Tiger Kalakalam: విజయనగరం జిల్లాలో పెద్దపులి కలకలం..

ABN , First Publish Date - 2022-09-01T18:12:44+05:30 IST

విజయనగరం జిల్లాలో పెద్దపులి చెలరేగిపోతోంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట మూగ జీవాలపై దాడులు చేస్తోంది.

Tiger Kalakalam: విజయనగరం జిల్లాలో పెద్దపులి కలకలం..

విజయనగరం (Vizainagaram): జిల్లాలో పెద్దపులి (Tiger) చెలరేగిపోతోంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట మూగ జీవాలపై దాడులు చేస్తోంది. పెద్దపులి కలకలంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బొండపల్లి మండలం, కొత్తపనసలపాడులో పశువులశాలలో చొరబడింది. ఆవుపై దాడి చేసి చంపేసింది. రెండు రోజుల క్రితం దత్తిరాజేరు మండలం, ఎస్ చింతలవలసలోని ఓ రైతు పశువుల శాలలో చొరబడిన పులి ఆవుపై దాడి చేసింది. అయితే జిల్లాలో తిరుగుతున్నది బెంగాల్ టైగరేనని అటవీశాఖ అధికారులు ఇప్పటికే ఫోటోలు కూడా విడుదల చేశారు. సీసీ కెమెరాలద్వారా పెద్దపులి కదలికలను గుర్తించారు. మెంటాడ, గజపతినగరం, శృంగవరపుకోట, కొత్త వలస, వేపాడు, ఎల్‌కోట, బాడంగి, తెర్లాం, వంగర మండలాల్లోని కొండ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. రోజుకొక మూగజీవిపై పెద్దపులి దాడి చేస్తోంది. పులి సుమారు 2వందల కేజీల బరువు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


విజయనగరం జిల్లాలో పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. వంగర, తెర్లాం  మండలాల్లో పులి కదలికలను గుర్తించిన జిల్లా ఫారెస్టురేంజ్‌ అధికారి ఆర్‌.రాజా బాబు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు నిర్జన ప్రదేశాలకు వెళ్లరాదని, రాత్రిపూట ఇంటిలోనే ఉండాలని  సూచించారు. పులి కదలికలు కనిపిస్తే తమకు తెలియజేయాలన్నారు. అలాగే,  ఫారెస్టు రేంజ్‌ బీట్‌ ఆఫీసర్‌ స్వప్న, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ రిషికుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌, పశువైద్యాధికారి జె.నరేంద్రకుమార్‌లు  తెర్లాం మండలం గొలుగువలసకు వెళ్లి పులి కాలి ముద్రలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. పులి మళ్లీ ఈ పొలిమేరలో తిరిగే అవకాశం ఉందని,  రాత్రి సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.   

Read more