మాస్టర్‌ స్కెచ్‌

ABN , First Publish Date - 2022-09-21T05:34:38+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగంపై లెక్కకు మిక్కిలి నిబంధనలు విధించింది.

మాస్టర్‌ స్కెచ్‌

నిర్మాణాలపై బాదుడు

మాస్టర్‌ ప్లాన్‌  రహదారితో ముడి

చదరపు అడుగుకు రూ.150 చెల్లించాల్సిందే

బిల్డర్ల ప్రాజెక్ట్‌లు విరమణ

ఆక్రమణలకు గురైన రహదారులతో తంటా 


తాడేపల్లిగూడెంలో ఓ ప్రముఖ బిల్డర్‌ గేటెడ్‌ కమ్యూనిటీ అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. స్థల యజమానితో ఒప్పందం కుదిరింది. ప్లాన్‌ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం పెంచుకోవడానికి అదనపు రుసుం చెల్లించేలా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. పలితంగా గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణంపై అదనంగా కోటి రూపాయల భారం పడుతోంది. ఇది మావల్ల కాదంటూ సదరు బిల్డర్‌ నిర్మాణాన్ని విర మించుకున్నారు. ఇంతకీ ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమిటింటే.. మాస్టర్‌ ప్లాన్‌ రహదారి 60 అడుగులు అంతకంటే అధికంగా ఉన్నట్టయితే చదరపు అడుగుకు రూ.150 అదనంగా నిర్మాణదారులు చెల్లించాలి. అదే ఇప్పుడు నిర్మాణరంగానికి భారంగా పరిణమించింది. 


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగంపై లెక్కకు మిక్కిలి నిబంధనలు విధించింది. జగనన్న ఇళ్ల  కోసం లే అవుట్‌లో 5 శాతం స్థలం ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. అదే లేఅవుట్‌లో ఇవ్వకపోయినా సరే మరోచోట అయినా ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీనిపైనే విమర్శలు వెల్లు వెత్తాయి. ఇప్పుడు చదరపు అడుగుకు అదనంగా రూ.150 చెల్లించాలంటూ నిర్ణయం తీసుకుంది. మొత్తంపైన  జనంపై భారం మోపే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 

నిర్మాణ రంగంలో ప్లాన్‌ పెట్టుకోవాలంటే బిల్డర్‌లు హడలిపోతున్నారు. సొంతంగా నిర్మాణం చేపట్టుకునే వారు  బెంబేలెత్తుతున్నారు. కొన్ని పురపాలక సంఘాల్లో ప్రజా ప్రతినిధులకు కప్పం కట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ప్లాన్‌ తెచ్చుకున్నా సరే నేతలకు సంతృప్తి పరిచిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. రహదారి వెడల్పు 60 అడుగులు అంతకంటే అధికంగా ఉంటే చదరపు అడుగుపై అదనపు భారం మోపింది. వాస్తవానికి లే అవుట్‌ అయితే పది శాతం స్థలాన్ని మున్సిపాలిటీలకు అప్పగిస్తారు. దానికితోడు బెటర్‌మెంట్‌ ఛార్జీలను పది శాతం చెల్లిస్తారు. నాన్‌ లే అవుట్‌లో నిర్మాణాలు చేపట్టాలంటే నివాస ప్రాంతంలో స్థలం ఉండాలి. అప్పుడు పది శాతం స్థలానికి బదులుగా భూమి విలువ లో 14 శాతం రుసుం చెల్లించాలి. దీంతో పాటు బెటర్‌మెంట్‌ ఛార్జీలు పది శాతం చెల్లించినట్టయితే ప్లాన్‌ మంజూరవుతుంది. తాజాగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారిని ముడిపెట్టడంతో అదనపు భారం పడు తోందంటూ నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. 


మాస్టర్‌ ప్లాన్‌ ఉల్లంఘన

నిర్మాణ రంగంలో మాస్టర్‌ ప్లాన్‌ల ఉల్లంఘన సర్వసాధారణమైంది. మాస్టర్‌ ప్లాన్‌ రహదారికి, వాస్తవంగా ఉండే రహ దారికి పొంతన ఉండడం లేదు. బిల్డర్‌లు అయితేనే నిబంధనలు పాటిస్తున్నారు. సొంత నివాసాలు ఏర్పాటు చేసుకునే యజమానులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మాస్టర్‌ ప్లాన్‌తో సంబం ధం లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నా రు. మున్సిపాలిటీలు సైతం దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను కుదించేందుకు మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. తదుపరి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో  రహదారులు కుదించే అవకాశం సన్నగిల్లింది. మున్సిపాలిటీకి ఆదాయం రావాలంటే మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మా ణాలు చేపట్టాలి. ఇందుకోసం చదరపు అడుగుకు రూ.150 చెల్లించాలి. 


ఆక్రమణలకు గురైన రహదారులు

మున్సిపాలిటీల్లో మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు రికార్డులకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు భూముల్లో రహదారి కుంచించుకు పోతోంది. స్థల యజమానులే నిర్మాణాలు చేపట్టుకుంటున్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు అను గుణంగా రహదారిని విడచిపెట్టడం లేదు. అదే ప్రభుత్వ భూమిలో మాస్టర్‌ ప్లాన్‌ రహ దారి ఉంటే ఆక్రమణలకు గురి అవుతున్నాయి. నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఆక్రమణలపై దృష్టి సారించడం లేదు. ఆక్ర మణల్లో నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. వాటికి ఆనుకుని ఇప్పుడు ప్రైవేటు స్థలాల్లో నిర్మాణాలు చేపడితే అదనంగా సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి రహదారి విస్తరించి ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అదనపు సొమ్ములు చెల్లించేలా నిర్ణయం తీసుకుందని అధికారులు వాదిస్తున్నారు. కానీ ఆక్రమణలకు గురైతే  రహదారి కుంచించుకు పోతోంది. అటువంటిచోట ప్రైవేటు స్థలాల్లో నిర్మాణాలకు రూ.150 చెల్లించి తీరాలి. అటువం టి నిర్మాణాలకు మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా రహదారి విస్తరించి ఉండదు. ఇలా రెండు విధాలా నిర్మాణదారులకు నష్టం వాటిల్లనుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇటువంటి సమస్యలున్నాయి. అంతిమంగా ప్రభుత్వ నిర్ణయం బిల్డర్‌లపై అదనపు భారం మోపుతోంది.

Read more