పీహెచ్‌సీలకు లేనట్లేనా?

ABN , First Publish Date - 2022-09-08T05:35:14+05:30 IST

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇక ఆరోగ్య మిత్రలు లేనట్లేనని ప్రభుత్వం తేల్చింది. వీరిని ఇక సామాజిక ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.

పీహెచ్‌సీలకు లేనట్లేనా?
చినమేరంగి సీహెచ్‌సీ

  సీహెచ్‌సీలకు ఆరోగ్య మిత్రల బదిలీ
   పేరు మార్చుతూ సర్కారు ఆదేశాలు
  ఆ బాధ్యతల్లోకి సచివాలయ ఏఎన్‌ఎంలు

( జియ్యమ్మవలస )


జిల్లాలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  ఇక  ఆరోగ్య మిత్రలు లేనట్లేనని ప్రభుత్వం తేల్చింది. వీరిని ఇక సామాజిక ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి ఉత్తర్వులందడం, వారు విధుల్లో చేరడం చకచకా జరిగిపోయాయి. ఇకనుంచి వీరిని నెట్‌వర్క్‌ మిత్రలుగా నామకరణం చేసి విధులకు సంబంధించిన విధి విధానాలు అందజేశారు. జిల్లాలో పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలో మొత్తం 452 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  319 సచివాలయాలు ఉన్నాయి. వాటిల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు ఇప్పుడు ఆరోగ్య మిత్రలుగా విధులు నిర్వర్తించనున్నారు.  వారి పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే  సీహెచ్‌సీల్లో ఉన్న నెట్‌వర్క్‌ మిత్రలు వద్దకు రిఫర్‌ చేయాల్సి ఉంటుంది.
గతంలో సేవలు ఇలా..
జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే ఆరోగ్య మిత్రలు వారి పరిధిలో ఉన్న గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిని మెరుగైన వైద్య సేవలు అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసేవారు. వారికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేవారు. కొన్నిసార్లు జిల్లా అధికారుల సమన్వయంతో ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో సైతం ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి ప్రజలకు తగు సేవలందించేవారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న వారు ఇంటికి వచ్చిన తరువాత వారిపై నిరంతర పర్యవేక్షణ చేసేవారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు తెలిపి అవసరమైన వైద్య సేవలు అందేలా చూసేవారు. కానీ ఇప్పుడు ఆసుపత్రికే పరిమితమయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు అందజేసింది. ఇకనుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వారిని కేటాయించింది.  పీహెచ్‌సీల నుంచి వచ్చిన రిఫరల్‌ కేసులకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందేలా చర్యలు తీసుకుంటారని స్పష్టమైన ఆదేశాలు అందించింది.
బదిలీలు ఇలా...
పీహెచ్‌సీల్లో వైద్య మిత్రలుగా పనిచేసిన వారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందిని నియమించారు.  జిల్లా కేంద్ర ఆసుపత్రికి బలిజిపేట, కొమరాడ, రావివలస, సీతానగరం, కేఆర్‌బీ పురం, పెదబొండపల్లి, బందలుప్పి, డోకిశీల పీహెచ్‌సీల్లో ఉన్న ఆరోగ్య మిత్రలను నియమించారు. సాలూరు ఏరియా ఆసుపత్రికి తోణాం, పాచిపెంట, గురివినాయుడుపేట, బాగువలస పీహెచ్‌సీల్లో ఉన్నవారితో పాటు అర్బన్‌ పీహెచ్‌సీ సాలూరు వైద్య మిత్రను నియమించారు. చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పెదంకలాం పీహెచ్‌సీల నుంచి ఆరోగ్య మిత్రలను,  కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తాడికొండ, రావాడ రామభద్రపురం, రేగిడి పీహెచ్‌సీల నుంచి ,  భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మొండెంఖల్‌ పీహెచ్‌సీలో ఉన్న ఆరోగ్య మిత్రలను నియమించారు. మక్కువ పీహెచ్‌సీలో ఉన్న ఆరోగ్య మిత్రను ఫిలడెల్ఫియా లెప్రసీ ఆసుపత్రికి, శంబర, జగన్నాథపురం పీహెచ్‌సీల్లో ఉన్న ఆరోగ్య మిత్రలను శ్రీసౌజన్య ఆసుపత్రికి బదిలీ చేశాఉ.  ఇలా జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల్లో పనిచేసిన ఆరోగ్య మిత్రలను సమీప సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రి, ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించేలా చేశారు. అయితే ఇంకా వీరికి సంబంధించిన జాబ్‌చార్ట్‌ మాత్రం ప్రభుత్వం ఇవ్వకపోవడం గమనార్హం.

ప్రస్తుతం సిఫ్ట్‌ చేశాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఆరోగ్య మిత్రలను ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నియమించాం. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆరోగ్య మిత్రల సేవలు వినియోగించుకుంటాం.
 - యు.అప్పలరాజు, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌

 

Read more