నేడు సిరిమాను పండగ

ABN , First Publish Date - 2022-10-11T06:05:57+05:30 IST

భక్త కోటి ఎదురుచూస్తున్న పైడితల్లమ్మ సిరిమానోత్సవ సమయం వచ్చేసింది. కొద్ది గంటల్లో అపూర్వ సంబరం ఆవిష్కరణ కానుంది. వేయికన్నులతో ఎదురుచూస్తున్న భక్తుల చెంతకే అమ్మవారు రానున్నారు. ఈ సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేడు సిరిమాను పండగ
పూజలందుకుంటున్న అమ్మవారు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న అశోక్‌గజపతిరాజు దంపతులు


 3 గంటలకు ఊరేగింపు ప్రారంభం
పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి బొత్స
విజయనగరం రూరల్‌, అక్టోబరు 10:
  భక్త కోటి ఎదురుచూస్తున్న పైడితల్లమ్మ సిరిమానోత్సవ సమయం వచ్చేసింది. కొద్ది గంటల్లో అపూర్వ సంబరం ఆవిష్కరణ కానుంది. వేయికన్నులతో ఎదురుచూస్తున్న భక్తుల చెంతకే అమ్మవారు రానున్నారు. ఈ సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ఆరంభం కానుంది. రెండు గంటల పాటు అమ్మవారు తిరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. సిరిమాను పరివారంగా భావించే పాలధార, అంజలి రథం, బెస్తావారి వల తదితర వాటికి ఒక్కో అధికారిని, పోలీసులను ఇన్‌చార్జులుగా నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలు అయ్యేసరికి సిరిమానోత్సవం ప్రారంభం అయ్యేలా చూడాలని భావిస్తున్నారు. సిరిమాను హుకుంపేట నుంచి చదురుగుడి వద్దకు చేరుకునేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యే అవకాశం వుంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు నిర్ణయించారు. హుకుంపేటలో ఉదయం 11 గంటలకు బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటూ ఇటూ అయినా 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు మూడులాంతర్ల వద్దకు చేరుకుంటే.. గంట సమయంలో అక్కడ మిగతా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనుకున్న సమాయానికి సిరిమాను ఊరేగింపు ప్రారంభం కానుంది. తొలుత హుకుంపేట, ఉల్లివీధి, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడికి సిరిమాను చేరుకుంటుంది. ఆ తర్వాతే అసలు సంబరం మొదలవుతుంది.


పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి బొత్స
రాష్ట్ర ప్రభుత్వం తరుపున పైడిమాంబకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ తదితరులు కూడా పైడిమాంబను మంగళవారం దర్శించుకోనున్నారు.


కోట బురుజుపై నుంచి అశోక్‌
సాంప్రదాయం ప్రకారం సిరిమానోత్సవాన్ని కోట బురుజుపై నుంచి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు వీక్షించనున్నారు. కోట వద్ద వున్న డీసీసీబీ కార్యాలయం ఎదుట నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు తిలకిస్తారు.   

అసౌకర్యం కలగకుండా చూడాలి: ఎస్పీ
విజయనగరం క్రైమ్‌ : భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకూడదని ఎస్పీ దీపికా పాటిల్‌ ఆదేశించారు. కోట జంక్షన్‌, మూడులాంతర్లు, అమ్మవారి దేవాలయ ప్రాంగణం, గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాలను  సోమవారం ఆమె సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. దేవాలయ ప్రాంగణం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను, సీసీ కెమెరాలతో అనుసంధానం చేసిన టీడీ స్ర్కీన్‌ను పరిశీలించారు. ఆమె వెంట ఏఎస్పీ శ్రీదేవీరావు, సత్యనారాయణరావు, డీఎస్‌పీలు త్రినాథ్‌, మోహనరావు, బి.మోహనరావు, సుభాష్‌, ఆర్‌.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, మహేష్‌, ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

వైభవంగా తొలేళ్లు.. భారీగా భక్తుల రాక

విజయనగరం రూరల్‌, అక్టోబరు 10: పూసపాటి వంశీయుల ఆడపడుచు.. సిరుల తల్లి పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం వైభవంగా సాగింది. పైడిమాంబ నామస్మరణతో విజయనగరం పులకించి పోయింది. చదురుగుడికి నలుచెరగులా భక్తులతో పోటెత్తింది. ఘటాలతో అమ్మను ధ్యానించుకుంటూ వందలాది మంది మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం రాత్రి 10.30 తరువాత తొలేళ్ల ఉత్సవానికి పైడిమాంబను సిద్ధం చేశారు. రాత్రి 11.30 గంటల తరువాత దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. అప్పటికీ వర్షం పడుతున్నా భక్తులు క్యూలోనే ఉండి పైడిమాంబను దర్శించుకున్నారు. ఇక సోమవారం ఉదయం 6 గంటల నుంచీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలో నిరీక్షించారు. దేవదాయశాఖాధికారులు భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని 300 కోసం కేటాయించిన క్యూలో సాధారణ భక్తులను కొద్ది సేపు వదిలారు. దీంతో రద్దీ తగ్గింది. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ భక్తుల సంఖ్య తగ్గలేదు. రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో సాధారణ భక్తులు విపరీతంగా పెరిగారు. మూడు లక్షల వరకూ భక్తులు వస్తారని దేవదాయశాఖ అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినా అంతకంటే ఎక్కువ మంది పండగకు తరలివచ్చారు.
ఫ రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు, ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రాంతాల నుంచి సోమవారం మధ్యాహ్నానానికే భక్తులు నగరానికి చేరుకున్నారు. రాత్రి కోట నుంచి మూడు లాంతర్లు, మూడు లాంతర్లు నుంచి గంటస్తంభం, అదే విధంగా గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరీ ఆలయం, మయూరి కూడలి నుంచి వైఎస్సార్‌ కూడలి రైల్వే స్టేషన్‌ రోడ్డు భక్తులతో కిటకిటలాడాయి. వనంగుడిలో కూడా వేల సంఖ్యలో భక్తులు సోమవారం పైడిమాంబను దర్శించుకున్నారు.


పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు
పైడిమాంబ తొలేళ్ల ఉత్సవం రోజున పూసపాటి వంశీయులు పైడిమాంబను దర్శించుకోవడం, పట్టువస్త్రాలతో పాటు సుగంధ ద్రవ్యాలు, సారే  సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అశోక్‌గజపతిరాజు, ఆయన సతీమణి సునీలా గజపతిరాజులు పైడిమాంబను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తొలేళ్ల రోజు వర్షం పడడం శుభ సూచకమన్నారు. పైడిమాంబ ఆశీస్సులు జిల్లా ప్రజలు, ఆమె భక్తులపై మెండుగా ఉండాలని అకాంక్షించారు. పైడిమాంబ ఆలయ విస్తరణ, అదే విధంగా ప్రతిపాదిత మరికొన్ని పనులు జాప్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


అలరించిన పులివేషాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి): అమ్మవారి తొలేళ్ల ఉత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన పులివేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  కోట వద్ద నిర్వహించిన పులివేషాల పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయి. కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రతిభను చాటారు. ఈ ప్రదర్శనను వందలాది మంది ఆసక్తిగా తిలకించారు. నాలుగు జట్లను ఫైనల్‌కు ఎంపిక చేశారు. మంగళవారం తిరిగి ఈ నాలుగు జట్ల మధ్య పోటీ నిర్వహిస్తారు.



Updated Date - 2022-10-11T06:05:57+05:30 IST