లోన్‌ కట్టకపోతే ఫొటోలు బయటపెడతాం

ABN , First Publish Date - 2022-08-31T09:02:50+05:30 IST

లోన్‌ యాప్‌ ద్వారా రూ.ఐదు వేలు అప్పు తీసుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆ అప్పు కట్టాలంటూ ఆ మహిళను బెదిరించి, ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌

లోన్‌ కట్టకపోతే ఫొటోలు బయటపెడతాం

మహారాణిపేట (విశాఖపట్నం), ఆగస్టు 30: లోన్‌ యాప్‌ ద్వారా రూ.ఐదు వేలు అప్పు తీసుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆ అప్పు కట్టాలంటూ ఆ మహిళను బెదిరించి, ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతామని వేధించిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ ఆ వివరాలను మంగళవారం వెల్లడించారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఈ ఏడాది మే 17న మొబైల్‌ ఫోన్‌లో షటిల్‌ అనే లోన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.ఐదు వేల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.3,850 జమ అయ్యాయి. ఈ రుణం మూడు రోజుల్లో తీర్చాలని గడువు ఇవ్వగా.. ఆమె అంతకంటే ముందుగానే కట్టేశారు. అయితే రూ.12వేలు చెల్లించాలని లోన్‌యా్‌ప నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు.


భయపడిన ఆమె రూ.12వేలు కూడా చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఆమె ఫోన్‌లో కాంటాక్ట్స్‌ ఉన్నవారికి వాట్సాప్‌ ద్వారా పంపిస్తామని బెదిరించారు. దీంతో ఆమె విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళతో మాట్లాడిన ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ ఆధారంగా నేపాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలు డబ్బు చెల్లించిన బ్యాంకు ఖాతా హైదరాబాద్‌ కెనరా బ్యాంక్‌ శాఖదిగా గుర్తించారు. బ్యాంకు వారిచ్చిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టి రాజు జయసింహారెడ్డి అనే హైదరాబాద్‌ వాసిని అదుపులోకి తీసుకుని విచారించారు. జయసింహారెడ్డికి ఫేస్‌బుక్‌ ద్వారా హాంకాంగ్‌కు చెందిన కెవిన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లోన్‌యా్‌ప నిర్వహిస్తున్న కెవిన్‌కు జయసింహారెడ్డి బ్యాంకు అకౌంట్ల విషయంలో సహకరిస్తుండేవాడు. ఆ అకౌంట్ల ద్వారా గత ఆరు నెలల్లో రూ.100 కోట్లు లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ఇందుకుగాను యాప్‌ నిర్వాహకుల నుంచి జయసింహారెడ్డి రూ.1.15 కోట్లు లబ్ధి పొందినట్టు గుర్తించారు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించిన 16 అకౌంట్లలోని రూ.కోటి నగదును స్తంభింపజేశారు. 

Read more