సహకార ఎన్నికలు ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-06-12T05:45:42+05:30 IST

సహకార సంఘం ఎన్నికలకు మరోసారి కదలిక వచ్చింది. ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్టు సహకార శాఖ సంకేతాలిచ్చింది. అయితే ఎన్నికపై పలుమార్లు ప్రకటన చేసినా.. వాయిదా పడుతూ వస్తోంది. గత దశాబ్ద కాలంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగలేదు. ఎప్పటకప్పుడు ప్రకటనలతోనే మమ అనిపించేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల నిర్వహణపై రెండు సార్లు ప్రకటన చేశారు. కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. చివరిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో సహకార ఎన్నికలు జరిగాయి. 2013తో పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. కానీ అప్పట్లో పీఏసీఎస్‌ అధ్యక్షుల పదవీకాలం పొడిగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైతం ఎన్నికలకు నోచుకోలేదు. త్రిసభ్య కమిటీల ద్వారా పాలకవర్గాలను నడిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికలపై దృష్టిపెట్టలేదు. నామినేటెడ్‌ ప్రాతిపదికన అధ్యక్షులను, సభ్యులను నియమించారు.

సహకార ఎన్నికలు ఎప్పుడో?దశాబ్దకాలంగా జరగని ఎలక్షన్లు

2013తో ముగిసిన పాలకవర్గాల పదవీకాలం

త్రిసభ్య కమిటీలు, ప్రత్యేకాధికారులతో నెట్టుకొస్తున్న వైనం

(రాజాం)

సహకార సంఘం ఎన్నికలకు మరోసారి కదలిక వచ్చింది. ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్టు సహకార శాఖ సంకేతాలిచ్చింది. అయితే ఎన్నికపై పలుమార్లు ప్రకటన చేసినా.. వాయిదా పడుతూ వస్తోంది. గత దశాబ్ద కాలంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగలేదు. ఎప్పటకప్పుడు ప్రకటనలతోనే మమ అనిపించేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల నిర్వహణపై రెండు సార్లు ప్రకటన చేశారు. కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. చివరిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో సహకార ఎన్నికలు జరిగాయి. 2013తో పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. కానీ అప్పట్లో పీఏసీఎస్‌ అధ్యక్షుల పదవీకాలం పొడిగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైతం ఎన్నికలకు నోచుకోలేదు. త్రిసభ్య కమిటీల ద్వారా పాలకవర్గాలను నడిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికలపై దృష్టిపెట్టలేదు. నామినేటెడ్‌ ప్రాతిపదికన అధ్యక్షులను, సభ్యులను నియమించారు. 

 ఎప్పటికప్పుడు వాయిదా

వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరిలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జూన్‌లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల తేదీలతో ఒక గెజిట్‌ ను సైతం ప్రభుత్వం విడుదల చేసింది మార్చి రెండో వారం నుంచి నుంచి కరోనా సెకెండ్‌ వేవ్‌ కొనసాగడంతో నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ త్రిసభ్య కమిటీలను పొడిగించారు. అటు తరువాత గత జూలైలో ఎన్నికలు నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. సెప్టెంబరు. అక్టోబరులో నిర్వహిస్తామని పేర్కొంది. అప్పట్లోనే ఇందుకు సంబంధించిన అరులైన రైతులతో ఓటరు జాబితా తయారుచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇదే విషయమై వరుసగా సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని అప్పట్లోనే ఆదేశించారు. తరువాత ఎందుకో ఎన్నికల అంశం మరుగున పడిపోయింది.  ఇన్నాళ్లకు మరోసారి కదలిక వచ్చింది. ఈ సారైనా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అని రైతులు  అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి  జిల్లాలో 95 సొసైటీలు ఉండగా.... సుమారు 38 లక్షల మంది రైతులు ఓటర్లుగా ఉన్నారు. జిల్లాలను విభజించినా డీసీసీబీని మాత్రం విడగొట్టలేదు. 

 ద్వితీయ శ్రేణి నేతల ఎదురుచూపు

రాష్ట్రంలో దాదాపు అన్నిరకాల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక్క పీఏసీఎస్‌లు, సాగునీటి సంఘాల ఎన్నికలు మాత్రమే మిగిలిపోయాయి. పీఏసీఎస్‌లకు మాత్రం త్రిసభ్య కమిటీల రూపంలో అధికార పార్టీ నాయకులకే పదవులు కల్పించారు. సాగునీటి సంఘాలకు మాత్రం ప్రత్యేకాధికారులను నియమించారు. వీటి ఎన్నికల కోసం అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. మరో వైపు పాలక వర్గాలు లేక పోవడంతో వీటిపై రాజకీయ జోక్యం అధికమైంది. రుణాలు. విత్తనాలు. ఎరువులు అందించే సమయంలో వివక్షకు గురిచేస్తున్నారని.. పారదర్శకంగా వ్యవహరించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. 

 సిద్ధంగా ఉన్నాం

సహకార ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే తరువాయి. ఓటరు జాబితాతో పాటు ఎన్నికలకు అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టాం. ప్రస్తుతం పాలకవర్గాలు లేకున్నా.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పీఏసీఎస్‌ల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం. 

-వరప్రసాద్‌, డీసీసీబీ అధికారి, విజయనగరంRead more