విశాఖ భూములు కోసమే మూడు ముక్కలాట

ABN , First Publish Date - 2022-10-13T05:12:05+05:30 IST

అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు చాలవని.. అంతకంటే ఎక్కువే కావాలని చెప్పిన జగన్‌, వైసీపీ నేతలు తర్వాత మాట మార్చారని, విశాఖలో భూముల కోసమే మూడు ముక్కలాటకు దిగారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు.

విశాఖ భూములు కోసమే మూడు ముక్కలాట
అశోక్‌గజపతిరాజుకు అభివాదం చేస్తున్న చిన్ని కుమారిలక్ష్మీ


అమరావతి రైతులకు అండగా ఉంటాం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున
విజయనగరం (ఆంధ్రజ్యోతి) అక్టోబరు 12 :
అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు చాలవని.. అంతకంటే ఎక్కువే కావాలని చెప్పిన జగన్‌, వైసీపీ నేతలు తర్వాత మాట మార్చారని, విశాఖలో భూముల కోసమే మూడు ముక్కలాటకు దిగారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు.  అమరావతి రైతులకు ఉత్తరాంధ్ర ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాట తప్పను..మడమ తిప్పనన్న సీఎం జగన్‌ ఇప్పుడు నాలుక మడత పెడుతున్నారని విమర్శించారు. న్యాయం కోసం అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, వారికి తాము అండగా ఉండి అరసవెళ్లిలో స్వామి దర్శనం చేయిస్తామని చెప్పారు.  అమరావతిని ఓ కులానికి ఆపాదించటం మంచిది కాదన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో భూములను కొట్టేయడానికే సీఎం మూడు ముక్కలాట అడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం లేదని, అభివృద్ధి చెయ్యక పోగా.. ప్రాంతాల మధ్యవిద్వేశాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గతుకులు రోడ్డును పూడ్చలేని సీఎం, మూడు రాజధానులను కడతామనడం హాస్యాస్పదమని అన్నారు. విశాఖలోని రుషికొండకు బోడిగుండు చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ మాట్లాడుతూ కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా వైసీపీ నేతలకు బుద్ధిరాక పోవడం శోచనీయమన్నారు. మాజీ మంత్రి కోండ్రు మురళీ మాట్లాడుతూ సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు నీరు తేలేకపోయారని, జగన్మోహన్‌ రెడ్డి ఈ ప్రాంతానికి ఏమి చేశారు ఇక్కడి మంత్రులు చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని దగ్గరుండి వారిని నడిపిస్తామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కేఏ నాయుడు, బొబ్బిలి చిరంజీవులు,  టీడీపీ నేతలు ఐవీపీ రాజు,  కరణం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ కార్యాలయానికి చిన్ని కుమారిలక్ష్మీ
తెలుగుదేశం బలపరిచిన ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్నికుమారి లక్ష్మీ బుధవారం విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. కేంద్ర మాజీ మంతి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, టీడీపీ జిల్లా  అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఓట్ల చేర్పులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పెద్దల ఆశీస్సులతో పెద్దల సభకు వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.  


Read more