-
-
Home » Andhra Pradesh » West Godavari » dist sarpanches chambers president says about villages development at west godavari dist-NGTS-AndhraPradesh
-
‘పంచాయతీల అభివృద్ధికి సహకరించాలి’
ABN , First Publish Date - 2022-02-19T05:56:30+05:30 IST
జిల్లాలో గ్రామాల సత్వర అభివృద్ధికి సహకరించాలని జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు కోరారు.

ఏలూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : జిల్లాలో గ్రామాల సత్వర అభివృద్ధికి సహకరించాలని జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు కోరారు. శుక్రవారం ఆలిండియా పంచాయతీ పరిషత్ సభ్యుడు పిల్లి సత్తిరాజు ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తొలుత స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో సంఘ మొదటి సమావేశం నిర్వహించి పంచాయతీల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. చెత్త నుంచి సంపద కోసం 80 శాతం గ్రామాల్లో షెడ్లు నిర్మించారని, అవగాహనలోపం, నిధుల లేమి కారణంగా వినియోగంలో లేకుండా పోయాయన్నారు. తక్షణం షెడ్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ సంచుల నిషేధం విధించి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలన్నారు. నీటి తీరువాలో పంచాయతీలకు ఇవ్వాల్సిన పది శాతం వాటాను ఏళ్ల తరబడి ఇవ్వడం లేదని, వెంటనే తమ వాటా విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. చాలా పంచాయతీల్లో కార్యదర్శులు లేకపోవడం వల్ల పాలన స్తంభించిందని వెంటనే నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీధి దీపాలకు కరెంటు బిల్లులు చెల్లించడానికి ఆదాయం చాలడం లేదని, సోలార్ వీధి దీపాలు మంజూరయ్యేలా కేంద్ర సంస్థలను కోరాలన్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం కోశాధికారి ఎస్.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పోతుల అన్నవరం, లింగిశెట్టి అనంతలక్ష్మి, అన్వర్ బాష, శేఖర్‌బాబు, గాలి సామ్రాజ్యం పాల్గొన్నారు.