-
-
Home » Andhra Pradesh » Vizianagaram » TDP leaders demand to reduce RTC charges-MRGS-AndhraPradesh
-
నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-04T05:19:20+05:30 IST
ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మూడేళ్లలో మూడుసార్లు ప్రజలపై భారం మోపిన సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ నేతల డిమాండ్
జిల్లావ్యాప్తంగా నిరసనలు
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/ సాలూరు/ కురుపాం, జూలై 3 : ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మూడేళ్లలో మూడుసార్లు ప్రజలపై భారం మోపిన సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్సుల్లోకి ఎక్కి టిక్కెట్లు కొనుగోలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చార్జీలు, ప్రస్తుత సర్కారు పెంచిన చార్జీలకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రయాణికులకు వివరించారు. డీజిల్ సెస్ పేరిట పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తగ్గిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సాలూరులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఆధ్వర్యంలో నేతలు హైవేపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ చార్జీలు తగ్గించే వరకూ ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఓ వైపు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తూనే.. మరోవైపు చార్జీల పేరిట ప్రజలను బాదడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనించి, తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నేతృత్వంలో నేతలు ధర్నా చేశారు. ఆయన ఆరోగ్యం బాగులేకపోవడంతో కారులో ఉండే నిరసన తెలియజేశారు. ధరలు, పన్నులతో ప్రజల నడ్డివిరుస్తున్న సర్కారు తీరుని తప్పుబట్టారు. గుమ్మలక్ష్మీపురంలో కురుపాం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి, పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కె.అప్పలనాయుడు, తెలుగు యువత అరకు పార్లమెంటు అధ్యక్షులు వి.సుమంతనాయుడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.