సరిగా చదవలేకపోతున్నా

ABN , First Publish Date - 2022-09-08T05:32:22+05:30 IST

ఎచ్చెర్లలోని(శ్రీకాకుళం క్యాంపస్‌) ట్రిపుల్‌ ఐటీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బవిరి విశిష్ట రోషిణి(17).. బుధవారం బలవన్మరణానికి పాల్పడింది.

సరిగా చదవలేకపోతున్నా
ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు ముందు పోలీసు బందోబస్తు

అమ్మానాన్న.. నన్ను క్షమించండి
 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని బలవన్మరణం
మృతురాలిది  సాలూరు
పుట్టినరోజు ముందునాడే ఘటన

(ఎచ్చెర్ల/సాలూరు, సెప్టెంబరు 7)

ఆ విద్యార్థిని చదువులో బాగా ప్రతిభ చూపేది. రెండేళ్ల కిందట ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీటు సాధించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటుందని ఆశించారు. గురువారం ఆ విద్యార్థిని పుట్టిన రోజు కావడంతో.. క్యాంపస్‌ నుంచి ఇంటికి వస్తుందని సంబరపడ్డారు. కానీ.. వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. అందనంత దూరాలకు వెళ్లిపోయింది. బుధవారం సెమిస్టర్‌ పరీక్షకు హాజరైన ఆ విద్యార్థిని.. అరగంట ముందుగానే వసతిగృహానికి చేరుకుని బలవన్మరణానికి పాల్పడింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. ఆశించినస్థాయిలో చదవలేకపోతున్నా’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. పుట్టినరోజు ముందునాడు ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది.
ఎచ్చెర్లలోని(శ్రీకాకుళం క్యాంపస్‌) ట్రిపుల్‌ ఐటీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బవిరి విశిష్ట రోషిణి(17).. బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. 8న రోషిణి పుట్టిన రోజు కాగా.. ముందురోజు నాడు రోషిణి బలన్మరణానికి పాల్పడంతో తల్లిదండ్రులతో పాటు క్యాంపస్‌ ఆవరణలో విషాద ఛాయలు అలముకున్నాయి. రోషిణిది సాలూరు పట్టణం తట్టికోటవీధి. తండ్రి హరనాఽఽథ ఆచారి కరూర్‌ వైశ్యా బ్యాంకులో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి సౌజన్య 2008 డీఎస్సీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. రోషిణి చదువులో బాగా ప్రతిభ చూపేది. రెండేళ్ల కిందట ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీటు సాధించి.. తొలుత నూజివీడులో చేరింది. ప్రస్తుతం శ్రీకాకుళం క్యాంపస్‌లో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా ఉదయం 9 నుంచి 12 వరకు చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం చివరి పరీక్ష ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన రోషిణి.. సమయం ముగియకుండానే అరగంట ముందుగా వసతిగృహానికి చేరుకుంది. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అటు వెళ్లిన హాస్టల్‌ నిర్వాహకులు, సిబ్బంది ఎస్‌-70 గది తలుపులు వేసి ఉండటాన్ని గమనించారు. తలుపులు తీసి చూడగా రోషిణి విగతజీవిగా కనిపించింది. ట్రిపుల్‌ ఐటీ అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే ఆ విద్యార్థినిని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు హరనాధ ఆచారి, సౌజన్యతో పాటు తాతయ్య, నాన్నమ్మలు అన్నాజీరావు, వరలక్ష్మి క్యాంపస్‌కు చేరుకుని బోరున విలపించారు. పరీక్షలు పూర్తిచేసుకుని.. పుట్టినరోజు నాడు ఇంటికి వస్తావని ఎదురుచూస్తే.. ఇలా తీరనిలోకాలకు వెళ్లిపోయావా తల్లీ అంటూ రోదించారు. పీయూసీ ప్రధమ సంవత్సరంలో 9.3 క్రెడిట్లను సాధించిన రోషిణి చదువులో ముందంజలో ఉండేదని అధ్యాపకులు చెబుతున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియడం లేదని వాపోతున్నారు.  ఈ ఘటనతో స్వగ్రామమైన సాలూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసు విచారణ
ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్‌లో రోషిణి గదిని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ క్షుణ్నంగా పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మీరు ఆశించిన స్థాయిలో చదవలేకపోతున్నాను. అందుకే మీ నుంచి శాశ్వతంగా దూరమవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడిని బాగా చదివించండి’ అంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసి రోషిణి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు భద్రపరిచారు. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరు నెలల వ్యవధిలో-
ఈ ఏడాది ఫిబ్రవరి 16న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు(16) బలన్మరణానికి పాల్పడింది. ఆరు నెలల వ్యవధిలోనే మరో సంఘటన జరగడంతో ట్రిపుల్‌ ఐటీ అధికారులు, విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా మనోవికాస తరగతులు, ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 

Updated Date - 2022-09-08T05:32:22+05:30 IST