గ్యాస్‌ సిలిండర్‌ పేలి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-08-15T05:35:40+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ మహిళ మృతిచెందిన ఘటన వేపాడ మండలంలోని పెదకృష్ణరాజపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి మహిళ మృతి

  పేలుడు దాటికి కుప్పకూలిన ఇల్లు

 వేపాడ: గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ మహిళ మృతిచెందిన ఘటన వేపాడ మండలంలోని పెదకృష్ణరాజపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డాబా ఇల్లు కుప్పకూలింది. వల్లంపూడి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదకృష్ణరాజపురం జంక్షన్‌లో రొంగళి చంద్రమ్మ(40) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఆదివారం ఉదయం 9గంటల సమయంలో వంట చేసేందుకు గ్యాస్‌ ఆన్‌ చేసి,  స్టవ్‌ వెలిగించి వంట చేస్తుండగా ప్రమాదవశాత్తుసిలిండర్‌ భారీ శబ్ధంతో పేలడంతో ఇంటి పైకప్పు కుప్పకూలింది. చంద్రమ్మపై ఒక్కసారిగా శ్లాబు పడడంతో ఆమె   అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహం తునాతునకలై చెల్లా చెదురుగా తుళ్లి పడింది. అది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. చంద్ర మ్మ భర్త సన్యాసిరావు(45) గత ఏడాదే అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఆమె అకాల మరణం పొందడంతో వారి కుమారుడు శివరామ్‌, కుమార్తె శ్రావణిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయాన్ని స్థానికులు ఫోన్‌ ద్వారా ఎస్‌.కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌.కోట సీఐ సింహాద్రినాయుడు  ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికిగల కారణాలను తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్‌, వైసీపీ మండల అధ్యక్షుడు ముమ్మలూరి జగ్గుబాబు ఘటన వివరాలను సీఐకి తెలియజేసి, మృతిరాలి కుమార్తె, కుమారులను ఆదుకునే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మృతురాలి కుమారుడు శివరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్‌ఐ కె.రాజేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పంచనామ పూర్తి చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

Read more