అడుగడుగునా నిఘా నేత్రం..

ABN , First Publish Date - 2022-01-03T05:58:55+05:30 IST

తాడేపల్లిగూడెం నిఘా నీడలోకి వెళ్లింది.

అడుగడుగునా నిఘా నేత్రం..

84 కెమెరాలతో పట్టణంలో నిఘా.. 

15 కిలోమీటర్ల పరిధిలో అంతా అప్రమత్తం 

రూ. 25 లక్షలతో ప్రజల భాగస్వామ్యంతో తొలిసారిగా...

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 2: తాడేపల్లిగూడెం నిఘా నీడలోకి వెళ్లింది. పట్టణ పరిధిలో సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో ఏ మూలన ఏం జరిగినా రక్షణ శాఖ పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక సీసీ కెమెరా నుంచి మరో కెమెరాకు అనుసంధానం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి పరిశీలించే విధంగా ఈ వ్యవస్థను నవీకరించారు. మొత్తం 84 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ రకమైన టెక్నాలజీని వినియోగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజల భాగ స్వామ్యంతో రూ. 25 లక్షల వ్యయంతో అత్యాధునిక 4జీ హెచ్‌డీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 


ప్రతి వంద మీటర్లకు ఒక సీసీ కెమెరా

పట్టణంలో ప్రతి వంద మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటుచేసి అనుక్షణం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి వంద మీటర్లకు పర్యవేక్షించే హెచ్‌డీ 4జీ క్వాలిటీ అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసి నేర నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.  


ప్రజా సహకారంతో ఏర్పాటు :  పట్టణ సీఐ ఆకుల రఘు  

పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు  చెప్ప గానే పట్టణ ప్రజలు ముఖ్యంగా వ్యాపార సముదా యాల యాజమాన్యం సహకారం బాగుంది. వారి ప్రోత్సాహంతో రూ.25 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పట్టణం లో నేర నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. 

Read more