టెన్త్‌ ఫలితాల్లో రాణించారు

ABN , First Publish Date - 2022-06-07T05:44:58+05:30 IST

పదోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు.

టెన్త్‌ ఫలితాల్లో రాణించారు
పార్వతీపురం డీఈవో కార్యాలయంలో జ్ఞానేశ్వరిని అభినందిస్తున్న ఇన్‌చార్జి డీఈవో బ్రహ్మాజీరావు, హెచ్‌ఎం ప్రసాదరావు

  సత్తాచాటిన బాలికలు 

  జిల్లాలో 9,198 మంది ఉత్తీర్ణత

  1,553 మంది ఫెయిల్‌

77.5 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి జిల్లాకు మూడో స్థానం 

 పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, జూన్‌ 6:  పదోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. కరోనా నేపథ్యంలో 2019-20, 2020-2021 విద్యా సంవత్సరాల్లో  ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించకుండానే ఆల్‌ పాస్‌ చేసింది. కాగా ఈ ఏడాది కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఏప్రిల్‌ 27 నుంచి సర్కారు పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలురు కంటే బాలికలే అత్యధికంగా  ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 10,751 మంది పరీక్షలు రాయగా, 9,198 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,553 మంది ఫెయిల్‌ అయ్యారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ప్రభుత్వ పాఠశాలకు చెందిన పి.జ్ఞానేశ్వరి 587 మార్కులు,  సాలూరు ఎంజేపీ బీసీ రెసిడెన్షిల్‌ పాఠశాలకు చెందిన పీఎంవీ యామిని 583 మార్కులు, కురుపాం ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎం.మనీష 582 మార్కులు సాధించారు. జిల్లాలో అత్యధికంగా గుమ్మలక్ష్మీపురం మండలం 99.843 శాతం మేర ఉత్తీర్ణత సాధించింది.  కురుపాం మండలం 97.5 శాతం, జియ్యమ్మవలస 95.9 శాతం మేర ఉత్తీర్ణత సాధించాయి.  పాలకొండ 71 శాతం,  సీతంపేట 76.2,  భామిని 77.6 ,  వీరఘట్టం 91.7,  బలిజిపేట 90.8, పాచిపెంట 90.5,  సీతానగరం 90.3,  గరుగుబిల్లి 89.8, సాలూరు 86.8, మక్కువ 86.1 , కొమరాడ  80.2,  78.9 శాతం ఉత్తీర్ణ శాతంతో పార్వతీపురం మండలాలు నిలిచాయి.    

 శతశాతం ఉత్తీర్ణతతో.. 

సాలూరు మండలంలో కొత్తవలస, కురుకూటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు,  తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, గుమ్మలక్ష్మీపురం జడ్పీ హైస్కూల్‌,  భద్రగిరి బాలుర గురుకుల పాఠశాల,  పీటీజీ గురుకుల పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. కురుపాం మండలంలోని ఎనిమిది గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు,  గరుగుబిల్లి మండలం రావుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, జియ్యమ్మవలస, పిప్పలభద్ర హైస్కూళ్లు,  ఆర్‌ఆర్‌బీ టీడబ్ల్యూఏహెచ్‌ స్కూల్‌ శతశాతం ఉత్తీర్ణత సాధించాయి.


Updated Date - 2022-06-07T05:44:58+05:30 IST