జగన్‌ పాలనలో ..ఒరిగిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-09-21T05:42:57+05:30 IST

సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో కార్మికులకు ఒరిగింది ఏమి లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

జగన్‌ పాలనలో ..ఒరిగిందేమీ లేదు
భీమవరంలో కలెక్టర్‌ పి.ప్రశాంతికి వినతిపత్రమిస్తున్న సీఐటీయూ నేతలు

 కార్మిక సంఘాల నేతల  తీవ్ర ఆగ్రహం
 ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌ కార్యాలయాల ముట్టడి
 తరలి వచ్చిన వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌


భీమవరం అర్బన్‌/ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 20 : సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో కార్మికులకు ఒరిగింది ఏమి లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌లను ముట్టడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో వున్న తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. భీమవరంలో జరిగిన ధర్నాలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రామిక అని పార్టీ పేరు పెట్టుకున జగన్‌ ... కార్మికుల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, జగన్‌ పోటీ పడి ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. 15 ఏళ్లు అయినా కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజారామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ లక్ష కరపత్రాలు వివిధ రంగాలపై ముద్రించి నెలరోజులపాటు జిల్లాలో కార్మిక సమస్యలపై సర్వే నిర్వహించామన్నారు. జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు కనీస వేతనాలు, చట్టాలు, అమలు కావడం లేదన్నారు. ఐక్యపోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. శ్రామక మహిళా జిల్లా కన్వీనర్‌ డి. కళ్యాణి మట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లతో  బండ చాకిరీ చేయిస్తూ వేతనాలు మాత్రం గొర్రె తోక మాదిరిగా ఇస్తున్నారన్నారు. అనంతరం కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని  కలెక్టర్‌ ప్రశాంతికి సీఐటీయూ, కార్మిక సంఘ నాయకులు అందించారు. సీఐటీయూ జిల్లా నాయకులు జెఎన్‌వీ గోపాలన్‌, వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, తెలగం శెట్టిసత్యనారాయణ, పీవీ ప్రతాప్‌, కార్మిక సంఘాల నేతలు దాసిరెడ్డి కోటేశ్వరరావు, కె. సత్యనారాయణ, నిర్మాలా దేవి, షేక్‌ బాషా, ఎస్‌. ఉదయ్‌ భాస్కర్‌, స్వరూప్‌, ధనాలా వెంకట్రావు , జిల్లాలోని 20 రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

ఏలూరులో..

రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ సమస్యలు పరిష్కరించకుండా ద్రోహం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా అధ్యక్షుడు బి. సోమయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గఫూర్‌ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర సందర్భంగా కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు సవరించాల్సి ఉన్నా... యాజమాన్యాలకు ఊడిగం చేసేందుకే పెంచడం లేదని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న, వెలుగు, వీవోఏ, మున్సిపల్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏఎస్‌ఏ ఉద్యోగులు, వీఆర్‌ఏ, వైద్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులంతా వేతనాలు పెంచు తారని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ. రవి, సీఐటీయూ నాయకులు లింగరాజు, ఏ. శ్యామలారాణి, తదితరులు నాయకత్వం వహించారు. తొలుత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జ్యూట్‌మిల్లు సెంటర్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం గఫూర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

Read more