1.34 కోట్ల పని దినాలు లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-01T05:17:51+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి జిల్లావాసులకు 1.34 కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

1.34 కోట్ల పని దినాలు లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

  జిల్లావాసులకు ‘ఉపాధి’ కల్పనపై కలెక్టర్‌ నిర్దేశం

పార్వతీపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):   ఉపాధి హామీ పథకం  కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి జిల్లావాసులకు 1.34 కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  2023-24 సంవత్సరానికి సంబంధించి ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల లక్ష్యాలు, ప్రణాళికపై డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరానికి ఇప్పటివరకు 75 లక్షల పనిదినాలు కల్పించారని, రానున్న నెలల్లో మరొక 75 లక్షల పనిదినాలు కల్పించాలని తెలిపారు. 2023-24కి 1.34 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. కనీస వేతనం రూ. 240 ఉండేటట్లు చూడాలన్నారు.  అర్హులందరికీ పని కల్పించాలని సూచించారు.  ప్రతి నెలలో చేపట్టాల్సిన పనులకు ముందస్తు ప్రణాళిక తయారు చేసుకుని లక్ష్యాలను పూర్తిచేయలన్నారు.  ఫైల్‌ మెయింటెనెన్స్‌ చేసి ఆడిట్‌ సమయంలో ఇవ్వాలని తెలిపారు. పనుల్లో ఎటువంటి అవినీతి జరగకూడదని, ఆడిట్‌ సమయంలో ఫైల్‌ తయారు చేసే విధానం  మానుకోవాలని ఆదేశించారు. ప్రజాభిప్రాయం మేరకు పనులు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రరావు ,మండల అభివృద్ధి అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

 


Updated Date - 2022-10-01T05:17:51+05:30 IST