ఏ కష్టమొచ్చిందో!

ABN , First Publish Date - 2022-02-17T04:44:03+05:30 IST

ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. వసతిగృహం (ఎస్‌ఎంపురం కొండపై)లోని తన గదిలో చున్నీతో ఫ్యానకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ఏ కష్టమొచ్చిందో!
కొండపల్లి మనీషా అంజు (ఫైల్‌)

 ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

 మృతురాలిది విజయనగరం జిల్లా 

శ్రీకాకుళం జిల్లాలో ఘటన

ఎచ్చెర్ల(శ్రీకాకుళం)/నెల్లిమర్ల, ఫిబ్రవరి 16: ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. వసతిగృహం (ఎస్‌ఎంపురం కొండపై)లోని తన గదిలో చున్నీతో ఫ్యానకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల దేవాంగుల వీధికి చెందిన మనీషా ఈ ఏడాదే శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో చేరింది. సంక్రాంతి సెలవులకు ముందు క్యాంపస్‌లో నిర్వహించిన ఓరియంటేషన్‌ తరగతులకు హాజరైంది. మళ్లీ ఈ నెల 14న ఆఫ్‌లైన తరగతులకు వచ్చింది. ఇంటి నుంచి తండ్రి సూరిబాబుతో కలిసి క్యాంపస్‌కు వస్తున్న క్రమంలో మనీషా సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. మరుసటి రోజు తండ్రి మరో సెల్‌ఫోన్‌ను కుమార్తెకు ఇచ్చాడు.  బుధవారం ఆమె తరగతులకు హాజరుకావలసి ఉంది. అయితే, తర్వాత తరగతులకు వస్తానని తన స్నేహితురాలు అక్షితకు చెప్పింది. కానీ, ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో అక్షిత వెళ్లి చూడగా.. తలుపులకు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలనాధికారి మోహన్‌కృష్ణ చౌదరి ఆ గది తలుపులను తెరిపించారు. ఫ్యాన్‌కు వేలాడు తున్న మనీషాను కిందకు దించి హుటాహుటిన శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. ట్రిపుల్‌ ఐటీ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కరుణకుమారి, సూరిబాబులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సూరిబాబు విజయనగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. మనీషా అన్నయ్య విజయనగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు. వసతిగృహాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది. తోటి విద్యార్థినులతో మాట్లాడి పోలీసులు వివరాలు సేకరించారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

నెల్లిమర్లలో విషాదం

నెల్లిమర్ల దేవాంగుల వీధికి చెందిన విద్యార్థిని మనీషా అంజు(16) శ్రీకాకుళం ఎచ్చెర్ల ట్రిపుల్‌ఐటీలో ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఆమె స్నేహితులు, బంధువులు ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం ఆమె ఇంటికి చేరుకుని విలపించారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే బాలిక ఈ విధంగా చేయడంతో అందరూ నిర్ఘాంతపోతున్నారు. మనీషా పదో తరగతిలో మంచి మార్కులు సాధించి నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో సీటు సాధించింది. దగ్గరగా ఉంటుందని ఆమెను శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో చేర్చారు. మనీషా తండ్రి వస్త్రదుకాణంలో పనిచేస్తుండగా తల్లి మిమ్స్‌ ఆసుపత్రిలో పనిచేస్తోంది. కుమార్తె అకాల మరణంతో వారి రోదనకు అంతేలేకుండా ఉంది. 


Read more