చవితి సందడి

ABN , First Publish Date - 2022-08-31T05:31:56+05:30 IST

వినాయక చవితిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గణేశుడికి ఘనంగా పూజలు చేసేందుకు అందరూ సన్నద్ధమయ్యారు.

చవితి సందడి
కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న విజయనగరం మార్కెట్‌


ఆకట్టుకునేలా మండపాల ముస్తాబు
కిటకిటలాడిన విజయనగరం మార్కెట్‌
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

వినాయక చవితిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గణేశుడికి ఘనంగా పూజలు చేసేందుకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు పేరిట విఘ్నేశ్వరుడిని కొలువనున్నారు. వాడవాడలా మండపాలు తీర్చిదిద్దారు. పూల దండలు.. మామిడాకుల తోరణాలు కట్టారు. వీధులను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. గ్రామాలు, పట్టణాల్లో పోటాపోటీగా వినాయక ప్రతిమలను తయారు చేయించారు. భారీ విగ్రహాలను అందులోనూ భిన్నంగా రూపొందించడంలో విజయనగరం కళాకారులది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుంచే జిల్లా అంతటా ప్రతిమలు తరలివెళ్లాయి. ట్రాక్టర్లు, వ్యాన్లలో భారీ విగ్రహాలను తీసుకువెళ్లారు. మరోవైపు మంగళవారం జిల్లా అంతటా వినాయక మట్టి ప్రతిమల పంపిణీ విస్తృతంగా జరిగింది. స్వచ్ఛంద సంస్థలు, నాయకులు వాటిని అందజేశారు. మార్కెట్‌ కోలాహలంగా మారిపోయింది. రోజంతా పూజా సామగ్రి కొనుగోలు చేసే వారితో కిటకిటలాడింది. విజయనగరం మార్కెట్‌లోకి ద్విచక్రవాహనం కూడా వెళ్లలేకపోయింది. పూజలో ఉపయోగించే సీతాఫలాలు, వెలక్కాయ, మామిడాకులు, మారెడాకులు, బత్తాయి, ఆపిల్‌, తదితర అమ్మకాలు విరివిగా సాగాయి.
- గత రెండేళ్లుగా కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉత్సవాలను సందడిగా నిర్వహించలేకపోయారు. ఈ ఏడాది ఇదివరకటి కళ కనిపించింది. నెల రోజుల ముందునుంచే యువత, పిల్లలు వినాయక చవితి సన్నాహాల్లో నిమగ్నం కావడం కనిపించింది. చందాలు విరివిగా పోగు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు యువకులు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.


Updated Date - 2022-08-31T05:31:56+05:30 IST