ప్రతీకారం తీర్చుకుంటాం

ABN , First Publish Date - 2022-07-18T09:19:47+05:30 IST

ప్రతీకారం తీర్చుకుంటాం

ప్రతీకారం తీర్చుకుంటాం

వారిని వదిలేది లేదు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో టీడీపీ నాయకురాలు అనిత స్పష్టీకరణ


చట్టప్రకారమే వెళ్తాం.. మాటకు మాట తప్పదు

కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్టు.. మందులు, ఇంజక్షన్లతో కుదరదు

ఎప్పుడు ఏ పోలీసు వచ్చి ఎక్కడకు ఎత్తుకుపోతాడో!

ఎవడొచ్చి సీఐడీ నోటీసు అంటాడో తెలియడం లేదు

సీఐలు, ఎస్సైలను తప్పుపట్టను.. కొందరు ఐపీఎస్‌లలో జగనిజం

చదువుకున్న కుటుంబం నుంచి వచ్చా.. టీచర్‌గా పనిచేసి వచ్చినదానిని

వినకూడని మాటలంటున్నారు.. అందరి అకౌంట్లూ సెటిల్‌ చేస్తాం


అక్రమ కేసులకు టీడీపీ నేతలు, తాను భయపడడం లేదని తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టంచేశారు. అందుకే తనపై బాడీ షేమింగ్‌, వ్యక్తిత్వ హననం వంటివి మొదలుపెట్టారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. డబ్బులిచ్చి మనుషులను పెట్టి తిట్టించే స్థాయికి దిగజారిపోయారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అయితే చట్టం పరిధిలోనే వెళ్తామని తెలిపారు. మాటకు మాట తప్పదని.. కుక్కకాటుకు చెప్పుదెబ్బే కరెక్టని తేలిచెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశేషాలివీ..


ఆర్‌కే: నమస్కారం అనితగారూ.. ఎలా ఉన్నారు? మీ రాష్ట్రం ఎలా ఉంది?

అనిత: మేమూ, మా రాష్ట్రమూ డైలమాలో ఉన్నాం. ఒకవైపు నుంచి కరోనా అల్లాడిస్తుంటే మరోవైపు నుంచి సీఎం జగన్‌రెడ్డి అల్లాడిస్తున్నారు.


మిమ్మల్నే ఎక్కువ అల్లాడిస్తున్నట్లున్నారు?

అందరినీ అల్లాడిస్తున్నారు. ప్రశ్నిస్తున్నది మేం కాబట్టి మేమే టార్గెట్‌ అవుతాం కదా! తట్టుకుని నిలబడడం కూడా మాకు నేర్పించాడు. నాలా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వాళ్లు రాటుదేలిపోవడానికి ఇదొక మంచి అవకాశమని అనుకుంటున్నా. ఎప్పుడు ఏ పోలీసు వచ్చి ఎక్కడకు ఎత్తుకుపోతాడో తెలియడం లేదు. ఎక్కడ ఎవడొచ్చి సీఐడీ నోటీసు అంటాడో తెలియడం లేదు. 


అధికారంలోకి వస్తే మీరూ అలాగే మాట్లాడించండి!

అప్పుడు వాళ్లకీ, మాకూ తేడా ఏముంటుంది? ఆ విషయంలో చంద్రబాబును తప్పుబట్టలేం. తాను సిస్టం ప్రకారం ఉండాలి.. అందరూ అలాగే ఉండాలని అనుకుంటారు. అయితే మమ్మల్ని ఇబ్బందిపెట్టిన వాళ్లను చట్ట ప్రకారం వదిలేది లేదు. మా నాయకుడికి చెప్పి ఒప్పిస్తాం. కార్యకర్తలు అనుమానపడొద్దు. ఇబ్బంది పెట్టడంలో వాళ్లు పీక్స్‌కు వెళ్లిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. తర్వాత కేసులు పెట్టారు. నాపైనే 11 కేసులు పెట్టారు. అందులో ఒకటి అట్రాసిటీ కేసు. 


మీకు ఏ విషయంలో నోటీసు ఇచ్చారు?

దేవుడి దయవల్ల నేనెక్కడా దొరకలేదు. సీఎంను సైకో అంటాను. అది నిజం కాబట్టి నోటీసు ఇవ్వలేదేమో! అలాగే నత్తి పకోడి, నత్తి రెడ్డి అన్నాను. ఈ మాట అనడానికి కారణం ఉంది. ఒకానొక టైంలో పప్పు నాయుడు అని లోకేశ్‌ ఇమేజ్‌ని ఎంత డ్యామేజ్‌ చేశారో తెలియంది కాదు. ఆ రోజు మాట్లాడని పెద్దమనుషులు ఇప్పుడు నత్తి రెడ్డి అంటే ఉలిక్కిపడతారేం? ఇక నత్తి పకోడి అంటున్నందుకైనా జగన్‌ భాషలో మార్పు రావాలని, తడబడకుండా మాట్లాడాలని కోరుకుంటున్నా.


విపక్షంలో ఉండగా ఆయనెప్పుడూ తడబడలేదు కదా!

నాకు కూడా అదో పెద్ద మిస్టరీ. ఆ రోజు సీఎం అవ్వాలనే కసి ఉంది. ఈ రోజున అది లేదనిపిస్తోంది. ఇప్పుడు పబ్జీ మీద ఉన్న దృష్టి దీని మీద లేనట్లుంది. రికార్డెడ్‌ ప్రెస్‌మీట్లు ఏమిటి సర్‌.. నేను తొలిసారి చూస్తున్నా. బహిరంగ సభల్లో మాట్లాడితే అన్నీ బండ బూతులే. ఆయన స్పష్టంగా మాట్లాడగలిగింది మాత్రం జుట్టు చూపించి మాట్లాడడం గురించే.


మీరేమో ఆయన జుట్టు పీకుతున్నారంటా?

పీకే రోజు ఎలాగూ వస్తుంది. మేమే కాదు.. ప్రజలంతా పీకే రోజు దగ్గర్లోనే ఉంది. 


అత్యున్నతమైన భాషకు నిలయం ఏపీ.. అలాంటిది ఇప్పుడు నీయమ్మ అనే దగ్గరకు వచ్చింది కదా!

అది దిగజారుడు భాష. పార్టీ కార్యాలయం దేవాలయం అంటారు గానీ.. వైసీపీ కండువాలు వేసుకుని అక్కడే కూర్చుని మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారు. తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు మనకు గౌరవం ఇస్తాడని ఎలా ఆలోచించాలి? ఇదే మాట చాలా సందర్భాల్లో చెప్పాను. నేను మాట్లాడిన దానిలో నిజం లేకుంటే ఎన్ని కేసులు పెట్టేవాళ్లో. నేను తెలుగు మహిళ అధ్యక్షురాలినయ్యాక దాదాపు 1,500 కేసులు చూసి ఉంటాం. అన్నీ చైల్డ్‌ అబ్యూజ్‌, రేప్‌లు, మర్డర్లు. రోజుకో సంఘటన జరుగుతోంది. ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే దిశ చట్టం అని ఒకదాన్ని ముందు పెట్టారు. అసలది చట్టమే కాలేదు. ఇప్పటికీ చట్టబద్ధత కల్పించలేకపోయారు.


రోజాకు, మీకు ఏమిటి గొడవలు? 

ఆవిడ చంద్రబాబు గురించి అమర్యాదగా మాట్లాడతారు. అది నాకు నచ్చదు. వ్యవస్థ గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు. అవగాహన కల్పించుకో అని చెబుతాను. అది ఆమెకు నచ్చదు.  


వాళ్లేదో తిట్టారని ఇటీవల మీరెందుకు ఏడ్చారు?

రాజకీయాల్లోకి ఆడవాళ్లు రావాలి.. మహిళా ఓటు బ్యాంకు కావాలని అనుకోవడం.. ఏ ఎన్నికలైనా మహిళలను ముందు పెట్టడం వంటివి చేస్తే మహిళలను వాడుకుంటున్నట్లా? అటువంటి మహిళల గురించి మాట్లాడే సమయంలో కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనేది నా ఉద్దేశం. చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాను. టీచర్‌గా చేసి వచ్చినదానిని. మాలాంటి వాళ్ల గురించే సభ్య సమాజం వినకూడని మాటలు మాట్లాడడం చూస్తుంటే వాడొక తల్లి కడుపున పుట్టాడా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో సంభాళించుకోవడానికి ఒకటే అనుకుంటాను. నిండు అసెంబ్లీలో ఎన్టీఆర్‌ కూతురుకే అవమానం తప్పలేదు. నేనెంత ధైర్యంగా ఉండాలని అనుకుంటాను. ఇప్పుడింకా రాటుదేలతా. నేనైతే చాలా కసిగా ఉన్నా.


అందుకేనా గుడివాడ అమర్నాథ్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు?

కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్టు. మందు పోస్తాం.. ఇంజక్షన్లు వేస్తామంటే కుదరదు. మా నాయకుడు మమ్మల్ని తిట్టినా తిట్టనివ్వండి.. బయటకొచ్చి ఇలాగే చేస్తాం. ఆయనకున్న విజ్ఞత దృష్ట్యా ఆగమని చెప్పవచ్చు. ఆగితే మా సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ పోగొట్టుకున్న వాళ్లవుతాం. ఆయన పని ఆయన చేసుకుంటే.. మా పని మేం చేస్తాం.


విజయసాయిరెడ్డిని ఒక రేంజ్‌లో ఆడుకుంటారెందుకు?

ఆయన రాజ్యసభ సభ్యుడు. పెద్దల సభ ఎంపీగా ఆయన మాటల్లో ఎంత శుద్ధత ఉండాలి.. ఎంతమందికి రోల్‌మోడల్‌ అయి ఉండాలి..? అతడి ట్వీట్స్‌ ఎప్పుడైనా చూశారా? చదువు సంధ్యా లేనోడు.. రోజంతా తాగేసి ఆ మత్తులోనే ఉండేవాడు కూడా అలాంటి పదాలు ఉపయోగించడు. అలాంటి ట్వీట్స్‌ పెట్టే వ్యక్తిని రాజకీయ నాయకుడిగా ఎందుకు పరిగణించాలి? అతడి గురించి ఎవరైనా మాట్లాడితే.. వారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాలో అంత అసభ్యంగా మాట్లాడతారు.


అట్రాసిటీ కేసు పెట్టొచ్చు కదా!

ఎవరు తీసుకుంటారండీ. నేను ప్రైవేట్‌ కేసు వేస్తాను.


అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా!

అధికారంలోకి వచ్చాక చూసుకుంటాం. న్యాయవ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. కానీ అంత ఓపిక లేదు. అకౌంట్లు సెటిల్‌ చేస్తాం. ఎవరి అకౌంట్లు ఎలా సెటిల్‌ చేయాలో అలా చేస్తాం. మా కార్యకర్తలను కాపాడుకోవాలి కదా! తలలు పగులగొట్టించుకున్న కార్యకర్త ఉన్నాడు. జై చంద్రబాబు అన్నందుకు ఒకరి పీక కోసేశారు. అలాంటి వాళ్లందరికీ మేం సమాధానం చెప్పుకోకుంటే ఎలా? తొలి ఆరు నెలల్లో ఇవన్నీ తేల్చేస్తాం.. న్యాయవ్యవస్థ ద్వారా చేసేది చేస్తాం. వ్యక్తిగతంగా చేయాల్సిందీ చేస్తాం. ఇళ్లలో ఉండకుండా మావంటి వాళ్లను బయటకు తెచ్చి సమాజం మీద అవగాహన కల్పించి పోరాడడం నేర్పించిన విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎన్నికల తర్వాత బాధతో 4 నెలలు ఇంటిలోనే ఉండిపోయా. 151 సీట్లు ఇచ్చేంత నమ్మకం ఈయన ఏం కల్పించాడు.. 23 సీట్లకు పడిపోయేంత దారుణాలు మనమేం చేశామని!


ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందా?

మాకు కాదు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ సమాధానం దొరికింది. అది చెప్పుకొనేది కాదు. ఆ సమయంలో చంద్రబాబు ఒకసారి కబురు పంపారు. ఆయన దగ్గరకు వెళ్లిన తర్వాత బాగా ఏడ్చాను. రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నానని చెప్పాను. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఇప్పుడు 23 సీట్లకు తగ్గిపోయానని.. నేను కూడా ఇంటిలో కూర్చోనా అని అడిగారు. నేను కూడా ఇంటిలో కూర్చుంటే పార్టీ ఏమవుతుంది.. మనల్ని నమ్మిన ప్రజల సంగతేంటని అన్నారు. ఆ వెంటనే రేపటి నుంచి అందుబాటులో ఉంటానని చెప్పి వచ్చేశాను. 


గంటాయే మిమ్మల్ని రాజకీయంగా వేధించారా?

కొన్ని కొన్ని పరిస్థితుల్లో అవుననిపించింది. 


ఆయన టీడీపీలో ఉన్నారా?

ఉన్నట్లే. నన్ను భలే ఇరికిస్తున్నారు మీరు.


మీకు, ఆయనకు ఎక్కడ తేడా వచ్చింది?

గంటా, అయ్యన్న ఇద్దరూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అయ్యన్న పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పనిమీద ఆయన దగ్గరకు వెళ్తే ఎవరో ఒకరు మోసేవాళ్లు. నేను అయ్యన్న వర్గమని చెప్పేవాళ్లు. మధ్యలో ఉన్నవాళ్లు పెట్టిన అగ్గి తప్పించి గంటాకు, నాకు వ్యక్తిగతంగా, సిద్ధాంతపరంగా ఏమీ లేవు.


వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేటేనా?

అక్కడే. ఎక్కడకైనా పంపాలనుకుంటే ఆరు నెలల ముందే పంపాలని సర్‌కు చెప్పాను. 


ఇప్పుడు హోం మంత్రి వనిత కదా.. తర్వాత అనితేనా?

ఇప్పుడు అనిత అంటే అందరికీ తెలుసు. తొమ్మిదేళ్ల కాలం టీచర్‌గా ఉన్న అనిత.. ఇవాళ టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలు. ఇంతకంటే ఏం కావాలి? చంద్రబాబును ఇప్పటి వరకూ ఇది కావాలీ అని అడగలేదు. ఆయనే అన్నీ ఇచ్చారు.


పోలీసులు మారారంటున్నారు?

సీఐ, ఎస్‌ఐల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడను. పైన ఉన్న ఐపీఎస్‌ అధికారులు ఇచ్చే సూచనలతో వీళ్లు ముందుకు వెళ్తున్నారు.  కానీ, కోర్టుల ముందు జవాబు చెప్పుకోవలసింది సీఐలు, ఎస్‌ఐలే. రేపు మాకు టార్గెట్‌ కూడా వాళ్లే అవుతారు. ఆ విషయాన్ని చాలా వేదికల మీద నేను కూడా చెప్పాను. కొంతైతే మార్పు వచ్చింది. వాళ్లూ ఉద్యోగులే కదా! ఎంత కాలం ఓర్చుకుంటారు..? పై కేడర్‌లో ఐపీఎ్‌సలు, డీసీపీలు, డీఎస్పీలు వీళ్ల స్థాయిలో మాత్రం జగనిజం పని చేస్తోంది. కొన్ని రకాల కేటగిరీ వాళ్లకు ప్రభుత్వం వైపు వాళ్లతో మింగిల్‌ అవ్వడం అలవాటు. ఆ అలవాటుతోనే అవసరాలు తీర్చుకుంటారు. పవర్‌ ఎంజాయ్‌ చేస్తారు. పోలీసులు రాజకీయాలు మాట్లాడడం ఎక్కువైపోయింది.


ఎస్సీ మహిళపై అట్రాసిటీనా.. అదెలా?

పులివెందులలో ఒక మహిళను కిరాతకంగా హత్య చేశారు. అక్కడకు వెళ్తే అప్పుడు ఆ కుటుంబంతో నాపై అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ నెలలో పులివెందుల కోర్టుకు వెళ్లాలి. ఇప్పుడు మేం కేసులకు భయపడడం లేదు. దాంతో వ్యక్తిగతంగా, సైకలాజికల్‌గా దెబ్బకొట్టాలని మొదలుపెట్టారు. మహిళను కాబట్టి బాడీ షేమింగ్‌, వ్యక్తిత్వ హననం వంటివి మొదలుపెట్టారు.


విజయసాయిరెడ్డి ఏ జాబితాలో ఉన్నాడు..?

ఏ-2 కదా.. ఏ-2 లిస్టులోనే ఉంటారు. చంద్రబాబును ఆయన మాట్లాడిన మాటల కంటే మేం చాలా పద్ధతిగా మాట్లాడతాం. విజయసాయిరెడ్డి ముఖం కూడా నేను చూడలేదు. ఆయన వల్ల మాకు మంచే జరుగుతోంది. ఆయన ఇంకొక నాలుగు నెలలు ఉత్తరాంధ్రలో ఉంటే ఇక్కడ మాకు మరికొన్ని సీట్లు వచ్చే అవకాశాలు పెరిగేవి. అది తెలిసే తప్పించేశారనుకుంటా! వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గెలవగానే మొదట సంబరాలు చేసుకునేది వైసీపీలోని వ్యాపారులే. రాష్ట్రంలో పరిస్థితి మరో శ్రీలంకలా తయారైంది. మరో ఏడాదిలో మనోడు ఎన్నికలకు వెళ్లకుంటే శ్రీలంకలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించినట్లే తాడేపల్లి కొంపను కూడా అలాగే ముట్టడిస్తారేమో ఏపీ ప్రజలు!


ప్రభుత్వం అంటూ వస్తే మీ తొలి టార్గెట్‌ ఎవరు?

కొడాలి నాని.. నిబంధనల ప్రకారమే పని పడతాం. 


సెకండ్‌.. ఏ-2 విజయసాయిరెడ్డేనా?

ఆయన మనస్సాక్షితో పనిచేస్తే అలా ఉండరు. కాబట్టి అనుభవించాల్సిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అలా చేస్తాం.. ఇలా చేస్తామని కాదు గానీ.. వాళ్లు చేసినంత కిరాతక రాజకీయాలు మేం చేయం. మళ్లీ మేమూ అదే చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్లు చేసిన వాటికి నిబంధనల ప్రకారమే చూసుకుంటాం. మాకు కూడా టార్గెట్స్‌ ఉంటాయి కదా!

Read more