మేం చాలా గాయపడ్డాం..!

ABN , First Publish Date - 2022-09-17T10:20:15+05:30 IST

మేం చాలా గాయపడ్డాం..!

మేం చాలా గాయపడ్డాం..!

గత 40 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదు

సీపీఎస్‌ రద్దు కోరితే టీచర్లపై కేసులు పెడతారా?

ఆ కేసులు, బైండోవర్లు వెంటనే ఎత్తివేయాలి

సీపీఎస్‌ రద్దు చేయాలి..

శాసనమండలిలో పీడీఎఫ్‌ డిమాండ్‌

కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం: బొత్స


అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘మేం చాలా గాయపడ్డాం. దీని ప్రభావం మీ మీదా ఉంటుంది. మా మీదా ఉంటుంది’’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనమండలి ప్రారంభంకాగానే.. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పీడీఎఫ్‌, బీజేపీ ఎమ్మెల్సీలు సీపీఎస్‌ రద్దుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఈ రెండు తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, బీజేపీ ఎమ్మెల్సీలు తమ తమ స్థానాల్లో నిలబడి సీపీఎస్‌ రద్దు చేయాలని, సీపీఎస్‌ ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ‘‘మేం అడిగిన సీపీఎస్‌ రద్దు జరగలేదు. సీపీఎస్‌ రద్దుపై నిరసన కార్యక్రమాల్ని వాయిదా వేసుకున్నాం. అయినా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులపై కేసులు పెట్టింది. వెంటనే ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ మోషేన్‌రాజు కలగజేసుకుని ప్రభుత్వంతో మాట్లాడి తెలియజేస్తానని చెప్పారు. సంతృప్తిచెందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు.. రాత్రుళ్లు ఒంటి గంట వరకు ఉపాధ్యాయులను స్టేషన్లలోనే కూర్చోబెట్టారని, బైండోవర్లు చేశారని, కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమన్నారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కేసులు ఎత్తేయమని అడిగినందుకే అరెస్టులు చేస్తారా.. అంటూ బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ కలుగజేసుకుని ప్రభుత్వం దేనిపైనైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని, నోటీసు ఇచ్చి సరైన విధానంలో రావాలని సూచించారు. అప్పుడు కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెబుతామన్నారు. సీఎం ఇల్లు ముట్టడిస్తామనడం భావ్యంగా ఉందా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేసే అంశం చర్చల్లో ఉందని, ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అలాగే డీఎస్సీ అంశంపైనా అధికారులతో చర్చిస్తున్నామని, సంస్కరణల తర్వాత అవసరాన్ని బట్టి డీఎస్సీ అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  


ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలి: పీడీఎఫ్‌

సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తేయాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీని విస్మరించి, ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.


టీచర్లను శత్రువులుగా చూస్తున్నారు: పీడీఎఫ్‌

ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన మొదటి సంవత్సరం ఎలా ఉన్నా.. తర్వాత నుంచి ఉపాధ్యాయులను శత్రువులుగా చూస్తోందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. విద్యారంగంలో సంస్కరణలపై శాసనమండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులను ప్రభుత్వం నమ్మాలని వాళ్లను పాకిస్థాన్‌ వాళ్లలాగా చూస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ఒక వేళ వీళ్లవల్లే నాశనం అయిపోతున్నామని భావిస్తే.. వేరొకరితో చదువు చెప్పించాలని, లేదంటే మీరే చెప్పాలని అన్నారు. ఇంటింటికీ వలంటీర్లను పెట్టారుగా వాళ్లతో చెప్పించండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అకడమిక్‌ వ్యవహారాలను రాజకీయ వ్యవహారాలుగా మార్చొద్దని కోరారు. ప్రైమరీ స్కూళ్లను రెండు ముక్కలు చేశారన్నారు. టీచర్ల వల్లే నాడు-నేడు జరిగిందని ఒక్క మాట కూడా ఎవరూ అనడం లేదన్నారు. చదువు తప్ప సూళ్లలో అన్నీ ఉన్నాయని.. చదువు గురించి అడిగే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ పరిశీలిస్తే మన పాఠశాలల్లో విద్య చాలా ఘోరంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మాట్లాడుతూ... డీఎస్సీ లేదు, రంగులు వేశాం.. ట్యాబులు ఇచ్చామంటే తెలివితేటలు పెరుగుతాయా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ.. స్కూళ్లను విలీనం చేస్తూ ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాలు, కళాశాల్లో పోస్టులు భర్తీ చేయాలన్నారు.

Updated Date - 2022-09-17T10:20:15+05:30 IST