దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-06-07T06:22:25+05:30 IST

జిల్లాలోని ఎస్‌కోట మండలం తిమిడి గ్రామంలో మోటారు సైకిల్‌లో నగదుతో పాటు వున్న బ్యాగును తస్కరించిన కేసులో పోలీసు లు ఇద్దరిని పట్టుకున్నారు.

దొంగలు అరెస్టు

విజయనగరం క్రైం: జిల్లాలోని ఎస్‌కోట మండలం తిమిడి గ్రామంలో మోటారు సైకిల్‌లో నగదుతో పాటు వున్న బ్యాగును తస్కరించిన కేసులో పోలీసు లు ఇద్దరిని పట్టుకున్నారు. సోమవారం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టరు కాంతారావు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖ నగరంలోని గురుద్వార్‌ జంక్షన్‌ వద్ద నివాసం వుంటున్న కొవ్వూరు దుర్గారెడ్డి గత పదేళ్లుగా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనతో పాటు సోదరుడు రాధాకృష్ణ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఇద్దరూ విశాఖ నుంచి మోటారు సైకిల్‌పై బయలుదేరి ఎస్‌.కోట చేరుకున్నారు. ఎస్‌కోట పుణ్యగిరి కళాశాల సమీపంలో కలెక్షన్‌ చేసుకుని అనంతరం కిమిడి గ్రామం వద్ద మోటారు సైకిల్‌ పెట్టి ఊర్లోకి కలెక్షన్‌కి వెళ్లారు. వీరు తిరిగొచ్చేసరికి మోటారు సైకిల్‌ డిక్కీలో పెట్టిన నగదు బ్యాగు మాయమైంది. వెంటనే దుర్గారెడ్డి ఎస్‌కోట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన మోటారు సైకిల్‌లో ఉన్న రూ.1లక్షా 26వేల 500 పోయినట్టు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ తారకేశ్వరరావు సోమవారం వాహ నాలు తనిఖీ చేస్తుండగా, స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో కొత్తవలస ఎర్రగొల్ల గ్రామానికి చెందిన రావుల రమణ, లక్కవరపుకోట మండలం రంగాపురానికి చెందిన దాస్‌ యాకుబ్‌ పట్టుబడ్డారు. వారిని ప్రశ్నించగా, దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. రావుల రమణపై ఇప్పటికే 23 కేసులు, దాస్‌ యాకుబ్‌పై 10 కేసులు వివిధ పోలీసు స్టేషన్‌లో నమోదైనట్టు సీఐ కాంతారావు తెలిపారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయలు నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించి నట్టు ఎస్‌ఐ కాంతారావు తెలిపారు. సీఐ కాంతారావు, ఎస్‌ఐ తారకేశ్వరరావు, లోవ రాజు, ఎఎస్‌ఐలు గౌరీశంకర్‌, రాంబాబుతో పాటు ఎస్‌కోట సీసీఎస్‌ కానిస్టేబుల్స్‌ని ఎస్‌పీ దీపికాపాటిల్‌ అభినందించారు. 

Updated Date - 2022-06-07T06:22:25+05:30 IST