ఎప్పుడిస్తారో?

ABN , First Publish Date - 2022-10-01T05:04:58+05:30 IST

జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వం అసలే అరకొర బ్యాగులు సరఫరా చేయగా, అందులో సగానికి పైగా డ్యామేజీవి ఉండడంతో విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బ్యాగే లేకుండా పోయింది.

ఎప్పుడిస్తారో?
చిరిగిన బ్యాగులను చూపుతున్న ఎల్‌.కోట మండలం కల్లేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు(ఫైల్‌)


ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్న స్కూల్‌ బ్యాగులు

వేలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ అందని వైనం

63వేలకు పైగా నాణ్యత లేనివిగా తేల్చిన హెచ్‌ఎంలు

ఇదీ విద్యా కానుక స్కూల్‌ బ్యాగుల దుస్థితి 


జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వం అసలే అరకొర బ్యాగులు సరఫరా చేయగా, అందులో సగానికి పైగా డ్యామేజీవి ఉండడంతో విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బ్యాగే లేకుండా పోయింది. మంచి బ్యాగులు ఇస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేం తీరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 63వేలకు పైగా బ్యాగులు నాణ్యత లేనివని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేల్చారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ మెంటాడ 

వేసవి సెలవుల అనంతరం జూలై 7న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో బ్యాగులు, షూ, బెల్టు అందిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 2,22,521 బ్యాగులు అదే స్థాయిలో షూల జతలు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టారు. విద్యాకానుక బ్యాగులు వస్తాయి కదా అని విద్యార్థులు సొంతంగా బ్యాగులు సమకూర్చుకోలేదు. వారు ఎదురుచూస్తుండగా కాస్త తక్కువగా బ్యాగులైతే వచ్చాయి. హమ్మాయ్యా అనుకునేంతలోపే వాటిలో లోపాలు బయటపడ్డాయి. చినిగిపోయినవి, జిప్పులు వదిలేసినవి, చిన్న సైజువి ఇచ్చారు. వాటన్నింటినీ నాణ్యత లేని బ్యాగులుగా గుర్తించి జిల్లా వ్యాప్తంగా మరో 63,400 బ్యాగులు కావాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ఎస్‌పీడీకి సమాచారం అందించారు. నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు జిల్లాకు చేరలేదు. అదిగో ఇదిగో అంటూ జిల్లా విద్యాశాఖ నెట్టుకు వస్తోంది. 

 మెంటాడ మండలంలో విద్యార్థుల సంఖ్య సుమారు 4000 కాగా 2,365 బ్యాగులు మాత్రమే ఇచ్చారు. దీంతో వీటి పంపిణీ విషయంలో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. బ్యాగులు అందనివారు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందని భావించి సర్దుబాటు చేశారు. సొంతబ్యాగులు ఉన్నవారికి మినహా పంపిణీ చేశారు. మిగతా వారికి రెండో విడతలో ఇస్తామని చెప్పారు. ఈ విధంగా 45 శాతం మందికి మాత్రమే పంపిణీ చేయగా అందులో 1474 బ్యాగులు(65శాతం) పూర్తిగా డ్యామేజీకి గురయ్యాయి. విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లిన బ్యాగులు నిమిషాల వ్యవధిలోనే జిప్పులు ఊడిపోగా, ఇంకొన్ని చినిగిపోయాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 

 ప్రభుత్వం ఏదోలా బ్యాగులు అందించి చేతులు దులుపుకోవాలని భావించింది. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో నాణ్యత లేని వాటి స్థానే మళ్లీ బ్యాగులు అదనంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ బ్యాగులు తిరిగి అందివ్వలేదు. నాణ్యత లేని బ్యాగులను అందించిన కాంట్రాక్టర్‌పై చర్యలు లేవు. పథకాల వెనుక, వాటి కొనుగోలు వెనుక ప్రజాప్రతినిధుల అండదండలున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. 

 జగనన్న బ్యాగులు పనికి రాక పోవడంతో కొంతమంది సొంతంగా సమకూర్చుకోగా, మిగతా వారు వారివద్ద ఉండే పాత బ్యాగులకు కుట్లు వేసి మళ్లీ వినియోగిస్తున్నారు. బ్యాగుల దుస్థితిపై హెచ్‌ఎంలు, ఎంఈవో నుంచి నివేదిక వెళ్లి నెలలు గడుస్తున్నా జిల్లా అధికారుల నుంచి స్పందన లేదు. ఈ నెల 6 వరకు విజయదశమి సెలవులు ఇచ్చారు. పాఠశాలల పునఃప్రారంభయ్యే నాటికైనా డ్యామేజీ బ్యాగుల స్థానంలో మంచివి సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. 


బ్యాగులు రానున్నాయి

 కొన్ని బ్యాగులు బాగా లేవని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సమాచారం వచ్చింది. వీటి స్థానే కొత్తవి అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఆయా హెచ్‌ఎంల లాగిన్‌ నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్ని బ్యాగులు బాగాలేవు? ఎన్ని కావాలి? అన్న సమాచారం వెళ్లింది. జిల్లాకు మళ్లీ 63వేలకు పైగా బ్యాగులు రానున్నాయి. వచ్చిన వెంటనే విద్యార్థులకు అందిస్తాం. 

                                - స్వామినాయుడు, సమగ్ర శిక్షా ఏపీసీ, విజయనగరం.



Updated Date - 2022-10-01T05:04:58+05:30 IST