ఉంటాయో.. ఊడుతాయో!

ABN , First Publish Date - 2022-11-25T00:16:12+05:30 IST

దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? క్షేత్రస్థాయిలో ధ్రువపత్రాల పరిశీలన అందులో భాగమేనా? వైకల్యం ప్రమాణికంగా చేసుకొని అనర్హత వేటు వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.క్షేత్రస్థాయిలో సచివాలయ కార్యదర్శులు, సహాయకులు, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి హడావుడిగా లబ్ధిదారుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అనర్హత వేటు వేసి ఎక్కడ తమకు పింఛను నుంచి దూరం చేస్తారేమోనన్న బెంగ వారిని వెంటాడుతోంది.

ఉంటాయో.. ఊడుతాయో!

దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం

క్షేత్రస్థాయిలో ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న వైనం

ఆందోళనలో లబ్ధిదారులు

(కొమరాడ)

దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? క్షేత్రస్థాయిలో ధ్రువపత్రాల పరిశీలన అందులో భాగమేనా? వైకల్యం ప్రమాణికంగా చేసుకొని అనర్హత వేటు వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.క్షేత్రస్థాయిలో సచివాలయ కార్యదర్శులు, సహాయకులు, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి హడావుడిగా లబ్ధిదారుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అనర్హత వేటు వేసి ఎక్కడ తమకు పింఛను నుంచి దూరం చేస్తారేమోనన్న బెంగ వారిని వెంటాడుతోంది.

ఇదీ పరిస్థితి

జిల్లా వ్యాప్తంగా 15,015 దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలనెలా రూ.3 వేలు పింఛన్‌ మొత్తం అందుతోంది. పేద లబ్ధిదారులకు ఈమొత్తం కొండంత అండగా నిలుస్తోంది. అయితే చాలామందికి అర్హత ఉన్నా వైకల్యం ప్రమాణికంగా చేసుకొని పింఛన్‌ మంజూరుకాలేదు. గతంలో వచ్చిన వారికి సైతం వివిధ కారణాలతో నిలిపివేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మరోసారి వడబోతకేనన్న ప్రచారం సాగుతోంది. సదరం సర్టిఫికెట్‌లో వైకల్య శాతం ఎంత? దరఖాస్తులో ఎంత రాశారు? ఏమైనా వ్యత్యాసం ఉందా? నకిలీ పత్రాలు సమర్పించారా? స్థానికంగా నివాసముంటున్నారా? వంటివి ఆరాతీస్తున్నారు. దీంతో ఎక్కడ తమ పింఛను నిలిపవేస్తారో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు నెలలో పింఛను వస్తుందో రాదోనని చాలా మంది భయపడుతున్నారు.

పర్యవేక్షణ కరువు

కొన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్లి పరిశీలన చేస్తున్నారు. మరికొందరు. మాత్రం గ్రామ సచివాలయాలకు రప్పించుకుంటున్నారు. దీంతో నడవలేని, కూర్చోలేని దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే ఎలా సాగుతుంది? అన్నది పరిశీలన చేయాల్సిన ఎంపీడీవోలు, కమిషనర్లు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో జారీ చేసిన సదరం పత్రాలు కొంతమంది దగ్గర లేవు. సర్వే సమయంలో కచ్చితంగా చూపించాలని వలంటీర్లు చెబుతున్నారు. ధ్రువపత్రాలు అందించకపోయినా, వ్యత్యాసాలు ఉన్నా కొన్నేళ్లుగా వస్తున్న పింఛన్‌ సొమ్ము నిలిచిపోతుందేమోనని కొంతమంది దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నాం. పారదర్శకంగా పరిశీలించాలని దిగువస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. అటు సదరం సర్టిపికెట్లలో ఉన్న వివరాలు.. ఆన్‌లైన్‌లో నమోదుచేసిన వివరాలు నమోదుచేయాలని ఆదేశాలిచ్చాం.

-కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ, పార్వతీపురం మన్యం

Updated Date - 2022-11-25T00:16:44+05:30 IST

Read more