అందుబాటులోకి వచ్చేదెప్పుడు?

ABN , First Publish Date - 2022-10-12T05:24:47+05:30 IST

జిల్లాలోని ఐటీడీఏల పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అట్టహాసంగా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర సర్కారు ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. దీంతో ఆయా పనులు ముందుకు సాగడం లేదు.

అందుబాటులోకి వచ్చేదెప్పుడు?
పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సేకరించిన స్థలం

  జిల్లాలో సాగని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం

  మంజూరుకే పరిమితమైన వైద్య కళాశాల

  పనుల పూర్తిపై సందేహాలెన్నో.. 

  పెదవి విరుస్తున్న ప్రజలు 

 పార్వతీపురం, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి)

ఆసుపత్రుల నిర్మాణంపై ప్రభుత్వం చెప్పే మాటలకు... క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు.  అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలోని ఐటీడీఏల పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అట్టహాసంగా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర సర్కారు ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. దీంతో ఆయా పనులు ముందుకు సాగడం లేదు. త్వరితగతిన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్న  జిల్లావాసులకు నిరాశే ఎదురవుతుంది.  అసలు జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ  చేపట్టారు. ఇందులో భాగంగా పార్వతీపురంలో కొట్లాది రూపాయలు విలువ చేసే పశుసంవర్థక శాఖ, ఆర్‌అండ్‌బీ భవనాలను ఖాళీ చేయించారు. కొన్నింటిని తొలగించారు.  ఆసుపత్రి నిర్మాణానికి పనులు వేగవంతం చేస్తున్నారని, త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని అంతా భావించారు. అయితే నెలలు గడుస్తున్నా.. ఆ పనులు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జిల్లాకేంద్రంలో కొత్త భవన నిర్మాణానికి కనీసం పునాదులు కూడా వేయలేదు. సీతంపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది.  కనీసం 25శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. మొత్తంగా ఎప్పటికి ఈ పనులు పూర్తవుతాయన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా జిల్లాకు ప్రభుత్వం వైద్య కళాశాల మంజూరు చేసినప్పటికీ ఇంతవరకూ దీనిపై ఎటువంటి కదలిక లేదు.  దాని నిర్మాణానికి సంబంధించి కనీసం స్థల పరిశీలన కూడా చేయలేదు.  దీనిపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో గిరిజనులకు అత్యవసర వేళల్లో  మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. జిల్లాకేంద్రం నుంచి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి విశాఖ, విజయనగరం జిల్లాలో ఆసుపత్రులకు తరలివెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి మార్గమధ్యంలోనే రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లావాసులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో త్వరితగతిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

  పనులు ప్రారంభిస్తాం

జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం. వైద్య కళాశాలకు సంబంధించి 50 ఎకరాల వరకూ స్థల సేకరణ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపడతాం.

               - సత్య ప్రభాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఏపీఎమ్‌ఐడీసీ, పార్వతీపురం 


Read more