-
-
Home » Andhra Pradesh » Vizianagaram » worse is the interstate road-MRGS-AndhraPradesh
-
అడుగడుగునా గోతులే!
ABN , First Publish Date - 2022-08-18T04:53:41+05:30 IST
తోటపల్లి నుంచి గుణుపూరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది.

అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
రాకపోకలకు ఇక్కట్లు
నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు
జియ్యమ్మవలస, ఆగస్టు 17 : తోటపల్లి నుంచి గుణుపూరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇక చినుకు పడితే చాలు ఈ రహదారి చెరువును తలపిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో భారీగా వర్షపునీరు చేరుతుంది. దీంతో ఈ మార్గంలో ఎక్కడ గొయ్యి ఉందో తెలుసుకోవడం కష్టం. ఇటీవల ప్రతిపక్ష నాయకులు ఆయా గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అయినా స్పందించేవారే కరువయ్యారు. వాస్తవంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి నుంచి ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల బోర్డర్ గుణుపూరు వరకు హైవే రోడ్డు నిర్మాణానికి 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యూడెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నుంచి రూ. 33 కోట్లు మంజూరు చేశాయి. ఈ నిధులతో 2021 డిసెంబరులో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ప్రాంతవాసులు సంతోషించారు. కానీ ఇంతలోనే రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. అర్ధాంతరంగా పనులు ఎందుకు ఆగాయో తెలియక స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. దీనిపై రోడ్లు భవనాలశాఖ ఏఈ నిర్మలను వివరణ కోరగా... వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చుతున్నామన్నారు. త్వరలో రహదారి పనులు ప్రారంభిస్తామన్నారు.