ఎన్నికలు ఎప్పుడొచ్చినా..టీడీపీదే విజయం

ABN , First Publish Date - 2022-12-09T23:59:44+05:30 IST

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే విజయమని ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా..టీడీపీదే విజయం
విలేఖర్లతో మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకటన్న

ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జి బుద్దా వెంకన్న

జియ్యమ్మవలస, డిసెంబరు 9 : ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే విజయమని ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం చినమేరంగిలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క చాన్స్‌ పేరుతో రాష్ట్రాన్ని బీహార్‌ కంటే వెనుకబడేలా చేసిన సీఎం జగన్‌కు మరో చాన్స్‌ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 16 నెలలు జైల్‌లో ఉండి, లక్ష కోట్లు దోపిడీ చేసే అనుభవం ఉన్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్‌ ఇచ్చి ప్రజలు మోసపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే అన్ని వర్గాలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ధరలు, పన్నులు పెంచడమే తప్ప అభివృద్ధి శూన్యమని చెప్పారు. రాష్ట్రమంతా జగన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తుంటే, ఉత్తరాంధ్రలో మాత్రం వీజే ట్యాక్స్‌ (విజయసాయిరెడ్డి, జగన్‌రెడ్డి) ట్యాక్స్‌ వసూళ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాబ్‌ క్యాలెండర్‌తో చేసిన మోసాన్ని నిరుద్యోగులు మరిచిపోరన్నారరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఓటుతో తగిన విధంగా బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. టీడీపీని గెలిపించి, తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి, ముఖ్య నాయకులు డొంకాడ రామకృష్ణ, కోలా రంజిత్‌, సుమన్‌, అక్కేన మధుసూదనరావు, గులిపల్లి సుదర్శనరావు, వెంపటాపు భారతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఐదు మండలాల కన్వీనర్లు, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:59:46+05:30 IST