మావి త్యాగాలు కావా..?

ABN , First Publish Date - 2022-09-28T05:58:43+05:30 IST

మేము చేసినవన్నీ త్యాగాలు కావా..? రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు భూములు ఇవ్వడం మేము చేసిన తప్పా ? భావితరాల భవిష్యత్తు కోసం అమరా వతి రాజధాని కోసం మాకున్నదంతా అప్పగిస్తే ఇప్పుడు మాపైనా దుష్ప్రచారమా ? మేము చేసిన త్యాగాలు కనిపించడం లేదా మీకు..

మావి త్యాగాలు కావా..?
జై అమరావతి అంటూ కేరింతలు కొడుతున్న రైతులు

నిలదీసిన అమరావతి రైతులు

అడ్డగోలు వాదనలతో యాత్ర ఆపలేరు

రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పాదయాత్ర 

విరామం వేళ కాస్తంత ఊరట

ఏలూరులో ఆత్మీయ సమ్మేళనం

మాగంటి బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు

సాంస్కృతిక కార్యక్రమాలతో జోష్‌


ఏలూరు/పెదపాడు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మేము చేసినవన్నీ త్యాగాలు కావా..? రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు భూములు ఇవ్వడం మేము చేసిన తప్పా ? భావితరాల భవిష్యత్తు కోసం అమరా వతి రాజధాని కోసం మాకున్నదంతా అప్పగిస్తే ఇప్పుడు మాపైనా దుష్ప్రచారమా ? మేము చేసిన త్యాగాలు కనిపించడం లేదా మీకు.. అంటూ అమరావతి రైతులు ఆక్రోశించారు. తాము చేస్తున్న పాదయాత్రను తప్పుపట్టడమే కాకుండా మంత్రులు కూడా నిందలు మోపడం, ప్రతిష్ట మసకబారేలా ప్రకటనలు చేయడంపై ఆవేదన చెందారు. అమరావతి రాజధాని కోరుతూ 15 రోజులపాటు మహా పాదయాత్ర కొనసాగించి 16వ రోజు మంగళవారం పాదయాత్రికులంతా కాస్తంత విరామం తీసుకున్నారు. ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో వీరందరికీ బస ఏర్పాటు చేశారు. ఒకవైపు కాళ్ళ అరిపాదాలపై బొబ్బలు, కీళ్ళనొప్పులు, ఒళ్ళు నొప్పులు, నీరసం ఆవరించినా ధృడ సంకల్పంతో అమరావతి రైతులు కనిపించారు. కళ్యాణ మండపంలో బస చేసినవారు తమకు మద్ధతు ఇచ్చేందుకు వచ్చిన వారి ఎదుట కొందరు మహిళలు తాము పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. 


ఉత్తేజం నింపిన ప్రసంగాలు 

కక్ష కట్టినట్టుగా వైసీపీ సర్కారు ఎందుకిలా వేధిస్తోంది ? దేవస్థానం.. న్యాయస్థానం నమ్ముకున్నాం. మా నమ్మకం ఒమ్ముకాదంటూ ప్రజా మద్ధతే తమను నడిపిస్తుందని, అన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలికి తమను ధీవిస్తూ అక్కున చేర్చుకుం టుంటే తమ అనారోగ్యాలను మరిచిపోయి ధైర్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. మంగళవారం ఉదయం పాదయాత్రికులు బస చేసిన కళ్యాణ మండపానికి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన వారు తరలివచ్చారు. వీరికి వివిధ పార్టీల నేతలు తోడయ్యారు. కుల, మతాలకు అతీతంగా అందరి నోటా అమరావతే. పాదయాత్రికులకు స్ఫూర్తినిచ్చేలా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు ప్రసంగిస్తున్నప్పుడు కళ్యాణ మండప ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. అమరావతి కోసం కొంపాగూడు వదిలి పాదయాత్ర చేయడానికి కారకులెవరు ? దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి వ్యతిరేకిస్తారా ? దమ్ముంటే అమరావతి మహా పాదయాత్రను ఆపండంటూ.. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ తొడకొట్టారు. ఈ అనూహ్య పరిణామానికి కరతాళ ధ్వనులతో భారీ స్పందన వినిపించింది. ఏలూరుతో సహా వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వందలాది మందితో కళ్యాణ మండపం నిండుకోగా,అక్కడే వీరంతా గంటల తరబడి వేచి ఉన్నారు. ఒకరికొకరు పరస్పరం సముదాయించుకోవడం, ధైర్యం చెప్పుకోవడం, అయిన గాయాలను తలచుకుని కాస్తంత కన్నీటిపర్యంతం కావడం ఇంకోవైపు వయస్సు పైబడిన వారు సైతం పట్టుబట్టి పాదయాత్రలో కొనసాగడం అందరినీ ఆకట్టుకుంది. మేము త్యాగాలు చేయకపోతే ఇంకేం చేశామంటూ వారి ప్రశ్నలకు.. లేదులేదు.. పట్టించు కోవద్దు అంటూ సభికులు నినాదాలు చేయడంతో ప్రాంగణమంతా గంభీర వాతావరణం నెలకొంది. ఇంతలోనే పాదయాత్ర ఆసాంతం కొనసాగేలా తామంతా ముందు కేనంటూ యాత్రికులు స్పష్టం చేయడంతో అక్కడి వాతావరణం తేలికపడింది.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 

వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి అలసి సొలసిన పాద యాత్రికులకు కొంత ఊరట కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. మధ్యాహ్నం నుంచి వివిధ రీతుల్లో కూచిపూడి నృత్యాలు,  ఉత్తేజ పూరితమైన పాటలతో ప్రాంగణమంతా దద్దరిల్లింది. అమరావతికి అనుకూలంగా సాగుతున్న అనేక గీతాలాపనలకు ఉత్సాహభరితులై ఒకవైపు పాద యాత్రికులు, వారికి మద్ధతుగా వచ్చిన వారంతా తాము ధరించిన పచ్చ కండువాలను గాలిలో ఊపుతూ ఉత్సాహం ప్రదర్శించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు, ఆయన మద్ధతు దారులంతా పాద యాత్రికులకు ఏలోటూ లేకుండా చేశారు. ఆత్మీయులారా మీకు వందనాలు.. అంటూ పాదాభివందనాలు చేశారు. Read more