ఇదేం పనితీరు?

ABN , First Publish Date - 2022-11-29T00:15:45+05:30 IST

పోలీస్‌లున్నారో లేదో తెలియడం లేదు. గంజాయి విపరీతంగా రవాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. స్టేషన్‌లో ఉన్న గంజాయితో వేరొకరిని ఇరికించేందుకు చేసే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్‌ సస్పెన్సెన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఓ వైద్యుడి ఇంట్లో చోరీకు గురైన రూ.7లక్షలు ఎవరు తీశారో గుర్తించినా చర్యలు లేవు. గ్రామాల్లోనూ దొంగతనాలు పెరిగాయి.

 ఇదేం పనితీరు?
ఎస్‌.కోట మండల పరిషత్‌ సమావేశంలో సామూహిక గృహా నిర్మాణాలకు సహకరించాలని కోరుతున్న అధికారి శ్రీనివాసన్‌

గంజాయి తరలిపోతున్నా పోలీస్‌లు పట్టించుకోలేదన్న ఎమ్మెల్సీ

గ్రామ సచివాలయ సిబ్బంది సరిగా పనిచేయడం లేదన్న ఎమ్మెల్యే

ఎస్‌.కోట మండల పరిషత్‌ సమావేశంలో ధ్వజమెత్తిన ప్రజాప్రతినిధులు

శృంగవరపుకోట, నవంబరు 28:

పోలీస్‌లున్నారో లేదో తెలియడం లేదు. గంజాయి విపరీతంగా రవాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. స్టేషన్‌లో ఉన్న గంజాయితో వేరొకరిని ఇరికించేందుకు చేసే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్‌ సస్పెన్సెన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఓ వైద్యుడి ఇంట్లో చోరీకు గురైన రూ.7లక్షలు ఎవరు తీశారో గుర్తించినా చర్యలు లేవు. గ్రామాల్లోనూ దొంగతనాలు పెరిగాయి. ఫిర్యాదులు పరిష్కారం కాక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. వారికీ కనీస మర్యాద ఇవ్వడం లేదు. ట్రాఫిక్‌ సమస్యను పట్టించుకోవడం లేదు. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి పోలీసింగ్‌ను ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ఏడాది 475 మంది విద్యార్థులు ప్రైవేటుకు తరలిపోయారు. ప్రవర్తన సరిగా లేదని ధర్మవరం స్కూల్‌లో టీసీలు ఇచ్చి ఇద్దరు విద్యార్థులను బయటకు పంపించేశారు.

- ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

గ్రామ సచివాలయ సిబ్బంది సరిగా పని చేయడం లేదు. వీఆర్వో అందుబాటులో వుండేలా చూడాలని శాసన మండలి సభ్యుడు రఘురాజు మండల పరిషత్‌ సమావేశంలో కోరడం చూస్తూంటే వీరి పనితీరెలా వుందో తెలుస్తోంది. మండల పరిషత్‌ సమావేశానికి అధికారులు అలస్యంగా వస్తున్నారు. కొన్ని శాఖలకు చెందిన అధికారులు పూర్తిగా రావడం లేదు. ధాన్యం కొనుగోలులో జిల్లాలోని మిల్లర్లతో ఎప్పుడు ఇబ్బందే. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటి కుళాయిల నిర్మాణానికి రెండో ఫేజ్‌లో నియోజకవర్గంలో రూ.216కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఒక్క ఎస్‌.కోట మండలానికే రూ.112 కోట్లు కేటాయించారు.

- ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

ఇలా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాత్రమే కాదు ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. సమాధానం చెప్పలేక అధికారులు బిక్కమొహం వేశారు. శృంగవరపుకోట మండల ప్రజా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం ఆసాంతం సోమవారం గరంగరంగా సాగింది. మండల అధ్యక్షుడు ఎస్‌.సోమేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై తొలుత ప్రశ్నించారు. పాఠశాలలను ఎందుకు తనిఖీ చేయడం లేదంటూ ఎంపీడీవో శేషుబాబును, తహసీల్దార్‌ శ్రీనివాసరావులను ప్రశ్నిం చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను సభకు ఎందుకు సమర్పించడం లేదని ఐసీడీఎస్‌ పీవోను నిలదీఽశారు. రీసర్వే పేరుతో గ్రామ రెవెన్యూ అధికారులు తప్పించుకు తిరుగుతుండడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సమయంలో దళారులను అధికారులే ప్రోత్సహిస్తున్నారని సభలో ప్రస్తావించారు. ఈ విధంగా పలు శాఖల పనితీరును సమావేశంలో నేతలు ఎండగట్టారు. మారాలని హితువు పలికారు.

Updated Date - 2022-11-29T00:15:46+05:30 IST