ట్రాన్స్‌ఫర్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-02-16T06:53:45+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో ఉండేదెవరు.. ఊడేదెవరు. ఇప్పటికే పేదలకు వైద్య సేవలు అందించడంలో తికమకపడుతున్న అనేకచోట్ల వెంటాడుతోన్న వైద్యుల కొరత, ఆ వెనువెంటే సిబ్బంది కొరత. వీటన్నింటినీ సరిదిద్దకముందే నిర్ధిష్ట కాల పరిమితి ఐదేళ్లు పైబడి పనిచేస్తున్న వారిని స్థాన చలనం చేయబోతున్నారు.

ట్రాన్స్‌ఫర్‌ టెస్ట్‌

ఆరోగ్య శాఖలో బదిలీల గుబులు

 వెయ్యి మంది స్థాన చలనానికి కసరత్తు

వైద్య విధాన పరిషత్‌కు కొందరు రాంరాం

ఆ దిశగానే సిద్ధమవుతున్న సీనియర్‌ వైద్యులు

జిల్లాల విభజన వేళ.. ఇదేం కసరత్తు 

మండిపడుతున్న వైద్యాధికారులు, సిబ్బంది

మంత్రి ఆళ్ల నానికి అగ్ని పరీక్ష


    వైద్య ఆరోగ్య శాఖలో ఉండేదెవరు.. ఊడేదెవరు. ఇప్పటికే పేదలకు వైద్య సేవలు అందించడంలో తికమకపడుతున్న అనేకచోట్ల వెంటాడుతోన్న వైద్యుల కొరత, ఆ వెనువెంటే సిబ్బంది కొరత. వీటన్నింటినీ సరిదిద్దకముందే నిర్ధిష్ట కాల పరిమితి ఐదేళ్లు పైబడి పనిచేస్తున్న వారిని స్థాన చలనం చేయబోతున్నారు. దీనికి ఈనెలాఖరును గడువుగా తీసుకున్నారు. ఆ మేరకు వడపోత కసరత్తు  చురుగ్గా సాగుతోంది. ఏదో కారణంతో ఒకే ప్రాంతంలో తిష్టవేసిన కొందరిని బదిలీ చేయడం ఆహ్వానించతగ్గదే అయినా, కొరత ఉన్న చోట ఈ ప్రక్రియను తెర ముందుకు తేవడమే ఆశ్చర్యకరం. కొందరు వైద్యులైతే ఈ బదిలీలకు తలొంచలేమని స్వచ్ఛందంగా వైదొలగబోతున్నామని బహిరంగంగానే చెబుతున్నారు. మరి కొందరు తమకు నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం  నేత కాళ్లావేళ్లా పడుతుండగా.. ఇంకొందరు ఇప్పటికిప్పుడు బదిలీలు ఏమిటంటూ విరుచుకుపడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వారందరిలోనూ లబ్‌డబ్‌ అంటూ గుండె శబ్ధం బయటకే వినిపిస్తోంది. 

   (ఏలూరు–ఆంధ్రజ్యోతి) : 


    వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ మిగతా శాఖలకంటే ముందే ఆరంభమైంది. రెండేళ్లుగా కరోనా వెంటాడిన క్షణంలో విధి నిర్వహణలో వున్న వైద్యులతోపాటు మిగతా వారిని గుర్తించి ప్రభుత్వమే ప్రశంసా పత్రాలు అందించి ఆకాశానికెత్తేసింది. కాని, బదిలీల్లో మాత్రం కఠినంగా కొరడా విదిల్చబోతోంది. బదిలీల ప్రక్రియ మొదలైన ప్రతీసారి 20 శాతం మేర కటాఫ్‌గా నిర్ణయించి ప్రక్రియ పూర్తి చేసేవారు. ఈసారి ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని గుర్తించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆ మేరకే బదిలీలకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లో వెయ్యి మందికిపైగా వైద్యులు, సిబ్బంది ఐదేళ్లకుపైగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నట్టు తేలింది. వైద్య విధాన పరిషత్‌లో భాగంగా ఏలూరు ఆసుపత్రితోపాటు మిగతా 18 ఆసుపత్రుల్లోను 191 మందిని గుర్తించి బదిలీ చేయబోతున్నారు. వీరంతా డీసీహెచ్‌ఎస్‌ ఆధీనంలో పనిచేస్తారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభు త్వాసుపత్రిలో తాజాగా ప్రభుత్వ వైద్య కళాశాలగా అవతరించబోతుంది. ఇక్కడ ఉన్న పలు విభాగాల్లో పనిచేసే సీనియర్లైన వైద్యులను ఈ షరతుతోనే బదిలీ చేయనున్నారు. ఒక్క ఏలూరులోనే 16 మంది వైద్యులు, మరో 30 మంది స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు ఏడుగురు, నాలుగో తరగతి ఉద్యోగులు 17 మంది, పారామెడికల్‌ విభాగంలో పది మందికిపైగా అందరూ కలిపి 85 మంది ఉన్నారు. 

జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే రోగులు రోజువారీ ఓపీ వందల్లోనే నమోదవుతోంది. అందుకు సరిపడా ఇక్కడ పనిచేసేందుకు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడి తట్టుకుని నిలబడేందుకు సాహసం చేయలేక కొందరు డాక్టర్లు తప్పుకోగా, మరికొందరు మాత్రమే నిలబడ్డారు. వీరి సేవల్లోనే పేషెంట్లు బతికి బట్టకడుతున్నారు. ఐదేళ్ల షరతు పేరిట వున్న వైద్యులను తొలగిస్తే పరిస్థితి ఏమిటనేది సరికొత్త ఆందోళన. ఒకవేళ వీరిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడ నియమిస్తే వారు సక్రమంగా నెగ్గుకు రాగలరా, లేక లాంగ్‌ లీవ్‌లో మొహం చాటేస్తారా ? అనే భయం అందరిలోనూ కనిపిస్తోంది. వైద్య విధాన పరిషత్‌కు సారధ్యం వహిస్తున్న డాక్టర్‌ మోహన్‌ను కొనసాగిస్తారా, లేదంటే బదిలీ చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయన మాత్రం బదిలీ అయితే తన భవిష్యత్‌ ఏమిటో ఇప్పటికే నిర్ధారించుకున్నా రని మరో సమాచారం. ఆయనతోపాటు మరికొందరి వైద్యుల పరిస్థితి ఇదే బాటలో కొనసాగుతోంది. వైద్యం అందక వివాదాలు కొన్నిచోట్ల అయితే, తమ మాట వినడం లేదని ప్రజాప్రతినిధులే ఏలూరు ఆసుపత్రిలో అనేకమార్లు వివాదాలు సృష్టించారు. ఇప్పుడు దానినే అందరూ గుర్తు చేస్తున్నారు. కొందరు తాము కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా ఒత్తిళ్లు పెంచుతున్నారు. కొందరైతే ‘ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. తాము కోరుకున్న స్థానానికి వెళ్తే చాలు’ అనే ధోరణిలో ఉన్నారు.


డీఎంహెచ్‌వో పరిధిలో..

డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రాథమిక ఆసుపత్రులతోపాటు మిగతా విభాగాల్లో 869 మంది ఉద్యోగులు, వైద్యులు ఐదేళ్లుగా ఒకేచోట కొనసాగుతున్నారు. వీరందరిని బదిలీ చేయవచ్చు. వీరిలో 69 మంది నేరుగా డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ పరిధిలోకి, 800 మంది రీజనల్‌ డైరెక్టర్‌ పరిధిలోకి వెళ్తారు. అంటే పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల పరిధిలో వీరిని ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. ఈ మేరకు ఎవరంతట వారుగా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాల విభజన జరగబో తున్న నేపథ్యంలో ఎలాగూ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉన్న తరుణంలో ఈ బదిలీలు ఏమిట నే ప్రశ్న తలెత్తింది. వీటినేమీ పట్టించుకోకుండా అప్పటి వరకు జోన్‌లు యథావిధిగానే ఉంటా యని, బదిలీల్లో మార్పులు, చేర్పులు ఉండబో వని ఉన్నతస్థాయిలో పట్టుదల కనిపిస్తోంది. ఇప్పటికే పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అంతంతమా త్రంగానే సాగుతున్నాయి. ఇక్కడి వారందరికీ రకరకాల పనులు, నివేదికలు, సర్వేలు అప్పగించడంతో వైద్యం కాస్త నీరసపడింది. అనేకచోట్ల ఖాళీలు కనిపిస్తున్నా యి. వాటిని భర్తీ చేయాల్సిన ప్రయత్నాలేవీ ముందుకు సాగనేలేదు. 


మంత్రి  సొంత  జిల్లాలో..

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా బదిలీల పర్వం ఒకింత ఆసక్తిగానే మారింది. ఉన్నచోట సిబ్బందిని బదిలీ వేటు వేసి, కొత్త సిబ్బందిని ఎలా రప్పిస్తారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు మంత్రి నాని సిఫారసుతో కోరిన ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు మంత్రి అనుచరులను కొందరు ఆశ్రయిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ బదిలీలంటే పైరవీకారులకు పండగ. ఈ తరుణంలో మంత్రి ఆళ్ల నాని దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా, లేదంటే సిఫారసులకు తలొగ్గి ముందుకు సాగుతారా అనే ప్రశ్న లేకపోలేదు.

Updated Date - 2022-02-16T06:53:45+05:30 IST