స్నేహపూర్వకంగా మెలగండి

ABN , First Publish Date - 2022-02-19T05:32:59+05:30 IST

వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు మంత్రి బొత్స సూచించారు.

స్నేహపూర్వకంగా మెలగండి
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి బొత్స, పాల్గొన్న ప్రముఖులు

   పోలీసులకు మంత్రి బొత్స హితవు

 బొబ్బిలిలో పోలీసు స్టేషన్‌ భవనం ప్రారంభం 

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 18: 

వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు మంత్రి బొత్స సూచించారు. 

బొబ్బిలిలో రూ.1.40 కోట్లతో నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌ భవనం కార్పొరేట్‌ స్థాయిలో ఉందని ప్రశంసించారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో ఈ తరహా పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని అన్నారు. ఎర్రజెండాలు, పచ్చజెండాల వారు విమర్శలు చేస్తుండడాన్ని ఎమ్మెల్యే తప్పు పడుతున్నారని, పనులు చేసేవారికి అలాంటివి సహజమని అన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చిన జూట్‌మిల్లు యాజమాన్యంపై తక్షణం కేసులు నమోదు చేయాలని ఎస్పీ దీపికా పాటిల్‌ను ఆదేశించారు. పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతోనే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతోందన్నారు. జాబ్‌చార్టుకు భిన్నంగా సచివాలయ సిబ్బంది పనిచేస్తే ప్రజలు సీఎం జగన్‌ను ఆడిపోసుకుంటారనే విషయాన్ని గుర్తించాలన్నారు. అధికారం వచ్చినందున అందరికీ మంచి చేస్తున్నామని... అలా చేయకుంటే ప్రజలు ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తారని  వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎస్పీ దీపికా పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌,  ఐటీడీఏ పీఓ కూర్మనాథ్‌, డీఎస్పీ బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-02-19T05:32:59+05:30 IST