ఇంటికల తీరేదెన్నడు?

ABN , First Publish Date - 2022-12-13T23:40:42+05:30 IST

ప్రతి పేదోడికీ సొంతింటి కల తీరుస్తామన్నారు. అవసరమైతే ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆర్భాటంగా జగనన్న కాలనీలు వేశారు. ఉన్నచోటుకు దూరంగా స్థలాలు ఇచ్చారు. అయితే సౌకర్యాలు మర్చిపోయారు.

ఇంటికల తీరేదెన్నడు?
సాలూరు నియోజకవర్గం గుమడాం లే అవుట్‌లో మధ్యలో నిలిచిపోయిన రహదారి నిర్మాణం

ఇంటికల తీరేదెన్నడు?

పట్టణాల లేఅవుట్లలో నత్తనడకన నిర్మాణాలు

రోడ్ల నిర్మాణాలకు జరగని బిల్లుల చెల్లింపులు

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

ప్రతి పేదోడికీ సొంతింటి కల తీరుస్తామన్నారు. అవసరమైతే ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆర్భాటంగా జగనన్న కాలనీలు వేశారు. ఉన్నచోటుకు దూరంగా స్థలాలు ఇచ్చారు. అయితే సౌకర్యాలు మర్చిపోయారు. నిధులు కూడా విడుదల చేయడంలేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 24,740 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 6,720 మాత్రమే పూర్తయ్యాయి. వీరిలో అధికశాతం సొంత స్థలాల్లో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు ఉన్నారు.

సాలూరులో ఇలా..

సాలూరు లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న గుమడాం వద్ద స్థలాలు కేటాయించారు. ఇక్కడ ఐదు లే అవుట్లు వేశారు. దూరంగా ఉండటంతో లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. గుమడాం లేఅవుట్‌ 5వ నెంబర్‌లో 1,337 మంది లబ్ధిదారులకు స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 35 మంది మాత్రమే నిర్మాణాలను ప్రారంభించారు. గుమడాం 1, 2, 3, 4 లేఅవుట్లలో 287 మంది లబ్ధిదారులకు కేటాయించారు. ఇక్కడ 46 మంది మాత్రమే ఇళ్లను చేపట్టారు. ఇక నెల్లిపర్తి ప్రాంతంలో ఒక లేఅవుట్‌లో 148 ఇళ్లు కేటాయించగా 13 మాత్రమే మొదలయ్యాయి. మరో లేఅవుట్‌లో 443 ఇళ్లు కేటాయించగా 230 ప్రారంభమయ్యాయి.

పార్వతీపురంలో ఇలా..

జిల్లా కేంద్రం పార్వతీపురం లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాల ఎంపికలో రెవెన్యూశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నర్సిపురం పంచాయతీ పరిధిలోని విశ్వంబరపురం కొండ వద్ద ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేశారు. 848 మందికి స్థలాలను కేటాయించారు. ఇప్పటివరకు ఇక్కడ ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగలేదు. పెదమరికి పంచాయతీలో 475 మందికి ఇళ్లను మంజూరు చేశారు. 78 మంది మాత్రమే పునాదులు చేపట్టారు. పట్టణ లబ్ధిదారులకు కేటాయించిన వాటిలో 15 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

లబ్ధిదారులకు గత రెండు నెలలుగా బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. దీంతో వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలాగే పాలకొండ, పార్వతీపురం, సాలూరు పట్టణాల పరిధిలో గల జగనన్న లేఅవుట్లలో రహదారుల నిర్మాణాలకు సంబంధించి సుమారు రూ.కోటి బిల్లులు చెల్లించాల్సి ఉంది.

వేగవంతంగా సాగుతున్నాయి

జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు సత్వరమే చేపడుతున్నాం. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుగుతాయి.

- రఘురాం, గృహ నిర్మాణశాఖ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా

చేపట్టిన పనులకు చెల్లింపు

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి చేపట్టిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నాము. సాలూరులో రూ.20 లక్షలు, పార్వతీపురంలో రూ.9 లక్షల బిల్లులు అప్‌లోడ్‌ చేశాం. వీటిని చెల్లించవలసి ఉంది.

- కె.దక్షిణామూర్తి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌

1

Updated Date - 2022-12-13T23:40:42+05:30 IST

Read more