జనసంద్రం

ABN , First Publish Date - 2022-09-29T05:54:15+05:30 IST

అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఏలూరులో అపూర్వ స్వాగం లభించింది. సుమారు 16 రోజుల యాత్ర పూర్తి చేసి 17వ రోజు బుధవారం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో మహా పాదయాత్ర సాగింది.

జనసంద్రం
ఏలూరు చేరిన మహా పాదయాత్ర

అమరావతి రైతులకు ఏలూరులో అపూర్వ స్వాగతం

వేలాదిగా తరలివచ్చి సంఘీభావం

యాత్రను ఆరంభించిన బడేటి చంటి దంపతులు

తరలి వచ్చిన వ్యాపారులు, చిరుద్యోగులు,వ్యాపారులు

నగరమంతా పండుగ వాతావరణం

పాదయాత్ర సాగే మార్గాల్లో పూల జల్లులు

పాదయాత్రికులకు మరింత ఉత్సాహం, ఊపు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఏలూరులో అపూర్వ స్వాగం లభించింది. సుమారు 16 రోజుల యాత్ర పూర్తి చేసి 17వ రోజు బుధవారం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో మహా పాదయాత్ర సాగింది. కనీవినీ ఎరుగని రీతిలో స్థానికులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, వివిధ పార్టీల సానుభూతిపరులతో ఏలూరు నగరం కిక్కిరిసింది. ఉదయం పాదయాత్ర ఆరంభానికి సూచికగా నగర టీడీపీ కన్వీనర్‌ బడేటి చంటి దంపతులు సూర్యరథానికి పూజలు చేశారు. ఆయన అనునయులంతా విస్తృత స్వాగత ఏర్పాట్లు చేశారు. యాత్ర ఆసాంతం ద్విగిణీకృత ఉత్సాహంతో అలుపు సొలుపు లేకుండా అత్యంత ఉద్వేగంగా ముందుకు సాగింది. కొత్తూరు దాటి నగరంలోకి ప్రవేశిస్తున్న పాదయాత్ర బృందానికి జనసేన నేత అప్పలనాయుడు, మరికొంత మహిళలతో ఎదురేగి పసుపు నీటి బిందెలతో స్వాగతం పలికారు. లక్ష్యం చేరే వరకు సకల విజయాలు లభించాలని కోరుతూ పాదాలపై నీరు పోశారు. వీధులను శుద్ధి చేశారు. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న వందలాది మంది పాదయాత్రను అనుసరించారు. అంబేద్కర్‌ విగ్రహానికి నిలువెత్తు పూలమాలలు వేసి అందరి మద్దతు తమకే ఉండాలని కోరుకున్నారు. అక్కడి నుంచి పంపుల చెరువు, జూట్‌మిల్లు, పేరయ్య కోనేరు, వైఎంహెచ్‌ఏ, కర్రల వంతెన, వసంత మహల్‌ మీదుగా యాత్ర సాగింది. వన్‌టౌన్‌ మార్గాలన్నీ పాద యాత్రికులు, వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వారితో కిక్కిరిసిపోయాయి. చిరు వ్యాపారులు దుకాణాల నుంచి వచ్చి తమ మద్దతు అమరావతికే అంటూ స్పష్టం చేశారు. తమ స్తోమత మేరకు అమరావతి యాత్రకు విరాళాలు ప్రకటించారు. మీ ప్రయాణం విజయవంతం కావాలంటూ దీవెనలు ఇచ్చారు. వన్‌టౌన్‌లో యాత్ర సాగడానికి దాదాపు గంటకుపైగానే సమయం పట్టింది. యాత్రికులపై పూల వర్షం కురిపించారు. ఇది చూసి రాజకీయ పక్షాలకు చెందిన వారే విస్తుపోయారు. భారీ సంఖ్యలో ప్రజలు కూడళ్ళకు చేరుకోవడంతో యాత్ర కష్టతరమైంది. పాదయాత్ర బృందం ఒక క్రమశిక్షణతో ముందుకు సాగు తుండగా అదే రీతిలో మిగతా వారు వారిని అనుసరించారు. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు చేశారు. మరోవైపు తెలుగుదేశం కేడర్‌ మరింత సమన్వయపర్చుకుని ఏ క్షణానికా క్షణం పాదయాత్ర సాగే రూటును అడ్డంకులు లేకుండా జాగ్రత్తపడ్డారు. జై అమరావతి అంటూ నినాదాలతో నగరమంతా హోరెత్తింది. ఒక పద్ధతి ప్రకారం యాత్ర ముందుకు సాగుతుండగా మార్గమధ్యలో తెలుగుదేశం నేతలు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బూరుగుపల్లి శేషారావు, పార్టీ కన్వీనర్లు వలవల బాబ్జీ, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, బడేటి చంటి ముందుకు సాగుతూ కనిపించారు. ఆకుపచ్చ తువాళ్ళు ధరించిన మహిళలు, యువకులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, ముఠా కూలీలు, రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఎక్కడికక్కడ నగర వీధుల్లో బారులు తీరారు. వసంతమహల్‌ దాటి ఫ్లై ఓవర్‌ మీదుగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ చేరుకున్న తరువాత స్థానికులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఎప్పుడూ జనసమర్ధంగా ఉండే ప్రభుత్వాసుపత్రి నుంచి ఆర్‌ఆర్‌ పేట మీదుగా యాత్ర సాగుతున్నప్పుడు మార్గమంతా జనంతో నిండిపోయింది. ఇదే సమయంలో స్వచ్ఛందంగా కొందరు రైతులపై పూల వర్షం కురిపించడంతో ఆర్‌ఆర్‌ పేట మార్గమంతా పూల మయమైంది. ఆర్‌ఆర్‌ పేట నుంచి పవరుపేట మీదుగా పన్నెండు పంపుల సెంటర్‌, నూకాలమ్మ గుడి, ఆదివారపుపేట మీదుగా టుబాకో మర్చంట్‌ వరకు చేరుకోవడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. పాదయాత్ర సాగిన మార్గంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో అనుసరించారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం భోజన విరామానికి కొంతసేపు పొగాకు మర్చంట్‌ కల్యాణ మండపంలో పాదయాత్రకు కాసేపు విరామం ఇచ్చారు. 


కొవ్వలి వరకు జనమే జనం

నగరంలో పాదయాత్ర ముగించుకుని పాతబస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తూర్పులాకుల మీదుగా పాలగూడెం చేరుకోవడానికి మరో రెండు గంటల సమయం పట్టింది. ఈ మార్గమంతటా రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున జనం చేరారు. పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. ఉమ్మడిగా వెళ్తున్న మహిళలకు దీవెనలు ఇచ్చారు. జాగ్రత్త అంటూ సూచనలు చేశారు. కాళ్ళ నొప్పులు తగ్గాయా అంటూ పరామర్శించారు. పాలగూడెం నుంచి కొవ్వలి చేరుకునే సరికి కాస్తంత పొద్దుపోయినా వందలాది మంది ఎదురేగి మరీ స్వాగతం పలికారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ, న్యాయవాదులు, విద్యావంతులు, ఉద్యోగులు సైతం మద్దతుగా నిలిచారు. వామపక్షాల తరపున సోమయ్య, జగన్నాధరావు, కన్నబాబు, ఆమ్‌ ఆద్మీ తరపున మస్తాన్‌ పాషా, బార్‌ అసోసియేషన్‌ తరపున అబ్బినేని విజయకుమార్‌, జిల్లెళ్ళమూడి ప్రసాద్‌, టీడీపీ పక్షాన విజయలక్ష్మి సహా పలువురు నేతలు పాదయాత్రలో పాలు పంచుకున్నారు. 


వాళ్ళంతా అచ్చోసిన ఆంబోతులు : రెడ్డి అప్పలనాయుడు

‘రైతుల పాదయాత్రపై వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం. అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా మాట్లాడుతున్నార’ని ఏలూరు జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పల నాయుడు విరుచుకుపడ్డారు. అసలు మంత్రులుగా బాధ్యత మరిచి ఎందుకిలా వ్యవహరిస్తున్నారో ఇప్పటికే అందరికీ అర్థమైందని, ఎవరో మెప్పు కోసం ప్రజలను, పాద యాత్రికు లను కించపరుస్తారా అంటూ నిలదీశారు. మీకు ప్రజలే గుణపాఠం చెబుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అమరావతి నిర్మాణానికి కార్య రంగంలోకి దిగాలని కోరారు.


కొవ్వలిలో ఘనస్వాగతం 

దెందులూరు  : దెందులూరు మండలం కొవ్వలి మొండు కోడు కరకట్ట అడ్డరోడ్డు వద్దకు వచ్చిన పాదయాత్రికులకు కొవ్వలి రైతులు, మహిళలు భారీ స్వాగతం పలికారు. 50 ఆటోలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, భారీ మోటార్‌ సైకిళ్లతో వచ్చి హారతులు ఇచ్చారు. క్రేన్‌ సహాయంతో భారీ గజమాలను వేంకటేశ్వరస్వామికి వేసి ప్రత్యేక పూజలు చేశారు. కొవ్వలిలో ఏర్పాటు చేసిన మోటపర్తి భవనం, రామదాసు భవనంలో  మహిళలకు, రైతులకు ఆతిఽథ్యం ఇచ్చారు. 








Updated Date - 2022-09-29T05:54:15+05:30 IST