గోదావరి ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లనే మింగేసింది. పక్షం రోజులపాటు చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కుక్కునూరు, వేలేరుపాడు బాధితులంతా చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.

బాహుబలి బిల్లులు
కుక్కునూరులో వరదల సమయంలో ట్రాక్టర్ల ద్వారా సామాన్లు తరలింపు (ఫైల్‌)

గోదావరి వరద ఖర్చు అదుర్స్‌

పలకరింపులు లేకుండానే కోట్లకు లెక్కలు 

వరద పద్దు తయారీలో సూపర్‌ ఆడిటర్లు

సాయపడకుండానే చేశామంటూ జమా లెక్కలు

గోదావరి వరద సొమ్ముకు వల


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : 

రెండు మాసాల క్రితం గోదావరి ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లనే మింగేసింది. పక్షం రోజులపాటు చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కుక్కునూరు, వేలేరుపాడు బాధితులంతా చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. తిండి తిప్పలు, తాగేందుకు చుక్క నీరు లేక చీకట్లో విష పురుగుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆరు వేలకుపైగా నివాస గృహాలు దెబ్బ తినగా, మూడొంతులు అడ్రస్సు లేకుండా గోదాట్లో కలిశాయి. కనీసం పాత ఇళ్లున్న ఛాయ లేనంత వరద బీభత్సం సృష్టించింది. వేలేరుపాడులో మూడొంతులు, కుక్కునూరులో మరిన్ని గ్రామాలు వరద ధాటికి చెల్లాచెదురయ్యాయి. దీని ముందే అంచనా వేసిన కొన్ని గ్రామాల వాసులు అందుబాటులో వున్న ట్రాక్టర్లు, ఆటోలు, సైకిళ్ళను ఉపయోగించి చిన్నాచితక వస్తువులను వెంటేసుకుని పశువులతో సహా కొండ గుట్టలెక్కారు. తాత్కాలికంగా టెంట్‌లు వేసుకున్నారు. అప్పట్లో అధికారులు ముందుచూపు ప్రదర్శించి ఆ మేరకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి వాహనాలను సమకూర్చలేదు. వాయుదళం ద్వారా హెలికాప్టర్లు ఆహార పదార్థాలను, తాగునీటిని కొండ గుట్టలపై తలదాచుకున్న వారికి మాత్రమే జారవిడిచాయి. రెండు నెలల తరువాత వరద బాధితులకు తాము ఎంతో చేశామన్నట్టు అధికారులు చిట్టా పద్దు సిద్ధం చేశారు. గోదావరి వరద తాకిడికి గురైన ఏలూరు జిల్లాకు రెండు కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు  కోటి చొప్పున మంజూరు చేసింది. ఇప్పుడు ఆ దామాషా ప్రకారమే పద్దు మీద పద్దు తయారు చేశారు.

 

వేలేరుపాడులో ఇదోరకం లెక్క 

వేలేరుపాడు మండలంలో వరద ముంపునకు గురై 13 రోజులపాటు వేల మంది విలవిల్లాడారు. కరెంటు లేక, కడుపు నిండా తిండి లేక, కంటి మీద నిద్ర లేక పిల్లాపాపలతో గిలగిల్లాడారు. ఈ బీతావహ పరిస్థితిని చవిచూసిన మండలంలో ఆలస్యంగా శివకాశీపురం, భూదేవిపేట, బండ్లబోరు వంటి ప్రాంతాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారని కన్నాయిగుట్ట వద్ద మరో శిబిరాన్ని నాలుగు రోజులపాటు తెరిచారు. వీటికి రూ.24.50 లక్షలు ఖర్చు చూపించారు. రోజుల తరబడి కరెంటు లేకపోయినా తామే విద్యుత్‌ సరఫరా చేశామన్నట్టు జనరేటర్ల ఖర్చు రూ.9 లక్షలుగా లెక్క కట్టారు. బండ్లబోరు సహాయ శిబిరాల్లో నాలుగు ట్యూబ్‌ లైట్లు, కాస్తంత వైరు లాగినందుకే రూ.13.50 లక్షల ఖర్చు తేల్చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో టాయిలెట్లకు సుమారు ఐదు లక్షలు, కాయగూరలతోపాటు కోడిగుడ్లు సరఫరా చేసినట్టు 55 వేల రూపాయల కాకి లెక్కలు చూపిస్తున్నట్టు సమాచారం. 


 కుక్కునూరులో ఇంకో చిత్రం

కుక్కునూరు మండలంలో వరద చిట్టా మరింత విచిత్రంగా ఉంది. ఇప్పటికే అంతా కంప్యూటర్‌ ఆన్‌లైన్‌ కాగా స్టేషనరీ ఖర్చులంటూ వరద సమయంలో రూ.60 వేలు చూపించారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పుకుంటూ ట్రాక్టర్ల కోసం రూ.23 లక్షలు, డీజిల్‌ ఖర్చు అదనంగా మరో రూ.15 లక్షలు చిట్టా పద్దులో చేర్చారు. ఈ బిల్లులను చూసి వరద బాధితులే ఘొల్లుమన్నారు. వరద సమయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమ ట్రాక్టర్లను వినియోగించారు. మూడు రోజుల్లో 35కు పైగా ట్రాక్టర్లను రేయింబవళ్ళు అందుబాటులో ఉంచారు. అదేదో తామే చేసేశామన్నట్టు ఇప్పుడు అధికారులు వాటి కోసం లక్షల్లో బిల్లులు పెట్టారు. కుక్కునూరులోనే దాదాపు రూ.36 లక్షలకుపైగా బిల్లులు పెట్టారు. బాధితులకు కడుపు నిండా ఆహారం అందించినట్టు పదిహేనున్నర లక్షలు ఖర్చు చూపించే ప్రయత్నం. వాస్తవానికి వరద తగ్గుముఖం పట్టకమునుపే స్వచ్ఛంద సంస్థలు, పలు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ప్రజలకు ఆహారం అందించారు. లచ్చిగూడెంతో పాటు పెదరావిగూడెం, మరికొన్ని గ్రామాల్లో నిర్వాసితులను తరలించకపోయినా ట్రాక్టర్లతో అందరినీ తరలించేశామన్నట్టు బిల్లులు పెట్టడం ఇవన్నీ కూడా అధికార లెక్కలు కావడమే అందరినీ బిత్తరపోయేలా చేస్తోంది. ఈ మండలంలో భోజనాల ఖర్చు రూ.15.50 లక్షలతో కలిపి మొత్తం మీద రూ.72 లక్షలుగా పద్దు తేల్చారు.


ఎవరి డైరెక్షన్‌ ఇది 

వరద సాయంలో ఒకింత విఫలమైనా మసిపూసి మారేడుకాయ చేస్తూ ఇప్పుడు పద్దు సమర్పణలో తెగ కలరింగ్‌ ఇస్తున్నారు. అధికార యాంత్రంగమే బాధితులకు అంతా సమకూర్చినట్టు వారిని సురక్షితంగా చూడడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు           తెగ పోజులిచ్చేసేలా వరద పద్దును డిజైన్‌ చేశారు.          వీటి వెనుక ఎవరి డైరెక్షన్‌ ఉంది ? మండలస్థాయిలో కావాలనే చేశారా ? లేదంటే నొక్కేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ? అనే అనుమానాలను  వరద బాధితులే లెవనెత్తే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ట్రాక్టర్లు, జనరేటర్లతో సహా మిగతా వాటి విషయంలోనూ అంతా అనుమానం తొంగి చూస్తుంది. మండలస్థాయిలో ఈ పద్దులు వేయడంలో సిద్ధహస్తమైన కొందరి సిబ్బంది సాయపడినట్టు చెబుతున్నారు. ఈ వరద బిల్లులు పరిశీలనకు వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఎలా స్పందించబోతున్నారనేదే ఇప్పుడు  అందరి ఎదుట సస్పెన్స్‌.


అన్నీ సక్రమమే : కుక్కునూరు తహసీల్దార్‌

కుక్కునూరు మండలంలో వరద బాధితుల ఖర్చుల్లో అంతా పారదర్శకం, సక్రమమేనని తహసీల్దార్‌ వెల్లడించారు. ఆహారం, మంచినీటికి సంబంధించి ఎనిమిది లక్షలు, సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు, ఇతరత్రాకు రూ.11 లక్షలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ స్పీడు బోట్ల వినియోగానికి, ఆయిల్‌ ఖర్చులకుగాను తొమ్మిది లక్షలు, మొత్తం మీద 28 లక్షలు వ్యయమయ్యాయని పేర్కొన్నారు.


ఖర్చులు ఇలా.. (రూ).

కుక్కునూరు వేలేరుపాడు

ఏసీ బోట్లు 2.4 లక్షలు 5.46 లక్షలు

బోట్లు కోసం 5.22 లక్షలు 11 లక్షలు

షామియానా 42 వేలు 4 లక్షలు

జనరేటర్లు 51 వేలు 9 లక్షలు

వాటర్‌ ట్యాంక్‌లు3.69 లక్షలు 1.72 లక్షలు

గ్యాస్‌ 27 వేలు 1.47 లక్షలు

ట్రాక్టర్లు 22.82 లక్షలు 5.85 లక్షలు


Read more