‘హర్‌ ఘర్‌ తిరంగా’ సక్సెస్‌ చేస్తాం

ABN , First Publish Date - 2022-07-18T09:29:11+05:30 IST

‘హర్‌ ఘర్‌ తిరంగా’ సక్సెస్‌ చేస్తాం

‘హర్‌ ఘర్‌ తిరంగా’ సక్సెస్‌ చేస్తాం

రాష్ట్రంలో ఇప్పటికే విస్తృత ప్రచారం

1.62 కోట్ల జాతీయ పతాకాల పంపిణీ చేస్తాం

ప్రతి ఇల్లూ.. సముదాయంపైనా మువ్వన్నెల జెండా

అమిషాత్‌ కాన్ఫరెన్సులో సీఎం జగన్‌


అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి):  రాష్ట్రంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమ విజయవంతానికి సమగ్ర  కార్యాచరణతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సమీక్ష నిర్వహించాం. ప్రజలకు తెలియజేసేలా బహుముఖంగా ప్రచారం నిర్వహించాం. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్‌, సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. చైతన్య గీతాలు రూపొందించాం. ర్యాలీలు, సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం. రాష్ట్రంలో పరిశ్రమలతోపాటు సంబంధిత వ్యాపకంలో ఉన్న ఇతర సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగుర వేసేలా వారిని చైతన్య పరిచాం. సీఎ్‌సఆర్‌ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్దేశించాం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం. 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15 వేల గ్రామ వార్డు సచివాలయాలు, ఆశ, అంగన్వాడీ సెంటర్లలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం.  1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికీ పంపిణీ చేస్తారు. ప్రతి ఇంటిపైనా, సముదాయం పైనా జాతీయ పతాకాన్ని ఎగర వేడయం ద్వారా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-18T09:29:11+05:30 IST