ఈ భూమి నాదే.. అడ్డొస్తే అంతే!

ABN , First Publish Date - 2022-11-17T00:19:57+05:30 IST

మూడు దశబ్దాలుగా శృంగవరపుకోటలో నడుస్తున్న ఓ శిక్షణ సంస్థకు ఆనుకుని ఉన్న భూమిని తాము కొనుగోలు చేశామంటూ ఇటీవల కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షమై భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. ఇంకో వర్గం వారు వచ్చి చెట్లను తొలగించారు.

ఈ భూమి నాదే.. అడ్డొస్తే అంతే!
శృంగవరపుకోటలో వివాదానికి కారణమైన భూమి (ఫైల్‌)

పల్లెలకూ పాకిన విష సంస్కృతి

ప్రత్యర్థులపై అక్రమ కేసులు

ఎలాగోలా లొంగదీసుకునే యత్నం

వెనకుండి సహకరిస్తున్న నేతలు

శృంగవరపుకోట, నవంబరు 16:

- మూడు దశబ్దాలుగా శృంగవరపుకోటలో నడుస్తున్న ఓ శిక్షణ సంస్థకు ఆనుకుని ఉన్న భూమిని తాము కొనుగోలు చేశామంటూ ఇటీవల కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షమై భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. ఇంకో వర్గం వారు వచ్చి చెట్లను తొలగించారు. భూమి తమదంటే తమది అని ఇరువర్గాలూ పోటాపోటీగా హడావిడి చేశాయి. రెండు రోజుల పాటు భారీ సంఖ్యలో వ్యక్తిగత బలగాలను మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అంతలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి శాంతించి ఆ నేత నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

- లక్కవరపుకోట, వేపాడ మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చాలారోజులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. స్నేహంగా ఉంటూ భూములను కొనడం, అమ్మడం చేశారు. అయితే ఇద్దరి మధ్య ఎక్కడో తేడా వచ్చింది. ఓ భూమి విషయమై గొడవ పడ్డారు. అది తీవ్ర స్థాయికి చేరాక కేసుల్లో ఇరికించుకొనేందుకూ వెనకాడలేదు. దొంగచాటుగా స్నేహితుని ఇంట్లో గంజాయి దాచిపెట్టి పోలీసులకు ఫోన్‌ చేయించాడు. కేసులో ఇరికించాడు.

మూడు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూ వివాదాల వల్ల భౌతిక దాడులు పెరిగాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అచ్చంగా జిల్లాలో ఇదే జరుగుతోంది. భూముల చుట్టూ గొడవలు ముసురుకుంటున్నాయి. దాడులతో పాటు తనకు అడ్డంగా వుంటున్న వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ గతంలో నగరాలు, పట్టాణాల్లో ఎక్కువగా కనిపించేవి. ఈ విష సంస్కృతి పల్లెలకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ మహానగరం జిల్లాలో ఒకవైపు కొత్తవలస వరకు, మరోవైపు భోగాపురం వరకు విస్తరించింది. దీంతో భూములకు భూమ్‌ వచ్చింది. కోట్లకు పడగలెత్తిన వ్యక్తులు లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట, జామి, డెంకాడ, విజయనగరం, పూసపాటిరేగ వంటి మండలాల్లోని భూములపై దృష్టి సారించారు. దీంతో వందల రూపాయల్లో ఉన్న గజం స్థలం వేలు, లక్షలకు చేరింది. భూమి బంగారమైంది. రోడ్లకు ఆనుకుని ఉన్న భూముల వైపు సామాన్యులెవరూ చూడలేకపోతున్నారు. ఎకరా భూమి రూ.పది కోట్ల వరకు పలుకుతోంది. దీంతో భూ మాఫియా రంగప్రవేశం చేస్తోంది. స్థానికంగా వున్న కొంతమంది వివాదాస్పద వ్యక్తులను చేరదీసి పెంచి పోషిస్తోంది. వారి సహకారంతో రెవెన్యూలో వున్న లోసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.

వారిదే రాజ్యం

దశాబ్దాల కాలంగా భూమిపై ఒకరుంటే రికార్డుల్లో మరొకరి పేరుంటుంది. రికార్డుల్లో పేరున్న వారసులు భూమి మీదకు వచ్చే ధైర్యం లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా రాజకీయ, ఆర్థిక, అంగబలం వున్న వారికి అమ్మేస్తున్నారు. వారిని ఎదిరించలేక భూములను వదలుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులను చూసి అంగబలం వున్న వ్యక్తులు భూముల్లోకి చొరబడుతున్నారు. నయానో, భయానో భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన చిన్నపాటి లొసుగులను అడ్డం పెట్టుకుని ఇతరుల భూములను తమ వాటిలో కలిపేసే కుతంత్రాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భూ వివాదాలు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. భూ వివాద కేసుల పరిష్కారం మీదున్న ఆసక్తి మిగిలిన వాటిల్లో వుండడం లేదు. ఈ కేసులనే ఎక్కువగా స్వీకరిస్తున్నారన్న అపవాదు ఉంది.

నేతలదీ అదే దారి

వైసీపీ అధికారం చేపట్టిన తరువాత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో శాసనసభ్యుల నుంచి గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల వరకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో రోడ్లు, కాలువలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వంటి కాంట్రాక్టులు చేసేవారు. వీటినే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునేవారు. ఈ ప్రభుత్వంలో ఇలాంటి పనులేవీ జరగకపోవడంతో గ్రామంలోని వార్డు సభ్యుడి నుంచి శాసన సభ్యుల వరకు భూముల వ్యాపారంపై పడ్డారు.

గొడవలిలా..

నేతలంతా పోలీస్‌ వ్యవస్థను గుప్పిట్లో వుంచుకుంటున్నారు. పోలీస్‌ అధికారుల సహకారంతో సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. రికార్డుల్లో వున్న లోసుగులను బయటకు తీయడం.. భూ వివాదాలను సృష్టించడం.. ఇరు వర్గాలను తమ వద్దకు రప్పించుకోవడం.. తగువు తీర్చేందుకు వాటాలు అడగడం.. సాధారణంగా మారిపోయింది. అంగీకరించకపోతే సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. భౌతిక దాడులకు ఉసుగొలుపుతున్నారు. దీంతో గత్యంతరం లేనిపరిస్థితిలో వారడిగినంత వాటాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సహంచలేని కొంతమంది భూ యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2022-11-17T00:19:59+05:30 IST