నిరసన సెగ

ABN , First Publish Date - 2022-06-11T06:25:18+05:30 IST

వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతు న్నాయి.

నిరసన సెగ
ఏలూరులో రైతు సంఘం నాయకుల నిరసన


జిల్లాలోని పలు సబ్‌స్టేషన్‌లలో రైతు సంఘాల ధర్నాలు

ఏలూరు సిటీ, జూన్‌ 10 : వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతు న్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా దాదాపు 15 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని విద్యుత్‌ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తెలిపారు. ‘రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలం పోరాడిన ఫలితంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి వచ్చింది. రెండు దశాబ్దాలుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం అమలవుతోంది. మెట్టలో విద్యుత్‌ మోటార్లే వ్యవసాయానికి కీలకంగా మారాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు తెచ్చింది. ప్రతి వ్యవసాయ పంపుసెట్‌కు స్మార్ట్‌ మీటర్‌ బిగించి ప్రతి నెల రీడింగ్‌ ప్రకారం బిల్లు వసూలు చేయాలని ఆదేశించింది. విద్యుత్‌ వినియోగదారులకు 20 శాతం మించి సబ్సిడీ ఇవ్వరాదని ఆ బిల్లులో పేర్కొంది. విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను, అన్ని సబ్‌స్టేషన్లను ప్రైవేటు వారికి అప్పగించాలని నిర్ణయించింది. విద్యుత్‌ రంగం ఇకపై కేంద్రం ఏర్పరిచే విద్యుత్‌ రెగ్యులేషన్‌ కమిషన్‌ అజమాయిషీలో ఉంటుంది’ అని ఏపీ రైతు సంఘం స్పష్టం చేసింది. వచ్చే ఆరు మాసాల్లో రాష్ట్రమంతా మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించినా తర్వాత వచ్చే ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు చేస్తుందనే గ్యారంటీ లేదని విమర్శిస్తున్నారు. 


Updated Date - 2022-06-11T06:25:18+05:30 IST