-
-
Home » Andhra Pradesh » Vizianagaram » When is salvation for Autonagar-MRGS-AndhraPradesh
-
ఆటోనగర్‌కు మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2022-04-25T05:00:50+05:30 IST
సాలూరు..లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. విజయవాడ తరువాత పట్టణంలో అతిపెద్ద లారీ పరిశ్రమ విస్తరించి ఉంది. దాదాపు పది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ కొన్నాళ్లుగా లారీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లారీల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. డీజిల్ ధరలు పెరగడం, రహదారులు బాగాలేకపోవడం, గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది లారీ పరిశ్రమకు దూరమయ్యారు. అటు ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహమందించడం లేదు.

దశాబ్ద కాలం కిందట మంజూరు
ఇప్పటికీ సమకూరని వసతులు
ఆశగా ఎదురుచూస్తున్న లారీ యజమానులు, కార్మికులు
(సాలూరు)
సాలూరు..లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. విజయవాడ తరువాత పట్టణంలో అతిపెద్ద లారీ పరిశ్రమ విస్తరించి ఉంది. దాదాపు పది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ కొన్నాళ్లుగా లారీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లారీల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. డీజిల్ ధరలు పెరగడం, రహదారులు బాగాలేకపోవడం, గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది లారీ పరిశ్రమకు దూరమయ్యారు. అటు ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహమందించడం లేదు. లారీ పరిశ్రమకు చేయూతనందించాలన్న ఉద్దేశ్యంతో దశాబ్ద కాలం కిందట మంజూరు చేసిన ఆటో నగర్‌కు అతీగతీ లేకుండా పోయింది. పనులు పూర్తయిన లబ్ధిదారులకు షాపులు కేటాయించలేదు. పెండింగ్ పనులు పూర్తిచేయలేదు. మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో సాలూరు వాసుల ఆటోనగర్ కల తీరలేదు. సాలూరు పట్టణంలో 2 వేల వరకూ లారీలుండేవి. వస్తు రవాణాలో కీలక భూమిక సాలూరు లారీలవే. అటు ఒడిశా, ఇటు చత్తీస్‌గడ్‌లకు ఇక్కడి లారీలు సర్వీసులందించేవి. నిర్వహణ భారంతో ప్రస్తుతం 1,200 లారీల వరకూ ఉన్నాయి. సాలూరు పట్టణంలో లారీలతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుండడంతో సమస్య పరిష్కారానికి ‘ఆటోనగర్’ ఒకటి ఉండాలని యాజమాన్యాలు, కార్మికులు భావిస్తూ వచ్చారు. లారీల మరమ్మతులకు సంబంధించి వర్క్‌షాపులు, విడి పరికరాలు అందుబాటులోకి రావాలంటే ఆటోనగరే శరణ్యమని భావించారు.
108 షాపుల ఏర్పాటు
పట్టణానికి దూరంగా సర్వే నెంబర్ 475/10 లో రెండు ఎకరాల 52 సెంట్ల స్ధలంలో ఆటోనగర్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. 2011లో అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 14 విభాగాలకు సంబంధించి 108 షాపులు ఏర్పాటుచేశారు. మెకానిక్ షెడ్లు, వర్క్‌షాపులు, బాడీ బిల్డింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, బ్యాటరీ, కట్టలు పని, టైర్వర్క్స్, గ్యాస్ వెల్డింగ్, సీట్ వర్స్క్, గ్లాస్, హెడ్ వర్స్స్తో పాటు విడి పరికరాలు విక్రయించే వీలుగా షాపులను ఏర్పాటుచేశారు. ఆటోనగర్‌లో మౌలిక వసతులకు ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేశారు. అప్పటి ఎంపీ కిశోర్చంద్రదేవ్తో పాటు ఎమ్మెల్యే రాజన్నదొర రూ.6.50 లక్షల నిధులు విడుదల చేశారు. వాటితో రహదారుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే షాపుల కేటాయింపునకు సంబంధించి డ్రా పూర్తయ్యింది. లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. కానీ చాలావరకూ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని పూర్తిచేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. దీంతో లారీ యజమానులకు, కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
తరచూ ట్రాఫిక్ సమస్యలు
ప్రస్తుతం సాలూరు పట్టణ వ్యాప్తంగా లారీ పరిశ్రమ విస్తరించి ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్, బోసుబొమ్మ కూడలి, వెంకటేశ్వర డీలక్స్, గాంధీనగర్ ఇలా అన్నిచోట్ల లారీలకు సంబంధించి వర్క్‌షాపులు, విడి పరికరాల దుకాణాలు ఉన్నాయి. దీంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అంతర్ జిల్లా, రాష్ట్ర రహదారులు కావడంతో నిత్యం వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. ఈ సమయంలో ఎక్కడికక్కడే లారీలు నిలిపివేస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ఆటోనగర్‌కు షాపులు తరలిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. కానీ ఆటోనగర్‌లో మౌలిక వసతులు మెరుగుపడడం లేదు. కనీసం పూర్తిచేసే కనీస కార్యాచరణేదీ కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరముంది.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
ఆటోనగర్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి. మౌలిక వసతులు కల్పించాలి. చుట్టూ ప్రహరీ నిర్మించాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఆటోనగర్‌కు మోక్షం కల్పించాలి.
సిద్దాబత్తుల రామచంద్రరావు, సీపీఐ నాయకుడు
ఇబ్బందులను పరిష్కరించవచ్చును
తక్షణం ఆటోనగర్‌ను అందుబాటులోకి తేవాలి. ఎన్నో సమస్యలతో లారీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఆటోనగర్ ఏర్పాటుతో కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
- ఇండుపూరి నారాయణరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి, సాలూరు