నో.. ఫాస్టాగ్‌!

ABN , First Publish Date - 2022-02-16T06:22:03+05:30 IST

టోల్‌ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పని సరిచేసింది.

నో.. ఫాస్టాగ్‌!
కొవ్వూరు టోల్‌ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు

  • కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ ఇక్కట్లు
    టోల్‌ ప్లాజాకు ఫాస్టాగ్‌ సౌకర్యం నిల్‌
    ఎందుకంటే సమాధానం చెప్పని నిర్వాహకులు
    కిలోమీటర్ల మేర నిలిచి పోతున్న వాహనాలు
    ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుకొవ్వూరు, ఫిబ్రవరి 15 : టోల్‌ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పని సరిచేసింది. నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించేందుకు దీనిని అమలుచేస్తోంది.  ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి అదనపు రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాహనదారులందరూ ఫాస్టాగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని కలపర్రు, ఉంగుటూరు టోల్‌ప్లాజాల వద్ద వీటిని అనుమతి ఇస్తున్నప్పటికీ కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద మాత్రం నిరాకరిస్తున్నారు. ఇక్కడ డబ్బులు చెల్లించి మాత్రమే వాహనదారులు ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా రోజూ గంటల తరబడి వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వంతెన మీదుగా రోజుకు పది నుంచి 12 వేల వరకు వాహనాలు ప్రయాణాలు సాగిస్తున్నాయి. రూ.16 నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అత్యవసర వైద్యసేవల కోసం వెళ్లే అంబులెన్స్‌లకు సైతం ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. ఆసుపత్రులకు వెళ్లేవారు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకుని వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. వాహనానికి ఫాస్టాగ్‌ ఉన్నప్పటికి నగదు కడితేనే వాహనాన్ని అనుమతిస్తు న్నారు. దీంతో టోల్‌ప్లాజా సిబ్బందికి వాహనదారులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. తక్షణం ఫాస్టాగ్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ట్రాఫిక్‌తో అవస్థలు

టోల్‌గేట్‌కు ఇరుపక్కలా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. వాహనాలకు ఫాస్టాగ్‌ లేకపోతే అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. వాహనానికి ఫాస్టాగ్‌ ఉన్నప్పటికి టోల్‌ ప్లాజాకు ఈ సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.
                             – బాబ్జి, లారీ డ్రైవర్‌


అర గంట ఆగాల్సిందే
ప్రతిరోజు డైలీ సర్వీస్‌ చేస్తున్నాం. ఫాస్టాగ్‌ లేకపోవడంతో 30 నుంచి 40 నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆలస్యం అవుతోంది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై టోల్‌ఫ్లాజాలు పెట్టి వాహనదారులను దోచుకుంటున్నారు. స్థానికంగా వున్న మంత్రి, ఎంపీలు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రికి వెళ్లేవారి పరిస్థితి దయనీయం.
                – వి.శ్రీనివాసరావు, దేవరపల్లివీటిని మూసేయాలి

ఫాస్టాగ్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోని వాహనాలకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారు. టోల్‌ ప్లాజాకు ఫాస్టాగ్‌  అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. ట్రాఫిక్‌లో ఆంబులెన్స్‌ ఇరుక్కుపోయిన ఏమి చేయలేకపోతున్నాం. ఇటువంటి టోల్‌ ప్లాజాలను మూసివేయాలి.
                     – గిరిధర్‌, విశాఖపట్టణం

Read more