బీసీ హాస్టళ్లలో పరిస్థితి దారుణం

ABN , First Publish Date - 2022-11-25T00:25:40+05:30 IST

బీసీ సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా వుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మునుపెన్నడూ ఇటువంటి దారుణ పరిస్థితులు లేవన్నారు.

బీసీ హాస్టళ్లలో పరిస్థితి దారుణం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున

విజయనగరం రూరల్‌, నవంబరు 24: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా వుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మునుపెన్నడూ ఇటువంటి దారుణ పరిస్థితులు లేవన్నారు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, కుళ్లిన కోడి గుడ్లను ఇస్తున్నారని చెప్పారు. బియ్యం సరిగా ఉడకని పరిస్థితి ఉందని, ఆహారం, కూరల తయారీలో ఉపయోగించే ఏ వస్తువులోనూ నాణ్యత లేదని విద్యార్థినులు వాపోయారని చెప్పారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వుంటుండగా, జగన్మోహన్‌రెడ్డి మాత్రం డాంభికాలు మాట్లాడుతున్నారన్నారు. చదువుకునే నిరుపేద, పేద, మధ్యతరగతి వారికి ఎదురవుతున్న పరిస్థితిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. ఉన్నతాధికారులు హాస్టళ్లను తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు. హాస్టళ్లలో సమస్యలపై టీడీపీ ఉద్యమిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగుయువత విభాగాలు రానున్న కాలంలో పోరాటానికి కార్యాచరణ రూపొందించనున్నాయన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కర్రోతు నర్సింగరావు, పతివాడ తారకరామునాయుడు, బెవర భరత్‌, ఎం.భానుప్రకాష్‌, ఎం వాసుదేవరావు, కోండ్రు హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:25:40+05:30 IST

Read more