పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2022-12-09T23:59:52+05:30 IST

జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

పూర్తయ్యేనా?
కొమరాడలో విద్యుదీకరణ పనులకు నోచుకోని జగనన్న కాలనీ

నత్తనడకన గృహ నిర్మాణాలు

సామూహిక గృహప్రవేశాలకు సమీపిస్తున్న గడువు

హైరానా పడుతున్న అధికారులు

అయినా ముందుకు రాని లబ్ధిదారులు

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

ఇది కొమరాడ మండల కేంద్రంలో జగనన్న కాలనీ . ఈ లేఅవుట్‌లో 60 మందికి పట్టాలు ఇచ్చారు. ఇప్పటివరకూ 4 ఇళ్లకే స్లాబ్‌ పూర్తయ్యింది. మరో 56 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు 50 ఇళ్లు పునాదుల దశలోనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో విద్యుత్‌, రోడ్లు, నీటి సదుపాయం కల్పించలేదు. దీంతో గృహ నిర్మాణాలు మరింత జాప్యమవుతున్నాయి.

ఇలా ఒక్క కొమరాడలోనే కాదు.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 21న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలంటోంది. శతశాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే సర్కారు నిర్దేశించిన తేదీకి ఇంకా పదకొండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు నానా హైరానా పడుతున్నారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికి పనులు ముందుకు సాగడం లేదు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గంలో కొమరాడ, సాలూరు, పాలకొండలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 309 లేఅవుట్లు వేశారు. వాటిల్లో 8,448 ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకూ కేవలం 727 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. 70 మంది లబ్ధిదారులు పూర్తిగా గృహ నిర్మాణాలను ప్రారంభించలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. బీబీఎల్‌ దశలో 3,969, బీఎల్‌లో 2970, ఆర్‌ఎల్‌లో 500, ఆర్‌సీ దశలో 218 ఉన్నాయి. ఇక జిల్లాలో సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు 13,144 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 5,911 ఇళ్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. మిగిలిన 214 మంది పూర్తిగా ప్రారంభించలేదు. బీబీఎల్‌ దశలో 2421, బీఎల్‌ దశలో 2045, ఆర్‌ఎల్‌ దశలో 1695, ఆర్‌సీ దశలో 871 ఇళ్లు ఉన్నాయి. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు లేకపోలేదు. వాస్తవంగా చాలా లేఅవుట్లలో విద్యుత్‌ సరఫ రాకు సంబంధించిన పనులు పూర్తికాలేదు. స్తంభాలు వేసి చేతులు దులుపు కున్నారు. మిగిలిన పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి. అనేక కాలనీల్లో రహదారుల సదుపాయం కూడా లేదు. దీంతో గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను తీసుకెళ్లలేక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు నీటి సమస్య కూడా వారిని వేధిస్తోంది. లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకోలేక చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈనెల 21 నాటికి జిల్లాలో పదివేల గృహప్రవేశాలను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే లేఅవుట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గడువులోగా గృహ నిర్మాణాలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

జాప్యానికి అనేక కారణాలు

జిల్లాలో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకే ఆది నుంచి ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించడం లేదు. ఊరికి దూరంగా లేఅవుట్లు కేటాయించడం, కొండలు, గుట్టలు, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పట్టాలివ్వడం, ఇళ్ల నిర్మాణం విషయంలో స్పష్టత లోపించడం తదితర కారణాలతో ప్రారంభం నుంచి నిర్మాణాలు జోరందుకోవడం లేదు. తొలుత ప్రభుత్వం నేరుగా ఇల్లు కట్టిస్తామని చెప్పి తర్వాత వెనక్కి తగ్గడం కూడా ఇళ్ల జాప్యానికి మరో కారణం. సెంటున్నర స్థలంలో ఇంటి నిర్మాణానికి చాలామంది విముఖత చూపారు. పైగా రూ.1.80 లక్షలే కేటాయించడం, ఆ మొత్తం ఎటూ చాలకపోవడంతో చాలామంది ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం

జిల్లాలోని జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

- రఘురాం, గృహ నిర్మాణశాఖ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - 2022-12-09T23:59:54+05:30 IST