జనంలోకి తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-11-29T00:16:55+05:30 IST

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన బాదుడే.. బాదుడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న టీడీపీ మరో వినూత్న ప్రయోగానికి ప్రణాళిక రూపొందించింది. మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు నవ సంకల్పం బూనింది. ప్రజల కష్టాలను తెలుసుకుని తోడుగా ఉన్నామన్న ధైర్యాన్ని వారికి అందివ్వాలని యోచిస్తోంది.

జనంలోకి తమ్ముళ్లు

డిసెంబరు 1 నుంచి ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’

మరో వినూత్న కార్యక్రమానికి టీడీపీ కార్యాచరణ

60 శాతం ఓటర్లను కలిసేలా అధినేత ప్రణాళిక

నియోజకవర్గ ఇన్‌చార్జిలదే కీలక బాధ్యత

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశం

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన బాదుడే.. బాదుడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న టీడీపీ మరో వినూత్న ప్రయోగానికి ప్రణాళిక రూపొందించింది. మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు నవ సంకల్పం బూనింది. ప్రజల కష్టాలను తెలుసుకుని తోడుగా ఉన్నామన్న ధైర్యాన్ని వారికి అందివ్వాలని యోచిస్తోంది. అధినేత ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు సరికొత్తగా రంగంలోకి దిగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న భూ దందాలు, ఇసుక మాఫియా ఆగడాలు, కుంభకోణాలు, అరాచకాలు, దాడులు, ప్రశ్నించేవారిపై కేసులు, పథకాల్లో మోసాలు, నింగినంటిన ధరలు తదితర అంశాలపై యుద్ధం చేయడానికి ముందుకు కదులుతున్నాయి. ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ పేరుతో డిసెంబరు ఒకటి నుంచి పోరుబాట పడుతున్నాయి.

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

టీడీపీ శ్రేణులు సమరానికి సమాయత్తమవుతున్నాయి. అధినేత ఆదేశాలతో కొత్త జవసత్వాలను చేబూని ప్రజల ముందుకు వెళ్లనున్నాయి. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో నడవనున్నాయి. అమరావతిలో నియోజకవర్గాల వారీగా ఇటీవల నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాయకులు, కార్యకర్తలకు దిశను నిర్దేశించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలే కీలకంగా వ్యవహరించి శ్రేణులను ఎన్నికల వాతావరణంలోకి తీసుకువెళ్లాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలనే కాకుండా స్థానికంగా అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేపడుతున్న అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల ముందుంచాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అభినందించారు. మరో కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని టీడీపీ శ్రేణులంతా కొత్త కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. డిసెంబరు 1నుంచి పోరుబాటను పునః ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల సమన్వయంతో పోరాటం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నది కొత్త కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 60 శాతం ఓటర్లను కలవాలని భావిస్తున్నారు. మండలాల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కలుపుకుని ముందుకు వెళ్లాలని పార్టీ ఆదేశించింది.

ఒక్కటిగా ప్రజల వద్దకు..

నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఎవరికివారు కార్యక్రమాలు చేపట్టడం.. నాయకుల మధ్య చిన్నచిన్న అభిప్రాయభేదాలు ఉండడాన్ని అధినేత గుర్తించి వాటిని వీడాలని, ఒక్కటిగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. నియెజకవర్గ ఇన్‌చార్జిలు అందరినీ కలుపుకుని పోవాలని నిర్దేశించారు. జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు రాష్ట్ర పార్టీ సూచనలను తేలిగ్గా తీసుకుంటున్నారన్న విమర్శ శ్రేణుల్లో ఉంది. విజయనగరంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో కొన్ని వార్డుల్లో మినహా కీలక నేతలు పాల్గొనలేదని అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్‌చార్జిలు మరింత యాక్టివ్‌గా వ్యవహరించాలని అధిష్ఠానం సూచించింది. వివిధ కేడర్లలో ఉన్న పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతలను ఇన్‌చార్జిలకే అప్పగించింది. కొత్త కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించింది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లోనూ ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ చేపట్టాలంది. అలాగే నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి వరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలని టీడీపీ జిల్లా కార్యాలయాలకు ఆదేశాలొచ్చాయి.

- ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ద్వారానే రాబెట్టి నమోదు చేసుకుంటారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించనున్నారు. టీడీపీ చేపట్టిన ప్రజాహిత పనులను వైసీపీ నిలిపేయడాన్ని కూడా తెలియజేస్తారు. ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తారు.

- పెరుగుతున్న ధరలు, ఇష్టారాజ్యంగా పన్నుల విధింపు, ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీల పెంపు తదితర అంశాలను గుర్తు చేస్తారు. ధాన్యంతో పాటు వివిధ పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవటం, ధాన్యం కొనుగోలులో వైఫల్యం, అధ్వాన్నగా రహదారులు, నిధుల దుర్వినియోగం, తాగునీరు, విద్య, వైద్య సమస్యలు ఇలా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నాది కొత్త కార్యక్రమ ఉద్దేశం. ప్రతి నియోజకవర్గానికీ ఒక పరిశీలకుడ్ని నియమించాలని కూడా పార్టీ నిర్ణయించింది.

- ప్రజా సమస్యలను నమోదు చేసుకోవడం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించడం.. నియోజకవర్గ స్థాయిలో 50కి తగ్గకుండా సమావేశాలు ఏర్పాటుచేయడం ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమం ఉద్దేశం. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, విన్నపాలను అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు భరోసా ఇవ్వనున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

డిసెంబరు 1 నుంచి చేపడుతున్న ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం అయింది. భిన్నమైన కార్యక్రమం కావడంతో శ్రేణులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళతాం. అభివృద్ధి ఈ నాయకులు విడిచిపెట్టారు. రైతులకు అందించాల్సిన రాయితీలను ఎత్తివేశారు. ప్రజా సమస్యలన్నీ ప్రజల ముందుంచుతాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాం. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వనున్నాం. కొత్త కార్యక్రమంపై పార్లమెంటరీ స్థాయిలో ముఖ్య నేతలకు ఒకసారి శిక్షణ ఇచ్చారు. తాజాగా రెండు విడతల్లో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ నియోజకవర్గానికి 300 మందికి చొప్పున శిక్షణ ఇస్తున్నాం.

- కిమిడి నాగార్జున, అధ్యక్షుడు, టీడీపీ పార్లమెంటరీ నియోజకర్గం, విజయనగరం

Updated Date - 2022-11-29T00:17:27+05:30 IST