ఆరోగ్యంపై మంచు ప్రభావం అధికం

ABN , First Publish Date - 2022-12-09T23:59:21+05:30 IST

‘మంచు అని తేలిగ్గా తీసుకోవద్దు. పొగమంచు అన్న నిర్లక్ష్యం వద్దు’.. అవి ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం చూపుతాయి. అనారోగ్యానికి గురిచేస్తాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై పంజా విసురుతాయి.

ఆరోగ్యంపై మంచు ప్రభావం అధికం
రాజాంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు

‘పగ’మంచు!

ఆరోగ్యంపై మంచు ప్రభావం అధికం

నిర్లక్ష్యం చేస్తే చేటే

అప్రమత్తమే శ్రీరామరక్ష అంటున్న నిపుణులు

(రాజాం రూరల్‌)

‘మంచు అని తేలిగ్గా తీసుకోవద్దు. పొగమంచు అన్న నిర్లక్ష్యం వద్దు’.. అవి ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం చూపుతాయి. అనారోగ్యానికి గురిచేస్తాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై పంజా విసురుతాయి. పంటలు, పశుపక్షాదులకు సైతం తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. దీనికి అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విపరీతమైన పొగమంచు కరుస్తోంది. చలి తీవ్రత కూడా పెరిగింది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాటించకుంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

- ప్రధానంగా చిన్నారులకు చిన్నపాటి గాలి తగిలినా.. జలుబు, దగ్గు వంటి రుగ్మతలు చేరుతాయి. అందుకే వీలైనంతవరకూ సాయంత్రం 4 గంటలు దాటితే పిల్లలను బయటకు పంపించకూడదు. అటు ఉదయం 8 గంటల వరకూ వారిని ఇంటిపట్టునే ఉంచడం మంచిది. వేడి నీరుతో స్నానం చేయించడం ఉత్తమం. స్కూల్‌కు పంపించినప్పుడు స్వెర్టర్లు అందుబాటులో ఉంచడం మంచిది. వీలైనంత వరకూ వేడి ఆహార పదార్థాలు పిల్లలకు వడ్డించాలి. ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, కూల్‌ డ్రింక్‌లు వంటి వాటికి దూరంగా ఉంచాలి. నెలల వయసుండే చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారు చలికి తట్టుకునే విధంగా వేడిని అందించాలి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి వైద్యం అందించాలి.

- వృద్ధుల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. చాలామంది వృద్ధులు వేకువజామున నిద్రలేవడం అలవాటు. అటువంటి వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలి. ప్రధానంగా అస్మా వంటి రుగ్మతలతో బాధపడేవారిని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల తరువాత ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఉత్తమం. మద్యం, దుమపానం అలవాటు ఉన్నవారు వీలైనంత వరకూ వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

- వీలైనంత వరకూ ఉదయం 10 గంటల్లోపు.. సాయంత్రం నాలుగు గంటల తరువాత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలామంచిది. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగ వాహన చోదకులు ఎక్కువగా రాత్రిపూటే రాకపోకలు సాగిస్తుంటారు. పాలు, కూరగాయలు, పెట్రోల్‌, నిత్యావసరాలు వంటి సరఫరా రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. అటువంటి వాహన చోదకులు వీలైనంతవరకూ వేగ నియంత్రణ పాటించడం ఉత్తమం.

జాగ్రత్తలు అవసరం

మంచు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మంచుబారిన పడితే శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. హృదయ స్పందనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. గర్భిణులు, చిన్నపిల్లలు, మంచులోకి రాకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే తలకు, చెవులకు రక్షణ కలిగించే దుస్తులు వాడాలి. మంచులో నుంచి వచ్చిన వెంటనే వేడినీటితో స్నానం చేయడం మంచిది.

-డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ రాజు, ఆస్మా వైద్యులు, రాజాం

ఊపిరితిత్తులపై ప్రభావం

ఈ సీజన్‌లో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఆస్త్మా ఉన్న పిల్లల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచు, దుమ్ముతో ఊపిరితిత్తులపై భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల్లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో మార్పులు వల్ల చర్మ సంబంధ వ్యాదులు సంక్రమించే అవకాశాలున్నాయి. ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.

-డాక్టర్‌ సత్య శ్రీనివాస్‌, చిల్డ్రన్స్‌ స్పెషలిస్ట్‌, సామాజిక ఆసుపత్రి, రాజాం.

గుండె జబ్బులకు అవకాశం

ఐదు పదుల వయసు దాటిన వారు మద్యం సేవించకూడదు. దూమపానం చేయకూడదు. చలిమంటలకు దూరంగా ఉండాలి. వీటివల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా యూరిన్‌ ద్వారా బయటకు పోయి డీ హైడ్రేషన్‌ సంభవిస్తుంది. గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. పొలం పనులకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్క్‌ వాడాలి. దుమ్ము సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

డాక్టర్‌ నాగేశ్వరరావు, సామాజిక ఆసుపత్రి, రాజాం

Updated Date - 2022-12-09T23:59:22+05:30 IST