‘అద్దె’ మీరి వసూలు

ABN , First Publish Date - 2022-12-13T00:30:25+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎక్సైజ్‌ అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తున్నాయి. తాజాగా బార్లు రూపంలో కూడా నేతలు ఆదాయం రాబెట్టుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాల్లో 23 బార్లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే

‘అద్దె’ మీరి వసూలు
రాజాం: బొబ్బిలి రోడ్డులో నిర్వహిస్తున్న మద్యం దుకాణం

రికార్డుల్లో ఒకలా.. వాస్తవం మరోలా

మద్యం దుకాణాల నిర్వహణలో ఇష్టారాజ్యం

అధికారపార్టీ నాయకులే షాపుల యజమానులు

పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు

రాజాం, డిసెంబరు 12: ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎక్సైజ్‌ అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తున్నాయి. తాజాగా బార్లు రూపంలో కూడా నేతలు ఆదాయం రాబెట్టుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాల్లో 23 బార్లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే విజయనగరం పట్టణంతో పాటు బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీ, శ్రీకాకుళం నగరంతో పాటు ఇచ్ఛాపురం. పలాస- కాశీబుగ్గ, ఆముదాలవలస, పాలకొండ నగర పంచాయతీలో వాటిని ఏర్పాటు చేశారు. బార్లు అద్దెల విషయంలో రికార్డుల్లో పేర్కొన్నదానికి.. వాస్తవంగా మాట్లాడుకున్నదానికీ తేడా ఉంటోంది. అద్దెల రూపంలో ఎక్కువగా చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రాజాంలో మద్యం మాల్స్‌కు రూ.25 నుంచి రూ.30 వేలు మాత్రమే చెల్లించాలి కానీ నెలకు రూ.80 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రస్తుతం 297 మద్యం దుకాణాలు ఉన్నాయి. 17 వరకు మాల్స్‌, 23 వరకూ బార్లుకు అనుమతులిచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఒక్కో షాపునకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. మాల్స్‌కు ఏకంగా నెలకు ఒక్కోదానికి రూ.80 వేల నుంచి రూ.90 వేలు వరకు చెల్లిస్తున్నారు. ఈ మాల్స్‌ కోసం అద్దెకు తీసుకున్న షాపులు వైసీపీ నాయకులవి గనుక అధికారులు నేతలు చెప్పిన విధంగా ధరలు నిర్ణయించి అద్దెలు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఎక్కువ మద్యం దుకాణాలు అధికార పార్టీ నాయకులకు చెందినవే. ప్రభుత్వ మద్యం దుకాణాల చుట్టూ వెలుస్తున్న చిన్న షాపులు సైతం నేతలకు చెందినవే. ఫాస్ట్‌ఫుడ్‌, ఇతర చిరుతిల్లుకు సంబంధించి షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో నాయకులే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు.

విచ్చలవిడిగా బెల్ట్‌

మద్యం సేల్స్‌ పెంచడానికి గ్రామాలు, పట్టణాల్లోనూ విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయి. షాపుల్లో పనిచేస్తున్న వారు, ఎక్సైజ్‌ సిబ్బంది ఒక్కటై మద్యాన్ని బెల్ట్‌లకు తరలిస్తున్నారు. అయితే మద్యం తీసుకువెళ్లి బెల్ట్‌ దుకాణాలకు అందజేస్తున్నవారికి కొంత, ఎక్సైజ్‌ సిబ్బందికి కొంత ముట్టచెబుతున్నట్టు తెలిసింది. ఆటో డైవర్ల ద్వారా కూడా మద్యం తరలుతోందని సమాచారం. ఈవిషయంలో ఎక్సైజ్‌ జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజాం ప్రభుత్వ మద్యం షాపుల నుంచి మహిళలే అధికంగా మద్యాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు.

తరలిస్తున్న విషయం తెలియదు

మద్యం షాపుల నుంచి బెల్ట్‌ షాపులకు మద్యం తరలిస్తున్న విషయం నాదృష్టికి రాలేదు. ఈవిషయంలో షాపులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాను. బెల్ట్‌ షాపులను ఎత్తి వేయాలని ప్రభుత్వమే ఆదేశించింది. మాల్స్‌కు అద్దెలు ఎక్కువగా చెల్లిస్తున్నారని చెప్పడం వాస్తవం కాదు. కొలతలు వేసి షాపులకు అద్దెలు చెల్లిస్తున్నాం.

- జి.దాసు, ఎక్సైజ్‌ జిల్లా సూపరింటెండెంట్‌, శ్రీకాకుళం

Updated Date - 2022-12-13T00:30:25+05:30 IST

Read more