కాల్వ నోట్లో మట్టి

ABN , First Publish Date - 2022-11-30T00:38:19+05:30 IST

ముసునూరు మండలం నాగార్జున సాగర్‌ మూడోజోన్‌ పరిధిలో వేంపాడు మేజర్‌ ఉంది. దీనిద్వారా 28 వేల ఎక రాలు ఆయకట్టు సాగులో ఉండగా, కాలువ ఏర్పడిన 40 ఏళ్లలో నాలుగు సార్లు మాత్రమే ఆయకట్టుకు సాగు నీరు వచ్చింది.

కాల్వ నోట్లో మట్టి

మట్టిని తవ్వేస్తున్న అక్రమార్కులు

నీటి ప్రవాహంతో పలుచోట్ల గండ్లు

పంటలకు ముప్పు.. రైతుల ఫిర్యాదులు

సిబ్బంది కొరతతో చేతులెత్తేసిన అధికారులు

(ముసునూరు): ముసునూరు మండలం నాగార్జున సాగర్‌ మూడోజోన్‌ పరిధిలో వేంపాడు మేజర్‌ ఉంది. దీనిద్వారా 28 వేల ఎక రాలు ఆయకట్టు సాగులో ఉండగా, కాలువ ఏర్పడిన 40 ఏళ్లలో నాలుగు సార్లు మాత్రమే ఆయకట్టుకు సాగు నీరు వచ్చింది. దీనిని గ్రావెల్‌ అక్రమార్కులు గమనించారు. సూరేపల్లి, అక్కిరెడ్డిగూడెం, గోగులంపాడు, చింతలవల్లి తదితర ప్రాంతాల్లో వేంపాడు మేజర్‌ గట్లపై వున్న గ్రావెల్‌ను అక్రమం గా తవ్వేస్తున్నారు. మూడున్నరేళ్లుగా ఎవరూ అడగపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోం ది. దీంతో వేంపాడు మేజర్‌ కాలువ గట్లు బలహీ నమయ్యాయి. దీని కారణంగా ఈ ఏడాది ఎన్‌ఎస్‌ పీ కాలువకు వచ్చిన నీరు ఆయకట్టుకు సక్రమంగా చేరలేక పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ విధంగా సూరేపల్లిలో మూడుచోట్ల గండ్లు పడటంతో రైతు లు తీవ్రంగా నష్టపోయారు. కాలువకు ఇరువైపులా రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో అక్రమ గ్రావె ల్‌ తవ్వకాలపై ఎన్‌ఎస్‌పీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా వారు సిబ్బంది కొరతను సాకుగా చూపిస్తూ.. గ్రావెల్‌ తరలింపుపై దృష్టి సారించకపోవడంతో వీరు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. సూరేపల్లి వద్ద వేంపాడు మేజర్‌ కాలువకు మూడుచోట్ల గండి పడి రెండేళ్ళు గడుస్తు న్నా దీనిని పూడ్చడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు పంటను బయటకు తీసుకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతిని ధులకు ఫిర్యాదు చేసినా, నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రైతులు వారి పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేంపాడు కాలువ కు బలంగా 60 అడుగుల వరకు ఇరు వైపులా గట్టు ఏర్పాటు చేసి, రెండు మీటర్ల ఎత్తు వరకు మట్టిని పోశారు. అయితే అక్రమంగా మట్టి తరలిపోవడంతో నేడు కాలువ గట్టు విస్తీర్ణం రాను రాను తగ్గిపోయి, నామమాత్రంగానే మిగిలిందని, కాలువ గట్టు ఆక్రమణకు గురై మట్టి తరలి పోవడంతో సదరు కాలువ గట్టు, పక్కనే ఉన్న సీఫేజ్‌కు ఉద్దేశించి వదిలిన కాలువ పోరంబోకు భూములను ఆక్రమించి, మరికొందరు రైతులు వివిధ రకాల పంటలను సైతం సాగు చేస్తున్నా, అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఇదే పరిస్థితి మరికొన్నాళ్ళు కొనసాగితే వేంపాడు మేజర్‌ కాలువ గట్టు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా వేంపాడు మేజర్‌ కాలువ గట్టు అక్రమ గ్రావె ల్‌ తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు కాలువగట్టుకు పడిన గండ్లను పూడ్చి, రైతుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు కోరుతున్నారు.

గట్లు బలహీనం

వేంపాడు మేజర్‌ కాలువ గట్టును తవ్వేసి అక్రమంగా గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. మరి కొన్నిచోట్ల ఆక్రమించి పంట భూము లుగా మార్చేస్తున్నారు. దీనివల్ల కాలు వకు బలం తగ్గి, నీరు వచ్చే వేళ గండిపడే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కొల్లి వెంకటరామయ్య, సూరేపల్లి

అధికారుల ప్రేక్షక పాత్ర

కాలువగట్ల తవ్వకాలపై గ్రామస్థులు పలుమా ర్లు ఎన్‌ఎస్‌పీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గండ్లు పూడ్చమని చెప్పినా అధికారు లు పట్టించుకోలేదు. మట్టి తవ్వకాల పై ప్రేక్షకపాత్ర వహించిన అధికారు లపై చర్యలు చేపట్టాలి.

– వడ్లపట్ల శివరామ్‌, సూరేపల్లి

రాకపోకలకు ఇబ్బంది

కాలువ గట్ల పక్కన ఉన్న వ్యవసాయ భూములకు రాకపోకలు ఇబ్బందిగా మారింది. మట్టి తోలకాలతో గట్టుకు గండ్లు పడ్డాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. అధికారులు అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

– మాదల శ్రీనివాసరావు, సూరేపల్లి

నిఘా పెట్టలేకపోతున్నాం

నూజివీడు మూడో జోన్‌ పరిధిలోని కాలువల పర్యవేక్షణకు సిబ్బంది కొరత వేధి స్తోంది. గ్రావెల్‌ అక్రమ తవ్వకాల విషయం, కాలువకు పడిన గండ్లు పరిస్థితిని రైతులు మా దృష్టికి తెచ్చారు. మట్టి తోలకాలపై నిఘా పెట్టేం దుకు సరిపడా సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. గండ్లు విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక పంపి, త్వరలో గండ్లు పూడుస్తాం.

– రుద్రనరసింహా, ఎన్‌ఎస్‌పీ డీఈ

Updated Date - 2022-11-30T00:38:19+05:30 IST

Read more