యార్డు.. వెరీ బ్యాడ్‌!

ABN , First Publish Date - 2022-12-13T23:38:01+05:30 IST

జిల్లా కేంద్రంగా మారినా పార్వతీపురం మునిసిపాల్టీ డంపింగ్‌ యార్డు సమస్య మాత్రం కొలిక్కి రావడం లేదు. పట్టణం పెరిగింది..పట్టణ జనాభా పెరిగారు. ప్రజల అవసరాలు పెరిగాయి. చెత్త, వ్యర్థాల లభ్యత అధికమైంది. కానీ అందుకు తగ్గట్టు డంపింగ్‌యార్డు సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. పార్వతీపురం మునిసిపాల్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది.

యార్డు.. వెరీ బ్యాడ్‌!
రాయఘడ రోడ్డులోని డంపింగ్‌ యార్డు

యార్డు.. వెరీ బ్యాడ్‌!

డంపింగ్‌ యార్డు నిర్వహణ అస్తవ్యస్తం

కొలిక్కిరాని తరలింపు ప్రక్రియ

కలగానే చెత్తశుద్ధి కేంద్ర నిర్మాణం

జిల్లా కేంద్రంగా మారినా.. ఫలితం శూన్యం

(పార్వతీపురం టౌన్‌)

జిల్లా కేంద్రంగా మారినా పార్వతీపురం మునిసిపాల్టీ డంపింగ్‌ యార్డు సమస్య మాత్రం కొలిక్కి రావడం లేదు. పట్టణం పెరిగింది..పట్టణ జనాభా పెరిగారు. ప్రజల అవసరాలు పెరిగాయి. చెత్త, వ్యర్థాల లభ్యత అధికమైంది. కానీ అందుకు తగ్గట్టు డంపింగ్‌యార్డు సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. పార్వతీపురం మునిసిపాల్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1959లో మునిసిపాల్టీగా అవతరించింది. పంచాయతీగా ఉన్నప్పుడే పారిశుధ్య నిర్వహణలో భాగంగా పట్టణ శివార్లలో 5 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేశారు. 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో డంపింగ్‌ యార్డు తరలింపుపై మునిసిపాల్టీ ప్రత్యేక తీర్మానం చేసింది. సంగంవలస పంచాయతీ పరిధిలోని పిట్టలవలస సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ దానిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమం ఎగసిపడడంతో మునిసిపల్‌ అధికారులు వెనక్కి తగ్గారు. సైలెంట్‌ అయిపోయారు. అటు తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డంపింగ్‌ యార్డు ఏర్పాటుపై దృష్టిసారించింది. 2017లో రావికోన బట్టివలస సమీపంలోకి మునిసిపల్‌ డంపింగ్‌ యార్డు తరలింపుతో పాటు చెత్తశుద్ధి కేంద్రం నిర్వహణకు మునిసిపల్‌ పాలకవర్గం సన్నాహాలు చేసింది. కానీ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు వ్యతిరేకించాయి. నాడు విపక్షంలో ఉన్న వైసీపీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తరలింపు, చెత్తశుద్ధి కేంద్రం నిర్వహణ సైతం నిలిచిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా కనీసం అటువంటి ఆలోచనేదీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

చెత్త శుద్ధి ప్రక్రియేదీ?

2006లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరుచేసి రీ సైక్లింగ్‌ ప్రక్రియకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.5 లక్షలతో చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటుకు సిద్ధపడ్డారు. కానీ డంపింగ్‌ యార్డు తరలింపు అంశం తెరపైకి రావడంతో ఆ అంశాలన్నీ మరుగున పడిపోయాయి. చెత్తశుద్ధి ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారినా సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి అభ్యంతరాలు రాని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అక్కడకు యార్డు తరలిస్తే రవాణా, ఇతరత్రా ఖర్చులు పెరిగే అవకాశముండడంతో అధికారులు వెనక్కి తగ్గుతున్నారన్న ప్రచారం ఉంది. అయితే ప్రజాప్రతినిధులకు పనికొచ్చే విషయాలకు ప్రాధాన్యమిస్తున్న పాలకవర్గం.. ప్రజలకు అవసరమైన పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సామర్థ్యానికి మించి చెత్తను యార్డులో పోశారు. స్థలం చాలక ప్రస్తుతం రోడ్డుపక్కన చెత్త వేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే వివేకానంద కాలనీ, లెప్రసీ కాలనీల ప్రజలు పడుతున్న బాధ వర్ణనాతీతం. పక్కనే ఉన్న గోపసాగరం కలుషితమవుతోంది. దీనిపై రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వం విఫలం

డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. సమీప కాలనీల్లో భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. కనీసం డంపింగ్‌ యార్డు తరలించే ఏర్పాటు చేయకపోవడం దారుణం. ఇప్పటికైనా పాలకులు స్పందించకుంటే టీడీపీ తరుపున పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.

- జి.రవికుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, పార్వతీపురం

చెరువు కలుషితం

డంపింగ్‌ యార్డుతో గోపసాగరం కలుషితమవుతోంది. శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. చెరువులో మత్స్యసంపద సైతం మృత్యువాత పడుతోంది. యార్డు తరలింపులో జాప్యం శాపంగా మారుతోంది. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరముంది.

చుక్క చంద్రరావు, గోపసాగరం ఆయకట్టు రైతు

సమస్య పరిష్కారానికి కృషి

డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాం. యార్డు తరలింపుతో పాటు చెత్తిశుద్ధి కేంద్రం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులకు స్థలాన్ని మంజూరు చేయాలని కోరాం. స్థలం కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. మున్సిపాల్టీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం.

జె. రామఅప్పలనాయుడు, మునిసిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

1111111111111111111111111111111111111

Updated Date - 2022-12-13T23:38:03+05:30 IST